Bc Reservation Bill: బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ నేతలు స్పష్టంగా చదువుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సూచించారు. అందులో ఎక్కడా ముస్లింలకు రిజర్వేషన్లు అంటూ లేవన్నారు. ఒక వేళ ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గల్లీ లీడర్‌గా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయనకు బిల్లుపై అవగాహన లేకుంటే, సచివాలయంలో అధికారికంగా అవగాహన కల్పిస్తామన్నారు. సమయం ఇవ్వాలని కోరారు.
బీసీలకు రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటూ బీజేపీ(BJP) బీఆర్ఎస్(BRS) నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారని ముఖ్యమంత్రి విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లకు పెంపునకు కనీస నైతిక మద్దతు తెలపకుండా బీఆర్ఎస్ 50 శాతానికి రిజర్వేషన్లు మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోందని సీఎం మండిపడ్డారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలోనే కులగణన చేపట్టిందన్నారు. దాని ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను శాసనసభలో ఆమోదించిందని సీఎం తెలిపారు.
Also Read: Samantha: నాగచైతన్యని బెదిరించి పెళ్లి చేసుకుందా? ప్రముఖ సైకాలజిస్ట్ సంచలన కామెంట్స్
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్(KCR) ప్రభుత్వం చేసిన చట్ట సవరణకు తాము ఆర్డినెన్స్ గవర్నర్‌కు పంపామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. ఈ మూడింటికి ఆమోదముద్ర వేయాల్సిన గవర్నర్ వాటిని రాష్ట్రపతికి పంపారని సీఎం తెలిపారు. ఆ బిల్లులను ఆమోదించాలని కోరేందుకు తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పది రోజుల క్రితమే అపాయింట్‌మెంట్ కోరామని, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతిని కలిశారన్నారు. వారిద్దరి ఒత్తిడితోనే తమకు అపాయింట్‌మెంట్ లభించలేదని తాము భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు.
బీజేపీది తొలి నుంచి బీసీ వ్యతిరేక వైఖరే
బీజేపీది తొలి నుంచి బీసీ వ్యతిరేక వైఖరేనని, మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించందని సీఎం అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఇక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసిందని సీఎం విమర్శించారు. అయినప్పటికీ నాటి మన్మోహన్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు కల్పించిందని సీఎం తెలిపారు.
ప్రస్తుతం ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్ల పెంపును బీజేపీ( Bjp) అడ్డుకుంటోందని సీఎం మండిపడ్డారు. 2017లో రాజస్థాన్‌లో అబ్దుల్ సత్తార్ అనే ముస్లిం వ్యక్తి ఓబీసీ కోటాలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారని,1971 నుంచి నూర్‌బాషా తదితరులకు బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని సీఎం వివరించారు. నరేంద్ర మోదీ గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాము ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చామని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ శిఖండిలా వ్యవహరిస్తూ విధ్వంసకర పాత్ర పోషిస్తోందని సీఎం ఆరోపించారు.
కేంద్రం సహకారించడం లేదు
బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించుకునేందుకు మూడు రోజులుగా ఢిల్లీలో ప్రయత్నం చేశామని, ఇందుకోసం మంత్రులు సైతం ఢిల్లీలోనే ఉన్నారని సీఎం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే బిల్లులు ఆమోదించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. బిల్లుల ఆమోదం కోరుతూ జంతర్‌మంతర్‌లో తాము చేసిన ధర్నాకు ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు హాజరై తమకు మద్దతుగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ బిల్లులపై చర్చకు వాయిదా తీర్మానాలు ఇస్తే ప్రభుత్వం తోసిపుచ్చుతోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేశామని, కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లభించడం లేదని సీఎం తెలిపారు. తక్షణమే ఆ బిల్లులను ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అందుకే రాహుల్ ధర్నాకు రాలే
ఇక రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇందిరా భవన్‌లో నాలుగు గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నాలుగు గంటలు సావధానంగా విన్నారని, వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని తలకటోరా స్టేడియంలో జాతీయ స్థాయి సదస్సు పెట్టి వివరించారని సీఎం అన్నారు. శిబుసోరెన్ అంత్యక్రియలు, ఓ కేసు విషయమై జార్ఞండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్‌మంతర్ సదస్సుకు హాజరుకాలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపైన బీజేపీకి చిత్తశుద్ది లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని, కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడంలేదని సీఎం విమర్శించారు.
నేను నిజాలే చెబుతా
2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిందని, మళ్లీ రాహుల్ గాంధీ నేతృత్వంలోన తాము అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం తాను నిజాలు చెబుతానని సీఎం తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికి పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమేనని సీఎం తెలిపారు. విలేకరుల సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వంశీ, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, రామసహాయం రఘురాంరెడ్డి, విప్‌లు ఆది శ్రీనివాస్, జాటోత్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, వెడ్మ బొజ్జు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, టి.రామ్మెహన్ రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hyd Rain Updates: భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం.. ట్రాఫిక్ జామ్ ఏరియాలు ఇవే!