cyclone makes landfall near canning eye of Remal enters bangladesh and bengal
తుఫానుగా మారిన రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 135 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఆదివారం అర్థరాత్రి సమయానికి రెమాల్ తుఫాను బెంగాల్ లోని కానింగ్ కు ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ లోని మోంగ్లా, బెంగాల్ లోని సాగర్ ద్వీప్ లవద్ద తీరం తీరం దాటిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతానికి రెమాల్ తుఫాను బంగాళాఖాతం మీదుగా ఉత్తర దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను తీర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 1.10 లక్షల మందిని ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి కోల్‌కతా విమానాశ్రయం నుంచి సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తూర్పు, ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేశాయి. బంగ్లాదేశ్ లోనూ దాదాపు 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
అధికారులతో మోదీ సమీక్ష
తుపాను సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఆదివారం సమీక్ష నిర్వహించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుపాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని తీరప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. సోమవారానికి ఇది తుపానుగా బలహీనపడనున్న నేపథ్యంలో కోల్‌కతా, సాగర్ ద్వీపం, హుగ్లీ పోర్టులకు ఎనిమిది, పారాదీప్, ధామ్రా పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు, గోపాలపుర్ నుంచి తూత్తుకుడి వరకు అన్ని పోర్టులకు రెండో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను పరిస్థితిపై దిల్లీలోని ప్రత్యేక ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎస్‌ఎంసీ) అధికారులు.. మయన్మార్, బ్యాంకాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఖతర్ ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. ‘రెమాల్’ ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
అల్లకల్లోలంగా ఉప్పాడ తీరం
ఇక తుఫాను దృష్ట్యా బెంగాల్‌లోని కోల్‌కతా ఎయిర్ పోర్టును 24 గంటల పాటు మూసివేశారు. వందలాది రైళ్లను కూడా రద్దు చేశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరా, హుగ్లీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాటికే సుందర్‌బన్స్, సాగర్ ద్వీపం సహా రాష్ట్రంలోని పలు సముద్ర తీరప్రాంతాల నుంచి దాదాపు 1,10,000 మందిని తాత్కాలిక షెల్టర్ జోన్లకు తరలించారు. ఇక తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.