HYDRA:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ముంపునకు గురయ్యే వివిధ ప్రాంతాలను హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం పరిశీలించారు. వరద తీవ్రతను పరిశీలించిన ఆయన ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని అంబేద్కర్ బస్తీలో ఇటీవల కూలిపోయిన నాలా రిటైనింగ్ వాల్ పరిసరాలను తనిఖీ చేశారు. ఈ గోడ కూలిపోవడంతో వరద తమ ప్రాంతాలను ముంచెత్తుతోందంటూ స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు.
ఇప్పటికే రిటెయినింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమవ్వగా, త్వరితగతిన పూర్తి చేయాలని అక్కడ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను రంగనాథ్ ఆదేశించారు. అనంతరం పాతబస్తీలోని తలాబ్‌చంచలం డివిజన్‌లో ఆయన పర్యటించారు. అక్కడ గుర్రం చెరువు నుంచి మూసీని కలిపే వరద కాలువను పరిశీలించారు. ఈ కాలువలో కొన్నేళ్లుగా పూడికను తీయకపోవడంతో పరిసర ప్రాంతాల్లోని వందలాది కాలనీలకు వరద ముప్పు వచ్చేదని, కానీ, ఇటీవల హైడ్రా పనులు చేపట్టడంతో ఈ ఏడాది ఇబ్బంది ఏర్పడలేదని స్థానికులు కమిషనర్‌తో చెప్పారు. గత 15 రోజులుగా జరుగుతున్న సిల్ట్ తొలగింపు పనులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. మెషినరీని పెంచి వెంటనే ఈ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను రంగనాథ్ ఆదేశించారు.
బేగంబజార్‌లో కూలిన పాతకాలపు భవనం
వరుసగా నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా బేగంబజార్‌లో ఓ పాతకాలం నాటి భవనం కుప్పకూలింది. ఈ భవనం ఇప్పటికే కాలం చెల్లిందని, వెంటనే కూల్చివేయాలంటూ జీహెచ్ఎంసీ యజమానికి ఇటీవలే నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదని తెలిసింది. శిథిలావస్తలో ఉన్న ఆ భవనానికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోగా, అదే భవనంలో వ్యాపార సంస్థలను అద్దెకు కొనసాగించారు. గురువారం తెల్లవారు జామున ఈ పాతకాలపు భవనం కూలినట్లు, భవనం కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేకపొవటంతో ప్రాణ నష్టం జరగలేదు. దీంతో, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
Read Also- Musi River Overflows: మూసీకి వరద ఉద్ధృతి.. తస్మాత్ జాగ్రత్త!
పక్కాగా సహాయక చర్యలు: కమిషనర్ కర్ణన్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్ మహానగరంలో వరుసగా మూడు రోజుల నుంచి వర్షాలు కురస్తుండడంతో సిటీలోని అన్ని చోట్ల పక్కాగా సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో రాజేంద్ర నగర్ సర్కిల్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ గురువారం చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. జల్‌పల్లి చెరువుతో పాటు లోతట్టు ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజల భద్రతా కోసం తీసుకుంటున్న చర్యలను క్షేత్ర స్థాయిలో ఆయన సమీక్షించారు. మరో 3 రోజులు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. నగర ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ట్రాఫిక్, విపత్తు బృందాలు కలసికట్టుగా పని చేయాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, వీలైనంత త్వరగా వాటర్‌ను తోడేసి ట్రాఫిక్ ఫ్లో సజావుగా జరిగేలా చూడాలిని సూచించారు. ముఖ్యంగా వర్షాల కారణంగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగుకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంలో నగర పౌరులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి, తక్షణ చర్యలు చేపట్టాలనీ కమిషనర్ ఆదేశాలిచ్చారు.
Read Also- Armur Constituency: ఆ నియోజకవర్గంలో మొదలైన కేసీఆర్ గేమ్ ప్లాన్!!