PM Modi: దేశాన్ని అక్రమ వలసదారుల వల్ల కలిగే ప్రమాదాల నుండి రక్షించడానికి ‘డెమోగ్రఫీ మిషన్’ ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. దేశ జనాభా నిర్మాణాన్ని మార్చే ఒక కుట్ర జరుగుతోందని ఈ సందర్భంగా పౌరులను ప్రధాని హెచ్చరించారు. అలాంటి చర్యలను ఇక మీదట సహించబోమని స్పష్టం చేశారు.
‘దేశంలో ఆ కుట్ర జరుగుతోంది’
‘దేశ ప్రజలను ఒక ఆందోళన, ఒక సవాలు గురించి హెచ్చరించాలనుకుంటున్నా. దేశ జనాభా నిర్మాణాన్ని మార్చే కుట్ర జరుగుతోంది. కొత్త సంక్షోభానికి విత్తనాలు నాటబడుతున్నాయి. ఈ చొరబాటుదారులు నా దేశ యువత ఉపాధిని దోచుకుంటున్నారు. మన సోదరీమణులు, కుమార్తెలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆదివాసులను తప్పుదోవ పట్టించి వారి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దీన్ని మేము సహించము’ అని ప్రధాని మోదీ అన్నారు.
‘దాని కోసమే డెమోగ్రఫీ మిషన్’
భారత సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న జనాభా మార్పులు.. దేశ భద్రతకు ముప్పు అని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇది ఘర్షణలకు విత్తనాలు నాటుతుంది. ఏ దేశమూ చొరబాటుదారుల ముందు తలవంచదు. మరి మనం ఎలా వంచగలం? అలాంటి చర్యలను ఆపడం మనకు స్వాతంత్రం ఇచ్చిన పూర్వీకుల పట్ల కర్తవ్యాన్ని చాటుకోవడమే. కాబట్టి ఎర్రకోట ప్రాకారాల నుంచి నేను ప్రకటిస్తున్నాను. భారత్‌పై కమ్ముకొస్తున్న ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మేము ఉన్నత స్థాయి ‘డెమోగ్రఫీ మిషన్’ను ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నాం’ అని మోదీ తెలిపారు.
మమతా బెనర్జీకి చెక్ పెట్టడానికేనా?
ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించినవేనని పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల మమతా మాట్లాడుతూ.. బంగ్లా మాట్లాడే భారతీయులను కేంద్రం లక్ష్యంగా చేసుకుంటోందని ఆమె ఆరోపించారు. అయితే మమతా తన రాజకీయ ప్రయోజనాల కోసం వలసవాదులకు అండగా నిలుస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్రకోట వేదికగా జాతీయ భద్రత ముప్పు గురించి మోదీ మాట్లాడటం.. ఆమెకు చెక్ పెట్టడానికేనని పొలిటికల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: PM Modi – GST: ఎర్రకోట వేదికగా ప్రధాని బంపరాఫర్.. ఇక అందరి ఖర్చులు తగ్గబోతున్నాయ్!
సుదర్శన్ చక్ర మిషన్ సైతం..
ఇదిలా ఉంటే కేంద్రం తీసుకున్న మరో కీలక నిర్ణయాన్ని ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. భారత్‌ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ను ప్రకటించారు. వచ్చే పదేళ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను కాపాడుతుందని మోదీ అన్నారు. ప్రతీ పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని పేర్కొన్నారు. దేశంలోని సాంకేతిక అభివృద్ధి.. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందని మోదీ అన్నారు. పదేళ్ల క్రితం రక్షణ రంగంలో స్యవం సమృద్ధిపై భారత్ దృష్టి సారించిందని వాటి ఫలితాలను ప్రస్తుతం దేశం అనుభవిస్తోందని మోదీ చెప్పుకొచ్చారు.