CM Revanth Reddy: తెలంగాణ రైతులకు అవసరం మేరకు యూరియాను తక్షణం సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేటాయించిన మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులకు వివరించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు.
Also Read: Indus Waters Treaty: పాక్‌తో సింధు జలాల ఒప్పందం.. నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు
తక్షణం యూరియా సరఫరా చేయాలి
ఈ విషయంపై జేపీ నడ్డాకు పార్లమెంట్ సభ్యులు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. యూరియా సరఫరా విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రమంత్రికి వివరించడమే కాకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)పలు దఫాలుగా లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర అవసరాల మేరకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపుతున్నదని అన్నారు. రైతుల సమస్యలపై పార్లమెంట్ వేదికగా ఎంపీలు ఆందోళన సాగిస్తున్నప్పటికీ కోటా మేరకు యూరియా విడుదల చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆక్షేపించారు. అవసరమైన మేరకు తక్షణం యూరియా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. మరోవైపు, యూరియా విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం యూరియా ఇవ్వడం లేదని, మోదీ భజనలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ బిజీగా ఉన్నారని అన్నారు. గల్లీల్లో లొల్లి చేసేవారు ఢిల్లీలో ఎందుకు అడగరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.