Miyapur Sad News: మియాపూర్‌లో వర్ణణాతీతమైన విషాదం
రెండేళ్ల చిన్నారికి విషమిచ్చి.. నలుగురి బలవన్మరణం
ఆర్థిక సమస్యలే కారణమని అనుమానాలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఆర్థిక సమస్యలకు ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నది కాదనలేని యథార్థం. మోయలేని ఆర్థిక ఒత్తిళ్లతో కొందరు, ఉపాధి అవకాశాలు దొరక్క మరికొందరు, కనీసం కడుపునింపుకోలేని దుస్థితిలో ఉన్నవారు ఇంకొందరు. రూపం ఏదైతేనేం ఆర్థిక కష్టాలకు తలొగ్గి ఎందరో బలవర్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని మియాపూర్‌లో (Miyapur Sad News) మాటల్లో వర్ణించలేని విషాదం నెలకొంది.
ముద్దుముద్దు మాటలు చెప్పే రెండేళ్ల చిన్నారిని.. ఇంతకాలం ఆడించిన చేతులతోనే విషం ఇచ్చారు. ఆ తర్వాత కుటుంబంలో నలుగురు సభ్యులూ బలవన్మరణానికి పాల్పడ్డారు. మొత్తంగా ఐదుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి, ఒకేచోట ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా తీవ్ర సంచలనం రేపిన ఈ విషాదఘటన గురువారం ఉదయం వెలుగుచూసింది.
ఏ సమస్య వచ్చిందో ఏమోకానీ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55) దంపతులు, రెండో కూతురు కవిత (38), అల్లుడు అనిల్ (40) అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. కవిత దంపతులకు రెండేళ్ల వయసున్న కూతురు ఉంది. ఆ చిన్నారి పేరు అప్పూ. బుధవారం రాత్రి అప్పూకు విషం కలిపిన భోజనం తినిపించారు. ఆ తర్వాత లక్ష్మయ్య, వెంకటమ్మ, కవిత, అనిల్ కూడా విషం కలిపిన భోజనం తిన్నారు. దీంతో, ఐదుగురూ అక్కడికక్కడే చనిపోయారు.
Read Also- Diwali Special Trains: దీపావళి సమీపిస్తున్న వేళ ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్
గురువారం ఉదయం ఇరుగుపొరుగువారు ఆ ఐదుగురు విగతజీవులుగా పడివుండడాన్ని గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్‌బాడీలను పంచనామా కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబంలోని పెద్ద వాళ్లంతా కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారని స్థానికులు చెప్పారు. కాగా, ఆర్థిక సమస్యల కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.
బలవన్మరణాలు వొద్దు..
ఆర్థిక సమస్యలు, లేదా ఇంకేమైనా సమస్యలు ఉండవచ్చు. కానీ, వాటిని ఎదుర్కొనే విధంగా మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. అంతేతప్ప, ప్రాణాలు తీసుకునే విధంగా ఆలోచించకూడదనీ మానసిన నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అభంశుభం తెలియని చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని చెబుతున్నారు.
Read Also- TVK Vijay: ఎన్నికల్లో పొత్తుపై టీవీకే అధినేత, హీరో విజయ్ కీలక ప్రకటన
కాగా, వ్యయాల్లో అసమానతలు, ఆర్థిక పరమైన అవగాహన లోపాలు చాలా కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. నేటి కాలంలో ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం లభించపోవడం, విద్య, వైద్యం, ఇంటి అద్దెలు ఇలా ప్రతి ఒక్కటీ భారంగానే మారిపోయాయి. మరోవైపు, పొదుపు, పెట్టుబడి పథకాలపై అవగాహన లేనివారు చాలామందే ఉన్నారు. మరికొందరు ఆర్థిక వ్యవహారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందుల్లో పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యల్లాంటి విషాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి విషయాలను కుటుంబ సభ్యుల మధ్య, బహిరంగంగా చర్చించడం చాలా ముఖ్యం. తద్వారా బయటపడే మార్గాలు దొరుకే అవకాశం ఉంటుంది.