Bc reservation bill: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అంశంపై పార్టీ, ప్రభుత్వం మధ్య ఊగిసలాడుతున్నది. 42 శాతం రిజర్వేషన్‌తోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని పార్టీ కోరుతుండగా, త్వరగా పంచాయతీ ఎన్నికలు క్లియర్ చేయాలని సర్కార్ భావిస్తున్నది. ఇదే ప్రధాన ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి,(Revanth Reddy) పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతంతో ముందుకు సాగితేనే పార్టీ, ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని పీసీసీ చీఫ్ ఈ భేటీలో సీఎంకు వివరించారు. సీఎం కూడా 42 శాతాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని భావిస్తున్నా.. వేగంగా ఎన్నికలకు వెళ్తే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచినట్లు తెలిసింది.
Also Read: Save Singareni: తెలంగాణ బొగ్గుగని ఉద్యమ బాట.. 11 డివిజన్లలో నిరసనలు ధర్నాలు
ఈ కీలక అంశంపై ఈ నెల 16 లేదా 17న పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో చర్చించనున్నారు. మెజార్టీ నేతల అభిప్రాయాన్ని ఫిక్స్ చేసి, ఏఐసీసీకి సమాచారం ఇవ్వనున్నారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణను పార్టీ, ప్రభుత్వం ప్రకటించనున్నది. బీసీ బిల్లు, పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ సవరణ బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్‌ను ఎలా అమలు చేయాలనే అంశంపై ఇటు పార్టీ, అటు సర్కార్ కసరత్తు చేస్తున్నది. పీఏసీ మీటింగ్ అభిప్రాయమే.. స్థానిక సంస్థల ఎన్నికలను డిసైడ్ చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్లాన్ ఈ మీటింగ్‌లోనే రూపొందించనున్నట్లు ఓ సీనియర్ నేత చెప్పారు.
ఓటు బ్యాంక్ డ్యామేజ్ కాకుండా?
మెజార్టీ బీసీల ఓటు బ్యాంక్ డ్యామేజ్ జరగకుండా ఉండాలనే 42 రిజర్వేషన్‌తో ముందుకు సాగితేనే బెటర్ అంటూ పార్టీ పట్టుబడుతున్నది. బిల్లు, ఆర్డినెన్స్ క్లియర్ కాకపోయినా, పార్టీ పరంగా ఇచ్చి ముందుకు సాగాలనేది పార్టీ ఆలోచన. అయితే క్షేత్రస్థాయిలో ఏ మేరకు సాధ్యమవుతుంది? బీసీ సంఘాలు, సీనియర్ లీడర్లు, మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోనున్నారు. ఆ ప్రకారం 42 శాతం రిజర్వేషనపై ప్రభుత్వం ఓ క్లారిటీకి రానున్నది.
అయితే, పంచాయతీ ఎన్నికలు వేగంగా పూర్తి చేయడం వలన కేంద్రం నుంచి వచ్చే బకాయిలు విడుదల కావడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నిర్వహించే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్‌పై ఫుల్ పబ్లిసిటీ వస్తుంది. ఇది రాబోయే ఎన్నికలకు మైలేజ్‌ను తీసుకొస్తుందని సర్కార్ ఆలోచన. ఇప్పటికే ఆలస్యమైందని, కోర్టు సైతం సెప్టెంబర్ 30 కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సూచించినట్లు సీఎం వివరిస్తున్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ, వెంటనే ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉన్నదంటూ సీఎం నొక్కి చెబుతున్నారు. ఇదే అంశాన్ని పీఏసీలో డిస్కషన్ చేయనున్నారు. 42 శాతం రిజర్వేషన్‌పై సీఎం, పీసీసీ భేటీలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. పీఏసీలో ఏ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది ఉత్కంఠగా మారింది.
బీసీ నేతలు అంగీకరిస్తారా?
పార్టీ పరంగా 42 శాతానికి బీసీ నేతలు, సంఘాలు అంగీకరిస్తాయా? అనేది సస్పెన్షన్ మారింది. కామారెడ్డి డిక్లరేషన్‌ను తప్పకుండా అమలు చేస్తామని ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన సర్కార్.. ఢిల్లీ ధర్నా తర్వాత ప్లేట్ ఫిరాయించిందనే విమర్శలు వస్తాయనే ఆందోళన కూడా ప్రభుత్వం, పార్టీలో ఉన్నది. దీని వలన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం పడుతుందనే దానిపై కూడా సర్కార్ అంచనాకు రానున్నది. ఇప్పటికే పార్టీ తరపున బీసీ సంఘాలతో కాంగ్రెస్ ముఖ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఎక్స్ పర్ట్ కమిటీ, పబ్లిక్ నుంచి కూడా ఒపీనియన్లు తీసుకోనున్నారు. ఈ అంశాలన్నింటిపై పీఏసీలో స్పష్టత రానున్నది. ఆ కమిటీ మీటింగ్‌లో గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికల కోసం అధికారికంగా తదుపరి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయనున్నది.
Also Read:Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా