Manchu Lakshmi: బెట్టింగ్ యాప్‌ల కేసులో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Actress Manchu Lakshmi) బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు అధికారులు ఆమెను ప్రశ్నించి సమాచారం తీసుకున్నారు. పలువురు ఆత్మహత్యలు చేసుకోవటానికి, ఎన్నో కుటుంబాలు వీధుల పాలు కావటానికి కారణమవుతున్న బెట్టింగ్ యాప్‌లపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో మొదట కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిలో టాలీవుడ్, బుల్లితెర నటీనటులతోపాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు. ఆ తర్వాత ఈ కేసులు సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలోని సిట్‌కు బదిలీ అయ్యాయి. ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుండగానే ఈడీ అధికారులు కూడా బెట్టింగ్ యాప్‌లపై ఈసీఐఆర్ జారీ చేశారు. ఈ క్రమంలో హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దగ్గుపాటి రానా (Daggubati Rana), నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj), మంచు లక్ష్మిలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.
Also Read- Minister Konda Surekha: ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే.. చర్యలు తప్పవ్!
ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి బుధవారం బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. మూడున్నర గంటలపాటు అధికారులు ఆమెను విచారించి, తన బ్యాంక్ ఖాతాలకు సంబంధించి అయిదేళ్ల రికార్డులను తీసుకున్నారు. యాప్ నిర్వాహకులు ఆమెను ఎలా సంప్రదించారు? యాప్‌ను ప్రమోట్ చేసినందుకు ఎంత మొత్తం పారితోషికంగా తీసుకున్నారు? నిర్వాహకులు చెల్లింపులు ఎలా జరిపారు? అన్న అంశాలపై ఈడీ అధికారులు మంచు లక్ష్మి నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి మంచు లక్ష్మిని పంపించి వేశారు. ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచు లక్ష్మిని మీడియా సంప్రదించగా.. ఆమె ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
ఇక ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి కూడా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన విషయం తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం తను ప్రమోట్ చేసిన యాప్స్ గురించి వివరణ ఇచ్చారు. మీడియాతో కూడా ఆయన ప్రసంగించారు. ఈడీ తనని ఏం అడిగారో, తను ఏం సమాధానం చెప్పారో కూడా తెలిపారు. అంతేకాదు, ఈ యాప్‌ల విషయంలో మీడియా కూడా ఓ అవగాహన కల్పించాలని, ఏది లీగలో, ఏది ఇల్లీగలో తెలుసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసు ఎలా టర్న్ తీసుకుంటుందో తెలియదు కానీ, సెలబ్రిటీల విచారణ అంటూ హడావుడి మాత్రం బాగానే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు జరిగిన విచారణ తర్వాత ఈడీ ఎలాంటి ప్రకటన చేస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read- Tribanadhari Barbarik Trailer: కట్టప్ప, ఉదయభానుల ‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుమార్తెగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు, దొంగాట, గుంటూర్ టాకీస్ వంటి సినిమాల్లో నటించి, నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌ని వదిలి ముంబైలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు