CM Revanth Reddy: ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించండి
ఆయన గెలుపు తెలుగు ప్రజలకు గౌరవం
అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి
చంద్రబాబు, కేసీఆర్, పవన్ కల్యాణ్, జగన్‌లు మద్దతివ్వాల్సిందే
ఇండియా కూటమి అభ్యర్థి ఎంపిక గర్వకారణమన్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశామని, ఇది తెలుగు ప్రజలకు గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆయన గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉన్నదని అభ్యర్థించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలు కూడా మద్దతు ఇవ్వాల్సిందేనని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు.. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్న ఇండియా కూటమి మరోవైపు నిలబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించడం గర్వకారణమని ఆయన అభివర్ణించారు. ఆయన గెలుపు ప్రతిఒక్కరికీ అవసరమేనని వ్యాఖ్యానించారు. సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉన్నదని అన్నారు. పీవీ నర్సింహారావు తర్వాత ఒక తెలుగువాడిని ఆ స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అంతా ఏకం కావాల్సిన సందర్భం ఇదని ఆయన నొక్కి చెప్పారు.
Read Also- KTR: కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ.. విషయం ఏంటంటే
సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదు
ఉభయ రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మన్ అని గుర్తు చేశారు. 1991లో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహరావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టకుండా మద్ధతు ఇచ్చారని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదని, ఆయన ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయనిపుణుడు అని వివరించారు. ఆయనకు ఏ రాజకీయ సంబంధాలు, పార్టీలతో సన్నిహిత్యం వంటివి లేవన్నారు. ఇయన ఇండిపెండెంట్ ఎక్ పర్ట్ కమిటీ చైర్మన్ అని అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రదర్శించిన రాజకీయ చతురతను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన వారికి ఉప రాష్ట్రపతి అయ్యే ఛాన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని రేవంత్ రెడ్డి కోరారు.
Read Also- HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!
రాజకీయ పార్టీలంతా ఏకమైన ఆయనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రజాస్వామ్యం రక్షించబడుతుందన్నారు. ఇది తమిళ, తెలుగు మధ్య పోటీ కాదని, రాజ్యాంగాన్ని మార్చే వారికి, రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఉభయ రాష్ట్రాల్లోని 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్య సభ సభ్యులంతా ఒక తాటిపైకి వచ్చి, ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని కోరారు.