NWDA meeting: ఏపీ ఇంట్రా లింకులను ఒప్పుకోబోమన్న తెలంగాణ
మా సమ్మతి లేకుండా ఆమోదించొద్దని వాదన
గోదావరి కావేరి లింకులో భాగంగా 74 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్
తిరస్కరించిన ఎన్‌డబ్ల్యూడీఏ
ఇచ్చంపల్లి నుంచి జీసీ లింక్‌కు షరతులు పెట్టిన తెలంగాణ
2023 సీడబ్ల్యూసీ రిపోర్ట్ పరిగణలోకి తీసుకోవడం కుదరదన్న ఏపీ
మరోమారు సమావేశం నిర్వహిస్తామన్న సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్
వర్చువల్‌గా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల అధికారులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ)ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో 6వ సంప్రదింపుల కమిటీ భేటీ నిర్వహించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం 2 గంటలకు పైగా సుదీర్ఘ సమయంపాటు కొనసాగింది. తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు ప్రత్యక్షంగా హాజరు కాగా, ఏపీ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు వర్చువల్‌గా పాల్గొన్నాయి.
ఈ సమావేశంలో ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పాల్గొనలేదు. తెలంగాణ, ఏపీ మధ్య వాడివేడిగా జరిగాయి. తెలంగాణ అధికారులు వాదనలను బలంగా వినిపించారు. నీటి వాటాను తేల్చాల్సిందేనని, గోదావరి కావేరి లింక్‌లో భాగంగా తరలించే 148 టీఎంసీల జలాల్లో సగం 74 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీసీ(గోదావరి కావేరి) లింక్‌ను తెలంగాణ భూభాగం నుంచే చేపడుతున్నా కేవలం 45 టీఎంసీలే కేటాయించారని, దీంతో చాలా ప్రాంతాలకు నీరందకపోవడంతో కరువు ప్రాంతాలుగా మారాయని తెలిపారు. ఆ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని 74 టీఎంసీలు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు.
అయితే, తెలంగాణ అధికారుల విజ్ఞప్తిని ఎన్‌డబ్ల్యూడీఏ తిరస్కరించింది. సగం వాటా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఇచ్చంపల్లి నుంచి జీసీ లింక్‌ను చేపడితే.. షరతులతో చేపట్టాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా చైర్మన్ కు సూచించారు. గోదావరిలో కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి రక్షణ కల్పించాలని కోరారు. 148 టీఎంసీల తరలింపునకు చత్తీస్‌గఢ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. జీసీ లింక్‌తో దేవాదుల లిఫ్ట్‌లో 38.16 టీఎంసీలు, సమ్మక్కసాగర్‌లో 46.96 టీఎంసీలు, సీతమ్మసాగర్– సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టుల్లో 67.05 టీఎంసీలు కలిపి 152.17 టీఎంసీల నీటి వినియోగానికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూడాలన్నారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే సమ్మక్కసాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడకుండా చూడాలని, రాష్ట్రానికి జీసీ లింక్‌లో ఇచ్చే వాటా, కరువు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు 200 టీఎంసీలు ఇచ్చంపల్లి నుంచి వాడుకునేలా అనుమతి ఇవ్వాలని రాహుల్ బుజ్జా కోరారు.
ఏపీ 4 ఇంట్రాలింకులను ఒప్పుకోమన్న తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్ఆర్ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లను ఇంట్రా లింక్ కింద చేపట్టేందుకు కేంద్రం సహకరించాలని కోరింది. అందుకు సంబంధించి వివరాలను ఎన్‌డబ్య్లూడీఏకు అందజేసింది. దీంతో ఆ నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డులు, విభజనచట్టంలోని నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా 200 టీఎంసీల వరద జలాలను తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ఇప్పటికే అన్ని ఏజెన్సీలు అభ్యంతరం తెలిపాయని, అది గోదావరి ట్రిబ్యూనల్ అవార్డుకు విరుద్ధమని తెలంగాణ అధికారులు తెలిపారు. తెలంగాణ కోటా కింద ఇచ్చే నీళ్లను శ్రీరాంసాగర్ లేదా దేవాదుల ఆయకట్టు స్థిరీకరణకు వాడుకోవాలన్న నిబంధనలను ఎన్‌డబ్ల్యూడీఏ పెడుతుండటంతో తెలంగాణ అంగీకరించలేదు. ఆ నీటిని రాష్ట్రంలోని ఎక్కడైనా వాడుకునేలా తమకు స్వేచ్ఛనివ్వాలని కోరారు. సాగర్ నుంచి రీప్లేస్మెంట్ అన్నారే తప్ప ఎలా అనే వివరాలను మాత్రం చెప్పలేదని, ఈ నిర్ణయంపై పున:సమీక్షించాలని కోరారు. గోదావరి కావేరి లింక్ ను అంగీకారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, ఇంటర్‌స్టేట్ ఎస్ఈ విజయ్ కుమార్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ , పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read Also– Bharatiya Antariksh Station: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ నమూనా విడుదల
ఏపీ అధికారులు ఏమన్నారంటే..
ఏపీ అధికారులు మాట్లాడుతూ, 2023 సీడబ్ల్యూ సీ రిపోర్ట్ పరిగణలోకి తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. దాని ఆధారంగా ముందుకు పోతే ఏపీ ప్రాజెక్టులన్నీ దెబ్బతింటాయి..కాబట్టి ముందుకు పోవద్దు అని కోరారు. చత్తిస్ ఘడ్ రాష్ట్రం మా నీళ్లను ఇవ్వబోం.. రెండు ప్రాజెక్టులను ప్లాన్ చేసుకున్నారన్నారు. సాగర్, సోమశిల లో క్యారీఓవర్ స్టోరేజీ ఉందని, ఇక్కడ నీళ్లూ వేయడం తీసుకెళ్లడం అంత సులువు కాదన్నారు. తుంగభద్రలో కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వరా అని ప్రశ్నలు వేశారు. గోదావరి-కావేరి లింకును పోలవరం నుంచే చేపట్టాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టు మాకు సమ్మతమే అని తెలిపారు. అయినాకాని పోలవరం నుంచే చేపట్టాలని డిమాండ్ చేశారు. నీరు కృష్ణాబేసిన్ లో వేస్తారు దాంట్లో ఇతర రాష్ట్రాలు వాటా అడుగవచ్చు. నిరోధించాలి.. నీటిలభ్యతపై తేడాలున్నాయన్నారు.
కర్ణాటక వాదన ఇదే
ర్నాటక అధికారులు మాట్లాడుతూ సమాన వాటా ప్రకారం చూసుకున్నా మాకు ఎక్కువ రావాలన్నారు. మావాటా 45టీఎంసీలు ఇవ్వాలి .. కాదంటే 40టీఎంసీలైనా ఇవ్వాలని కోరారు. బెడ్తి వరదతో మాకు ప్రయోజనం లేదు.. ఇంట్రాలింక్ లో కలుపవద్దు అన్నారు. దీంతో ఇంట్రా లింక్ ద్వారా నైతే ఒక్క పైసా కేంద్రం ఇవ్వదు.. ఇంటర్ లింకింగ్ కంటిన్వూ అవ్వండి.. నేను ఎంవోయూ సంతకాలు చేస్తాం.. పుదుచ్చేరి, తమిళనాడు ఓకే అని తెలిపాయి.
మహారాష్ట్ర ఏమన్నదంటే..
మహారాష్ట్ర అధికారులు మాట్లాడుతూ పరివాహాక ప్రాంతం 48%, కృష్ణాలో మాదే మేజర్ .. మాకు నీళ్లు ఇవ్వకపోడం తగునా అని ప్రశ్నించారు.మాకు ఇంట్రాలింక్ ప్రాజెక్టులను నేషనల్ ప్లానింగ్ లో భాగంగా ఇవ్వాలన్నారు. ఇంద్రావతి నుంచి 41టీఎంసీలు, డైవర్షన్ మేరకు ఆ మేరకు జలాలు కూడా ఇవ్వాలని కోరారు.
Read Also– Viral News: పేమెంట్ ఫెయిల్ కావడంతో భార్యకు తెలిసిపోయిన భర్త సీక్రెట్ శారీరక సంబంధం
ఛత్తీస్‌గఢ్ వాదన ఇదే
ఛత్తీస్‌గఢ్ అధికారులు మాట్లాడుతూ మాకు 301టీఎంసీలు కేటాయింపు ఉండగా.. 164వాడుతున్నదన్నారు.ఇప్పుడు 100టీఎంసీలతో సబోద్ ఘాట్ చేపడుతున్నాం అన్నారు. ఇది మల్టీపర్పస్ ఇరిగేషన్ 4లక్షల హెక్టార్లు..మీ నీటిని వాడుకోం..మీరు వినియోగం మొదలైతే వెంటనే ఆపేస్తాం అని అధికారులు తెలిపారు. హిమాలయన్ కాంపోనెంట్ నుంచి నీళ్లను తెస్తామన్నారు.ఆ నీళ్లను ఇక్కడ పంచుతున్నాం..పెద్దమనసుతో సహకరించి ప్రాజెక్టుకు అంగీకరించాన్నారు. ఇది గోదావరి నుంచి చుక్క నీటిని ముట్టుకోం అన్నారు.
కర్నాటక అధికారులు మాట్లాడుతూ నిర్ధిష్టంగా నీళ్లు ఇచ్చారన్నారు. మిగిలిన రాష్ట్రాలు సైతం తమతమ వాటాలపై మాట్లాడారు.
మరోమారు సమావేశం నిర్వహిస్తాం: సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్
మరోమారు సమావేశం నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల అధికారుల అభిప్రాయం తీసుకున్న ఆయన.. సమగ్రంగా పరిశీలిస్తామని తెలిపారు. తదుపరిసమావేశం నిర్వహించి మరోమారు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తామని, హాజరు కానీ రాష్ట్రాలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తదుపరి సమావేశంలో నీటి వాటాలపై క్లారిటీఇస్తామని సూత్రప్రాయంగా పేర్కొన్నట్లు సమాచారం. సమావేశ తేదీని సైతం ప్రకటిస్తామని వెల్లడించినట్లు తెలిసింది.