334 Parries Removed: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) శనివారం కీలక ప్రకటన చేసింది. రిజిస్టర్ అయినా సరే గుర్తింపు దక్కని (RUPPs) 334 రాజకీయ పార్టీలను పార్టీల జాబితా నుంచి తొలగించింది. తొలగింపునకు గురైన పార్టీలన్నీ 2019 నుంచి 6 ఏళ్ల పాటు ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదని, అందుకే తొలగించినట్టు కారణంగా ఎన్నికల సంఘం వివరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. తొలగింపు వేటు పార్టీలు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పరిపాలిత ప్రాంతాలకు చెందినవని తెలిపింది.
‘‘రాజకీయ పార్టీల నమోదు మార్గదర్శకాలలో పేర్కొన్న విధంగా, ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆరు సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికల్లోనూ పాల్గోనకపోతే, ఆ పార్టీని నమోదిత పార్టీల జాబితా నుంచి తీసివేస్తారు’’ అని కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. ‘‘పైన పేర్కొన్న నిబంధన ప్రకారం, పార్టీలను పరిశీలించాలంటూ 2025 జూన్ నెలలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. రిజిస్టర్ అయ్యి గుర్తింపులేని 345 పార్టీలను పరిశీలించాలని కోరాం. సీఈవోలు ఆ పార్టీలపై విచారణలు నిర్వహించి, షో-కాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత విచారణల ద్వారా పార్టీలు తమ అభిప్రాయాలు, వివరణలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు’’ అని ప్రకటనలో ఎన్నికల సంఘం వివరించింది.
Read Also- Karnataka Crime: వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నేరం.. శరీర భాగాలను ముక్కలు చేసి..
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఈవోలు పంపించిన నివేదికలను పరిశీలించిన తర్వాత మొత్తం 334 రిజిస్టర్డ్ అన్‌రెకగ్నైజ్డ్ పాలిటికల్ పార్టీలను (RUPPs) నియమాలకు అనుగుణంగా లేనట్టు ఈసీ గుర్తించింది. ఆ పార్టీలకు సంబంధించిన కార్యాలయాలకు కనీసం చిరునామాలు కూడా లేవని గుర్తించింది. దీంతో, ఆ పార్టీలు అన్నింటినీ తొలగించింది. సీఈవోల సిఫారసులు, అన్ని వివరాలను పరిగణలోకి తీసుకుని, ఆ తర్వాత ఈ పార్టీలను జాబితా నుంచి తొలగించినట్టు పేర్కొంది. దీంతో, మొత్తం 2,854 ఆర్‌యూపీపీలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2,520కు తగ్గిందని ఎన్నికల సంఘం వివరించింది.
Read also- Shubman Gill: శుభ్‌మన్ గిల్ క్రేజ్ మామూలుగా లేదు… జెర్సీ వేలం వేస్తే…
కాగా, ఈ విధంగా డిలిస్టింగ్ చేయడం ఎన్నికల వ్యవస్థలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. సమగ్రత కోసం ఎన్నికల సంఘం నిరంతరం కొనసాగిస్తున్న చర్యల్లో ఇది కూడా ఒక భాగంగా ఉంది. ‘నిష్క్రియాత్మకం’గా మారిన ఆర్‌యూపీపీలను , 2001 నుంచి ఇప్పటికి మూడు నాలుగు సార్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం, పార్టీల గుర్తింపును రద్దు చేసేందుకు చట్టం అనుమతించదని, అందుకే ఆ పార్టీలను గుర్తింపు పొందిన పార్టీల జాబితా నుంచి తొలగించేందుకు ‘డిలిస్ట్’ విధానాన్ని తీసుకొచ్చినట్టు ఓ మాజీ అధికారి తెలిపారు. డిలిస్ట్ అయిన పార్టీలు మళ్లీ నమోదిత పార్టీలుగా గుర్తింపు పొందవచ్చునని, అందుకోసం కొత్తగా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. డిలిస్ట్ అయిన పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికలకు పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కాగా, ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీలు ఉన్నాయి.