Venkatesh – Trivikram: సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi ki Vastunnam) సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh).. తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ప్రకటన వచ్చి కూడా చాలా కాలం అవుతుంది. అయినా సినిమా పరంగా ఎటువంటి కదలిక కనిపించలేదు. కట్ చేస్తే.. సైలెంట్ ఈ సినిమా పూజా కార్యక్రమాలను స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్‌గా ముగించేశారు మేకర్స్. అంతే, అంతా షాక్ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఓపెనింగ్ అంటే, భారీ స్థాయిలో ఉంటుందని అంతా ఊహించారు. అందులోనూ మంచి హిట్ కొట్టి ఉన్న వెంకీతో సినిమా కాబట్టి.. ఓ రేంజ్‌లో ప్రారంభోత్సవం ఉంటుందని అంతా భావించారు. ఆ ఊహలకు బ్రేక్ వేస్తూ.. సైలెంట్‌గా పూజా కార్యక్రమాలను మేకర్స్ నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- MP Raghunandan Rao: 71 వేల ఫేక్ ఓట్లు.. బీహార్ ఓటమిని ముందే ఒప్పుకున్నారు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు
వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, వెంకీ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకత్వం ఒక్కటే చేయలేదు కానీ, అన్నీ తానై ముందుండి నడిపించారు త్రివిక్రమ్. ముఖ్యంగా ఆయన నుంచి వచ్చిన ప్రాసలు, పంచ్‌లు.. వెంకీ చెబుతుంటే, థియేటర్లలో ప్రేక్షకులు రచ్చ రచ్చ చేశారంటే.. ఏ రేంజ్‌లో అవి పేలాయో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి వెంకీని త్రివిక్రమ్ ఇప్పుడు డైరెక్ట్ చేయబోతున్నారంటే.. సినిమాపై అంచనాలు ఉండకుండా ఉంటాయా? అందుకే ప్రారంభోత్సవానికి ముందే.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడటం స్టార్ట్ చేశారు. మరోవైపు ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయడానికి చాలా టైమ్ తీసుకున్నారు. మధ్యలో అల్లు అర్జున్‌తో సినిమా అని వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్‌కు షిఫ్ట్ అయింది. అది ఇప్పుడప్పుడే సెట్స్‌పై వెళ్లే అవకాశం లేకపోవడంతో.. వెంకీతో సినిమా అంటూ వస్తున్న వార్తలను త్రివిక్రమ్ నిజం చేశారు.
Also Read- Kannappa Film Actress: ‘కన్నప్ప’ హీరోయిన్ ఎక్కడ? టాలీవుడ్ నుంచి దుకాణం సర్దేసినట్టేనా?
ఈ ప్రాజెక్ట్ కోసం సినీ వర్గాలతో పాటు, ప్రేక్షకులలో కూడా ఎంతో ఆసక్తి ఉంది. వెంకీతో చేసే చిత్రానికి త్రివిక్రమ్ ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారని మేకర్స్ తెలిపారు. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో త్రివిక్రమ్‌కు పెట్టింది పేరు. ఈ అరుదైన, మాయాజాల కలయికలో వస్తున్న సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్రివిక్రమ్ శైలి కథలో వెంకటేష్‌ను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై.. నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు