Kukatpally Murder: పన్నెండేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘాతుకం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లైంగిక దాడికి ప్రయత్నించిన యువకుడు ప్రతిఘటించిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా అనుమానిస్తున్నారు. అనుమానితుని కదలికలు సీసీ కెమెరాల్లో(CC Camera) రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్ పల్లి(Kukat pally) సంగీత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ లో ఉంటున్న రేణుక, కృష్ణ భార్యాభర్తలు. వీరికి కూతురు సహస్ర (12), కుమారుడు ఉన్నారు. రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుండగా కృష్ణ బైక్ మెకానిక్. కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న సహస్ర స్కూల్ కు సెలవులు ఉండటంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఇక, సోమవారం రేణుక, కృష్ణలు తమ తమ పనులపై వెళ్లిపోయారు. వారి కుమారుడు స్కూల్ కు వెళ్లగా సహస్ర ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది.
లంచ్ బాక్స్ కోసం
ఇదిలా ఉండగా కొడుకు చదువుతున్న స్కూల్ నుంచి సోమవారం మధ్యాహ్నం కృష్ణకు ఫోన్ వచ్చింది. టిఫిన్ బాక్స్(Tiffin Box) తెచ్చివ్వమని స్కూల్ సిబ్బంది చెప్పటంతో కృష్ణ ఇంటికి వచ్చాడు. చూడగా తలుపులకు బయటి నుంచి గడియ వేసి ఉండటం కనిపించింది. తెరిచి లోపలికి వెళ్లగా మంచంపై రక్తం మడుగులో సహస్ర కనిపించింది. వెంటనే కృష్ణ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో కూకట్ పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో కత్తితో గొంతు కోయటంతోపాటు శరీరంపై పొడవటం వల్ల సహస్ర చనిపోయినట్టుగా నిర్ధారణ అయ్యింది. పంచనామా అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Also Read: PM Vikasit Bharat Rozgar Yojana: ప్రైవేటు ఉద్యోగులకు రూ.15 వేలు సాయం.. అర్హతలు ఇవే
కాగా, చిన్నారి దారుణ హత్యకు గురైందన్న వార్త దావానలంలా వ్యాపించటంతో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. విషయం తెలిసి బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్((DCP Suresh Kumar)) కూడా నేర స్థలానికి వచ్చారు. పోలీసు జాగిలాలను రప్పించారు. క్లూస్ టీం సిబ్బందిని పిలిపించి ఆధారాలను సేకరించారు. మీడియాతో మాట్లాడిన డీసీపీ సురేశ్ కుమార్ అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నట్టు చెప్పారు. హతురాలి తల్లిదండ్రులు ఎవ్వరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక అందితే అసలేం జరిగిందన్నది తెలుస్తుందన్నారు.
తెలిసినవాడే..
కాగా, చిన్నారి సహస్రను తెలిసినవాడే దారుణంగా హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లైంగిక దాడికి యత్నించి ప్రతిఘటించిందని చంపేసి ఉండవచ్చని భావిస్తున్నారు. హతురాలి కుటుంబం నివాసముంటున్న అపార్ట్ మెంట్ పక్కనే ఉన్న మరో ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాలో మధ్యాహ్నం సమయంలో ఓ యువకుడు లోపలికి వెళుతుండటం రికార్డయ్యింది. అయితే, ఆ యువకుడు బయటికి వెళ్లిన దృశ్యాలు మాత్రం రికార్డు కాలేదు. దీనిపై స్థానికులతో మాట్లాడగా అపార్ట్ మెంట్ వెనక వైపు ఉన్న భవనం పైకి దూకి అతను తప్పించుకుని పారిపోయి ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తనను గుర్తు పడుతుందనే ఆ యువకుడు సహస్రను హత్య చేసి ఉండవచ్చని అంటున్నారు.
Also Read: CITU Bhaskar on BJP: RSS స్వాతత్రం కోసం పోరాడిందని మోదీ చెప్పడం సిగ్గుచేటు!