CP Radhakrishnan Nomination: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు తొలి నామినేషన్ పడినట్లైంది. నామినేషన్ దాఖలు సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), ఆరోగ్య మంత్రి – బీజేపీ పార్టీ అధ్యక్షుడు జె.పీ. నడ్డా (JP Nadda), రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Nithin Gadkari) తదితరులు రాధాకృష్ణన్‌తో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రధాని సంతకంతో..
ఉపరాష్ట్ర పదవి నామినేషన్ ప్రక్రియలో భాగంగా సీపీ రాధాకృష్ణన్ నాలుగు సెట్ల పత్రాలను రాజ్యసభ సెక్రటరీకి అందజేశారు. మొదటి సెట్‌లో ప్రధాని మోదీ తన సంతకంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. నామినేషన్ కు ముందు పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్ ను రాధాకృష్ణన్ సందర్శించారు. అక్కడి మహత్మాగాంధీ విగ్రహానికి, రాజకీయ ప్రముఖుల స్మారకాలకు నివాళులు అర్పించారు.
సీపీ రాధాకృష్ణన్ ఎవరంటే?
కాగా, తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఏ కూటమి ఆదివారం ప్రకటించింది. దిల్లీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం బీజేపీ అధ్యక్షుడు జె.పీ. నడ్డా ఈ ప్రకటన చేశారు. రాధాకృష్ణన్ గతంలో పార్లమెంట్ సభ్యుడిగా.. జార్ఖండ్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. తమిళనాడులో బీజేపీకి చెందిన సీనియర్ నేత అయిన ఆయన.. కోయంబత్తూర్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలాగే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ విజయం ఖాయమని భావిస్తున్నారు.
విపక్షాల తరపున తెలుగు వ్యక్తి
మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని (Sudershan Reddy) ఎంపిక చేశారు. ఇండియా (INDIA) కూటమి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) మంగళవారం ప్రకటించారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో పలు దఫాలు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. బి. సుదర్శన్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. 1971లో న్యాయవాది వృత్తిని మొదలుపెట్టారు. అనంతరం ఆయన ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1995లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 జులైలో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత గోవా తొలి లోకాయుక్తగా సేవలు అందించారు. కాగా, ఆయన కూడా త్వరలో ఉపరాష్ట్ర పదవి కోసం నామినేషన్ వేయనున్నారు.
Also Read: Indian Railways: రైల్వేలో కొత్త రూల్స్.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఫైనే.. ఇవిగో నిబంధనలు!
ఉపరాష్ట్రపతి ఎన్నికలో బలాబలాలు!
ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను మినహాయిస్తే ప్రస్తుతం ఉభయ సభల సభ్యుల సంఖ్య 782గా ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలుపునకు కనీసం 392 ఓట్లు అవసరం అవుతాయి. ఎన్‌డీఏ (NDA) చేతిలో ప్రస్తుతం 293 మంది లోక్‌సభ సభ్యులు, రాజ్యసభలో 133 సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులతో బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిగా గెలిపించుకోవడం సులభమే. అయితే, ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు ప్రతిపక్షాల అభ్యర్థిగా ఓటు వేస్తే ఫలితం మారే అవకాశముంది. కాబట్టి ఎన్డీయే కూటమి ఎంపీలు ఏమైనా ట్విస్ట్ ఇస్తారా? లేక సజావుగానే సీపీ రాధాకృష్ణన్‌కు ఓటు వేస్తారా? అనేది ఎన్నిక జరిగే సెప్టెంబర్ 9న తేలనుంది.