China-India: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచడాన్ని చైనా ఆక్షేపించింది. సుంకాల విషయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు (China-India) ప్రకటించింది. ఈ మేరకు భారతదేశంలో చైనా రాయబారి శూ ఫెయీహాంగ్ (Xu Feihong) గురువారం అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వేధింపుల ధోరణి అవలంభిస్తోందని ఆయన అభివర్ణించారు. ఉచిత వాణిజ్యంతో అమెరికా కొన్నేళ్లుగా ఎంతో లాభపడిందని, కానీ నేడు టారిఫ్‌లను బేరసారాలకు ఒక ఆయుధంగా మలుచుకుంటోందని ఆయన విమర్శించారు.
Read Also- Jaishankar Putin Meet: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. కీలక చర్చలు!
భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలను విధించడం ద్వారా, అమెరికా తన నిజరూపాన్ని చూపించిందని శూ ఫెయీహాంగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించిన ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. నిశ్శబ్దంగా ఊరుకొని ఉంటే, వేధింపులకు గురిచేసేవారు ఇంకా ఎక్కువగా దౌర్జన్యం చేస్తారని, భారత్‌కు చైనా అండగా నిలుస్తుందని ఫెయీహంగ్ బలంగా చెప్పారు.
Read Also- Miyapur Sad News: కుటుంబాన్ని చిదిమేసిన ఆర్థిక సమస్యలు.. రెండేళ్ల చిన్నారికి అన్నంలో..
భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో అవకాశాలపై స్పందిస్తూ, భారతీయ ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లోకి ప్రవేశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇరుదేశాల మధ్య వాణిజ్యం జరిగితే, పరస్పర అభివృద్ధికి అవకాశాలు మరింత పెరుగుతాయని ఫెయిహాంగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘భారతదేశానికి ఐటీ, సాఫ్ట్‌వేర్, బయోమెడిసిన్ రంగాల్లో పోటీ పడుతోంది. మరోవైపు, చైనాలో ఎలక్ట్రానిక్స్ తయారీ, మౌలిక సదుపాయాల నిర్మాణం, నూతన ఇంధన రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పరస్పర సహకారం చాలా కీలకం’’ అని ఫెయీహాంగ్ సూచించారు. ఫెయీహాంగ్ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు తీసుకుంటున్న వాణిజ్య విధానాలపై చైనా అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
భారతదేశం-చైనా మార్కెట్లు అనుసంధానమైతే, వాటి ప్రభావం రెండింటి కన్నా ఎక్కువగా ఉంటుందని చైనా రాయబారి శూ ఫెయీహాంగ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఉన్న చైనా కంపెనీలకు సమతుల్యమైన, న్యాయపరమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణం లభించాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘‘భారత్‌లో మరిన్ని చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని మేము ఆశిస్తున్నాం. అదే విధంగా, భారతదేశంలోని చైనా సంస్థలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసేకునే వాతావరణాన్ని భారత్ కల్పించాలి. ఈ ద్వైపాక్షిక సహకారం రెండు దేశాల ప్రజలకు లాభదాయకంగా ఉంటుంది’’ అని ఫెయీహాంగ్ వివరించారు.