delhi highcourt reserves verdict on brs mlc kavitha bail petition in delhi liquor case Delhi Liquor Case: కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. హైకోర్టు నిర్ణయం ఏమిటీ?
MLC Kavitha
క్రైమ్

Delhi Liquor Case: కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. హైకోర్టు నిర్ణయం ఏమిటీ?

BRS MLC Kavitha: మాజీ సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత పాత్ర లేదని, ఒక్క సాక్ష్యాధారమూ లేదని, అక్రమంగా అరెస్టు చేసిన కవితను విడుదల చేయాలని నిన్న ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ ఇవ్వకూడదని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మే 30 లేదా 31వ తేదీల్లో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించే అవకాశం ఉన్నది.

ఈడీ తరఫున వాదనలు వినిపించిన జోహెబ్ హుస్సేన్ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని అన్నారు. ఈ కేసులో ఆమెది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సంపాదించిన సొమ్ము అంతా నేరుగా కవితకు చేరినట్టు వాదించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఇండియా అహెడ్ అనే చానెల్‌లో కవిత పెట్టుబడి పెట్టారని చెప్పారు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ తెలిపారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందని వివరించారు. ఈ డేటా ధ్వంసంపై సరైన సమాధానాలను కవిత ఇవ్వలేదని అన్నారు.

కవిత అరెస్టు నిబంధనలకు, చట్టాలకు లోబడే జరిగిందని సీబీఐ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో వాదించారు. లిక్కర్ పాలసీ ద్వారా ఆమె లబ్ది పొందారని వివరించారు. ఈ సందర్భంగా కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కోర్టుకు ఈడీ, సీబీఐ సమర్పించాయి. ఢిల్లీ లిక్కర్ కేసు ప్రస్తుతం కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని న్యాయవాది అన్నారు. కాబట్టి ఆమెకు బెయిల్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు.

వాస్తవానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అందులో కవిత పేరు లేదని, ఆ తర్వాత కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో కవిత పేరు ప్రస్తావించి, అంతా కవితనే చేశారని వాదిస్తున్నారని కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి నిన్న కోర్టులో వాదించారు. అరెస్టు చేసిన తర్వాత బెయిల్ కోసం ప్రయత్నించినా.. ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారని చెప్పినా ట్రయల్ కోర్టు కనికరించలేదని వివరించారు. ఒక పార్టీలో ముఖ్య నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఉన్న కవితపై తప్పుడు ఆరోపణలు చేసి ఒక మహిళగా ఆమెకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయని ఆరోపించారు. కవిత తన మొబైల్ ఫోన్లు అన్నింటినీ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే .. వాటిని ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నదని లాయర్ విక్రమ్ చౌదరి గుర్తు చేశారు. కానీ, వాడని మొబైల్ ఫోన్లను వేరే వారికి ఇస్తే వాళ్లు ఫార్మాట్ చేసుకుని వినియోగించుకున్నారని, దానికి తమ క్లయింటే ఫోన్లు ధ్వంసం చేసిందని ఈడీ ఆరోపించిందని తెలిపారు. మొత్తం 11 ఫోన్లు ఈడీకి ఇస్తే అందులో 4 ఫోన్లు ఫార్మాట్ చేయబడ్డాయని వివరించారు.

ఇక సీబీఐ కూడా చట్టవ్యతిరేకంగా కవితను అరెస్టు చేసిందని న్యాయవాది విక్రమ్ ఆరోపించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను విచారించాలని కోర్టులో పిటిషన్ వేసింది. అందుకు కోర్టు అంగీకరించింది. కానీ, దీనిపై కవితకు ఎలాంటి సమాచారం అందలేదని, సీఆర్పీసీ చట్టాల ప్రకారం ఆమెను విచారించడానికి ఆమె సమ్మతం కూడా తీసుకోవాల్సి ఉంటుందని, కనీసం అరెస్టు వారెంట్ కూడా లేకుండానే కవితను అరెస్టు చేశారని అన్నారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..