BRS: ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బీఆర్ఎస్(BRS) ప్రజల్లోకి అస్సలు వెళ్లడం లేదు. సమస్యలపై పోరుబాట కార్యచరణ ఏమాత్రం చేపట్టడం లేదు. క్యాడర్‌ను సైతం సమాయత్తం చేయట్లేదు. కేవలం మీడియా ముందు మాత్రమే ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. మరోవైపు కేసులు, కోర్టులు అంటూ పార్టీ అగ్రనాయకులు అంతా సమయం వెచ్చిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ బలోపేతంపైనా అధిష్టానం దృష్టిసారించకపోవడంతో క్యాడర్ అంతా అసంతృప్తి గురవుతున్నారు.
బీఆర్ఎస్(BRS) అధికారం కోల్పోయిన తర్వాత అగ్రనేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి. కేసీఆర్, (KCR) కేటీఆర్,(Ktr) హరీశ్ రావు(Harish Rao) టార్గెట్‌గా కాంగ్రెస్ సర్కారు పావులు కదుపుతోందని తెలుస్తున్నది. దీంతో తరచూ గులాబీ అగ్రనేతలు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీశ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. దీంతో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో హరీశ్‌కు హైకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చింది. ఇక యూరియా విషయంలో హరీశ్ పోరాటం చేస్తుంటే అది కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం.
Also Read: Mahesh Kumar Goud: వారి అండతోనే ప్రజా ప్రభుత్వం.. పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్, కేటీఆర్ పరిస్థితి ఇలా..
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) పై ఫార్ములా ఈ- కార్ రేస్‌లో ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో కేటీఆర్,(Ktr) తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత కేటీఆర్ తనపై నమోదైన ఫార్ములా ఈ- కార్ రేస్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ, సుప్రీం సైతం అనుకూలమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో తన పిటీషన్‌ను కేటీఆర్ విత్ డ్రా చేసుకున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సైతం కోర్టులను ఆశ్రయించారు.
సీఎంగా ఉన్నప్పుడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డిని కమిషన్ ఛైర్మన్‌గా నియమించారు. దీంతో విచారణకు రావాలని కేసీఆర్‌కు కమీషన్ ఛైర్మన్ నోటీసులు ఇచ్చారు. దీంతో లేఖ ద్వారా విద్యుత్ కమీషన్‌కు కేసీఆర్ తన అభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత విద్యుత్ కమీషన్ ఛైర్మన్ తనపై రాజకీయపరమైన ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను తప్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ బీలోకూర్‌ను ప్రభుత్వం నియమించింది.
సుప్రీం కోర్టుకు వెళ్తే..?
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్(Congress) సర్కారు జస్టిస్ పీసీ ఘోష్ ఛైర్మన్‌గా కాళేశ్వరం కమీషన్‌ను ఏర్పాటు చేసింది. కేసీఆర్,(Kcr) హరీశ్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో విచారణకు హాజరయ్యారు. జూలై 31తో కాళేశ్వరం కమిషన్ పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఛైర్మన్ నివేదిక అందచేశారు. దీంతో ప్రభుత్వం కాళేశ్వరం నివేదికపై అధికారులతో కమిటీ వేసింది. ఆ తర్వాత క్యాబినెట్ భేటీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించారు. కమిషన్ నివేదికలో కేసీఆర్, హరీశ్, ఈటెల రాజేందర్, అధికారులను భాద్యులు చేస్తూ కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని గులాబీ పార్టీ భావిస్తోంది.
దీనిపై ఇప్పటికే న్యాయనిపుణులతో హరీశ్, వినోద్ కుమార్ చర్చించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కారు పార్టీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో వారిపై నాలుగు వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు సూచించింది. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఫైనల్‌గా సుప్రీంకోర్టులో కేసు వేయాలని పార్టీ భావిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు అంశంపైనా సుప్రీంకోర్టులో కేసు వేయాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ఫోకస్ ఏదీ?
ప్రతిపక్ష పార్టీగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకుండా కేవలం కేసులు, కోర్టుల చుట్టూ గులాబీ పార్టీ ఫోకస్ చేయడంతో కాలం వెళ్లదీస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు పార్టీ కమిటీలు లేవు. కేవలం అధ్యక్షులను మాత్రమే నియమించింది. ఏళ్ల తరబడి కమిటీలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పార్టీకోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఏ పదవి లేకుండా పార్టీలో ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. పార్టీ పదవులతో గుర్తింపు వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురవుతున్నది. అంతేకాదు పార్టీ స్థాయి ప్రజాసమస్యలపై పోరుబాట పట్టడం లేదు. నిరసన, ధర్నాల లాంటి కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నది. కేవలం మీడియా, సోషల్ మీడియా లేదంటే మీడియా ప్రకటనల రూపంలో మాత్రమే ప్రభుత్వ తీరును ఎండగడుతూ కాలం వెల్లదీస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నది.
ఫామ్ హౌస్‌లోనూ..!
ఎర్రవెల్లి నివాసంలో ప్రతిరోజూ నేతలతో అధినేత కేసీఆర్ భేటీ అవుతున్నారు కానీ, కేవలం పార్టీ నేతలపై కేసులు, ప్రాజెక్టులపై చర్చ, కమిషన్‌లను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ మారిన వారిపై ఎలా ఫైట్ చేయాలి? అనే అంశాలపైనే చర్చజరుగుతున్నట్లు సమాచారం. అసలు పార్ఠీ నిర్మాణంపై చర్చలేదని ప్రచారం జరుగుతున్నది. ప్రజా సమస్యలతో పార్టీ వెళ్తుందని భావించిన పార్టీ నాయకులకు చివరికి నిరాశే మిగులుతోంది. మరోవైపు త్వరలో స్థానిక సంస్థలు జరుగనున్న నేపథ్యంలోనూ పార్టీ స్తబ్దుగా ఉండటంతో క్యాడర్‌లో ఆందోళన నెలకొంది.
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటముల నుంచి ఇంకా నాయకులు, క్యాడర్ బయటపడలేదు. వారిలో జోష్ నింపేందుకు పార్టీ సైతం ఎలాంటి కార్యచరణ ప్రకటించట్లేదు. ఇటీవల పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సైతం కేసులు, కోర్టులు, అరెస్టులపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని, నాయకులను, క్యాడర్‌ను పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిప్పుడు పార్టీ అనుసరిస్తున్న విధానాలను స్పష్టం చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అధిష్టానం కేసులు, కోర్టుల అంశాన్ని పక్కనపెట్టి పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తుంరా? లేదా అనేది చూడాలి.
Also Read: Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’.. నిధి లుక్ చూశారా.. షాక్ ఇచ్చారుగా!