TG Rains Today: తెలంగాణ వ్యాప్తంగా గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా పలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయంగా మారుతున్నాయి. పలు గ్రామాలు, పట్టణాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి.. రహదారుల మీదగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని అన్నదాతలు సైతం నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందన్న వివరాలను వెల్లడించింది.
ఆ జిల్లాల్లో భారీ వర్షం
అల్పపీడన ప్రభావం కారణంగా దక్షిణ తెలంగాణని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, అదిలాబాద్, ఆసీఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది.
హైదరాబాద్ లోనూ..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇవాళ కూడా భారీ వర్షం కురవొచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ మధ్యాహ్నం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని అభిప్రాయపడింది. సాయంత్రం నుంచి ఉదయం వరకు సాధారణ వర్షం ఉంటుందని తెలిపింది. మెుత్తంగా 24 గంటల వ్యవధిలో 30-60మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. కాబట్టి నగరవాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
మరో 3 రోజులు వర్షాలే..
హైదరాబాద్ లోని చార్మినార్, ఖైరతాబాద్, కుకట్ పల్లీ, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగం పల్లి జోన్లలో ఆగస్టు 15, 16 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశముందని అంచనా వేసింది. కాబట్టి నగర వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే 17వ తేదీన కూడా పేన పేర్కొన్న జోన్లలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
Also Read: TDP Wins In Pulivendula: జగన్‌కు బిగ్ షాక్.. పులివెందులలో టీడీపీ ఘన విజయం
ఇందిరమ్మ టిఫిన్స్ కార్యక్రమం వాయిదా
హైదరాబాద్ నగరంలో మోతాదుకు మించి అతి భారీ వర్షాలు(Heavy rains) పడుతున్న నేపథ్యంలో సర్కారు కూడా పూర్తి స్థాయిలో వర్షాలు, సహాయక చర్యలపైనే ఫోకస్ పెట్టింది. దీంతో పలు కార్యక్రమాలకు బ్రేక్ పడుతున్నాయి. ఈ నెల 15వ తేదీన పంద్రాగస్టు నజరానాగా ప్రారంభించ తలచిన ఇందిరమ్మ టిఫిన్స్ కార్యక్రమం వాయిదా పడబోతున్నట్లు సమాచారం. ఆ రోజున సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభించేందుకు 30 స్టాల్స్ ను అధికారులు సిద్ధం చేశారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సర్కారు వాయిదా వేసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.