Modi-Putin: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును కారణంగా చూపి భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Modi-Putin) శుక్రవారం ఫోన్‌లో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘ఇరువురి మధ్య చాలా చక్కటి, సుదీర్ఘ చర్చ జరిగింది’’ అని ప్రకటించారు.
‘‘నా స్నేహితుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చాలా చక్కటి సంభాషణ జరిగింది. సుదీర్ఘ చర్చ నడిచింది. ఉక్రెయిన్‌పై తాజా పరిణామాలను నాతో పంచుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నాను. ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిపై సమీక్షించాం. భారత్-రష్యా మధ్య ప్రత్యేక, ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురం పునరుద్ఘాటించాం. ఈ ఏడాది పుతిన్‌కు భారత్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నాను’’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Read Also- PM Modi China Tour: కీలక పరిణామం.. షాంఘై సదస్సుకు మోదీని ఆహ్వానించిన చైనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో, భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని తద్వారా మోదీ మరింత స్పష్టం చేసినట్టు అయింది. మోదీ-పుతిన్ ఫోన్ సంభాషణకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే మార్గమని భారత్ మరోసారి స్పష్టం చేసిందని ప్రకటనలో పేర్కొంది. యుద్ధం నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, రష్యా -ఉక్రెయిన్‌లు చర్చలు జరిపి యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని భారత్ కోరుతోందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఇక, భారత్- రష్యా మధ్య ఉన్న ప్రత్యేక, ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాధితలు పునరుద్ఘాటించారని ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ద్వైపాక్షిక అజెండాలో భాగంగా సాధించిన పురోగతిపై కూడా సమీక్షించారని వెల్లడించింది.
ట్రంప్ దూకుడు నేపథ్యంలో ప్రాధాన్యత…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం ఇందుకు కారణంగా ఉంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడాన్ని తప్పుబడుతూ ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు విధించారు. రోజుల వ్యవధిలోనే మరో 25 శాతం మేర పెంచి మొత్తాన్ని 50 శాతానికి చేర్చారు. దీంతో, గత కొన్ని దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనం స్థాయిలో ఇరుదేశాల మధ్య బంధాలు బలహీనమయ్యాయి. దీంతో, మోదీ-పుతిన్ మధ్య సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘అమెరికా ద్వంద్వ వైఖరి’ అనుసరిస్తోందంటూ తీవ్రంగా విమర్శించింది. పాశ్చాత్య దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని నిర్వహిస్తూనే భారత్‌ను అన్యాయంగా టార్గెట్ చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని భారత్ పరోక్షంగా సమర్థిస్తోందంటూ అమెరికా నిందలు వేస్తోంది.
Read Also- TS News: కలెక్టర్‌పై గరంగరమైన ఎమ్మెల్యేకు ఉద్యోగుల సీరియస్ వార్నింగ్