Musi River Overflows: పొంగి ప్రవహిస్తున్న మూసీ నది
సురక్షిత ప్రాంతానికి లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటి విడుదల
20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లూ
9 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ వాసుల దాహర్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, శంకర్‌పల్లి, అనంతగిరిహిల్స్ తదితర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, హిమాయత్ సాగర్‌లోకి సుమారు 20 వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వస్తోంది. రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరటంతో అధికారులు గురువారం ఉదయం 10 గంటల సమయంలో 4 గేట్లు, ఆ తర్వాతి గంటకు మరో 2 గేట్లు, ఆ తర్వాత మరో గేటును మూడు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మొత్తం 9 గేట్లను ఎత్తి 12 వేల 50 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయానికి అత్యంత సమీపంలో ఉన్న బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలొకి నీరు చేరింది. దీంతో, అక్కడి స్థానికులను రెవెన్యూ, పోలీసు, జలమండలి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, పురానాపూల్, నయాపూల్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసరాంబాగ్ బ్రిడ్జి వద్ద బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో, వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు ఎప్పటికపుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
అవసరమైన చోట లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో నిమగ్నమయ్యారు. రాజేంద్రనగర్లో చేపలు పట్టేందుకు నదీలోకి వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో చిక్కుకోగా, అధికారులు రక్షించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం తర్వాత ఇన్ ఫ్లో వెయ్యి క్యూసెక్కులకు తగ్గటంతో ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు 19,000 క్యూసెక్కులుగా నమోదయింది. మధ్యాహ్నం నుంచి 12 వేల 46 క్యూసెక్కుల అవుట్ ఫ్లోగా కొనసాగినట్లు జలమండలి వెల్లడించింది.
Read Also- Armur Constituency: ఆ నియోజకవర్గంలో మొదలైన కేసీఆర్ గేమ్ ప్లాన్!!
మరోవైపు, ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్‌కు 2,800 క్యూసెక్కుల వదర నీరు వస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 2.919 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1785.50 అడుగులకు నీటి మట్టం చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ రిజర్వాయర్ నీటి మట్టం గరిష్ట స్థాయి చేరటానికి మరో టీఎంసీ వరద నీరు రావాల్సి ఉంటుందని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి అవసరమైతే ఈ జలాశయం గేట్లను ఎత్తే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు.
హుస్సేన్ సాగర్ నుంచి 820 క్యూసెక్కుల నీరు విడుదల
నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌లోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ప్రధానంగా పంజాగుట్ట, బల్కాపూర్, బేగంపేట, పికెట్ నాలాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జీహెచ్ఎంసీ ఇంజనీర్లు 820 క్యూసెక్కుల నీటిని హోటల్ మారియేట్ వద్ద ఉన్న తూముల ద్వారా 820 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ ‘సర్ ప్లస్’ నాలాకి ఇరువైపులా ఉన్న బస్తీ వాసులను జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కువ మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేసే అవసరం ఏర్పడితే కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా, గరిష్ట నీటి మట్టం 514.75 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 513.30 మీటర్లు ఉందని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు వెల్లడించారు.
Read Also- Manuguru Incident: పెద్ద కొడుకు నిర్వాకం.. భోరున ఏడుస్తున్న తల్లితండ్రులు
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1763.20 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.855 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 19000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 12046 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 9 (నాలుగు అడుగుల మేరకు)