MP Raghunandan Rao: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిచిన రాయ్ బరేలీలో 71 వేల అడ్రస్ లేని ఫేక్ ఓట్లు ఉన్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాయ్ బరేలీలో 52 వేల ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ వచ్చాయని పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ మాట్లాడారు. రాజీవ్ గాంధీ బ్యాలెట్ విధానం వద్దని ఈవీఎం విధానం తెచ్చారన్నారు. కానీ ఆయన మాత్రం ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. అంత నమ్మకం లేకుంటే రాయ్ బరేలీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బై ఎలక్షన్‌లో బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహిద్దామన్నారు. రాజీనామాకు సిద్ధమా అని సవాల్ చేశారు.
Also Read: Independence day celebrations: జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మీరు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్ ఉన్నట్టా అని ప్రశ్నించారు. జన్మనిచ్చిన తండ్రి మాటపై రాహుల్‌కు నమ్మకం లేదని, బిహార్ ఓటమిని ముందే కాంగ్రెస్ అంగీకరించిందని చురకలంటించారు. వయనాడ్‌లో 93,499 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ప్రియాంక గాంధీకి ఓటు వేశారన్నారు. అభిషేక్ బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఆయన భార్య గెలిచిన నియోజకవర్గాల్లో తాము దొంగ ఓట్లను కనుగొనే పనిలో ఉన్నామని చెప్పారు. రోహింగ్యా, బంగ్లాదేశీయుల దొంగ ఓట్లను అరికట్టేందుకు ‘ఎస్ఐఆర్’ విధానాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. దొంగ ఓట్లతో గతంలో ఇందిరా గాంధీ గెలిచారని, అది చెల్లదని కోర్టు చెప్తే ప్రజలకు ముఖం చూపించలేక కొంగు కప్పుకొని బయటి తిరగాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాహుల్‌కు ప్రజాస్వామ్యంపై విలువ లేదని, అందుకే ప్రజలు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లపై శాస్త్రీయంగా చదువుకుని రావాలంటూ రఘునందన్ రావు చురకలంటించారు.
Also Read: Telangana Jagruti Presidents: 11 జిల్లాలకు జాగృతి జిల్లా అధ్యక్షుల నియామకం.. ప్రాధాన్యం ఎవరికంటే?