వెబ్ సిరీస్ పేరు: ‘మయసభ’
ఓటీటీ: సోనీ లివ్ (ఒరిజినల్)
ఎపిసోడ్స్: 9
నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, దివ్యా దుత్తా, తాన్య రవిచంద్రన్, చరితా వర్మ, నాజర్, శ్రీకాంత్ భరత్, రవీంద్ర విజయ్, శత్రు తదితరులు
బ్యానర్స్: హిట్ మ్యాన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ (ఎల్.ఎల్.పి)
నిర్మాతలు: విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష
దర్శకులు: దేవా కట్టా, కిరణ్ జయ కుమార్
Mayasabha Review: ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కలిపినా సింగిల్ డిజిటే. సక్సెస్ రేట్ కూడా ఏమంత గొప్పగా లేదు. కానీ ఆయన సినిమాలంటే మాత్రం ఏదో ఒక తెలియని ఇంట్రస్ట్ జనాల్లో ఉంటుంది. ‘వెన్నెల’తో మొదలైన ఆయన ‘ప్రస్థానం’ అలా నడుస్తూనే ఉంది. ఇటీవల వచ్చిన ‘రిపబ్లిక్’ కూడా కంటెంట్ పరంగా మంచి టాక్‌ని తెచ్చుకున్నా, కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించినంతగా రాబట్టలేకపోయింది. కానీ రాజమౌళి అంతటి వాడే, తన ‘బాహుబలి’ సినిమాలోని ఓ సన్నివేశానికి ఆయనతోనే డైలాగ్స్ రాయించారంటే.. ఆయన టాలెంట్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుగా? దేవా కట్టా. ప్రభుత్వ పాలసీలు, సిస్టమ్ వంటి వాటిపై పూర్తి అవగాహన ఉన్న దర్శకుడిగా దేవా కట్టాకు పేరు. సక్సెస్ సంగతి పక్కన పెడితే.. సినిమా సినిమాకు ఆయనపై ప్రేక్షకులలో రెస్పెక్ట్ మాత్రం పెరుగుతూనే వస్తుంది. సాహసం చేయడానికి ఇష్టపడే దేవా కట్టా.. ఇప్పుడు ఇద్దరు దిగ్గజ నాయకుల జీవిత కథని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ ప్రయత్నం కత్తి మీద సాము వంటిదే. అయినా కూడా దేవా కట్టా వెనకడుగు వేయకుండా.. ఇద్దరు స్నేహితులు రాజకీయాల్లోకి వచ్చి ఎలా ప్రత్యర్థులుగా మారారనే కథతో.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ‘మయసభ’ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. మహాభారతంలోని సభా పర్వంలో వచ్చే ‘మయసభ’ను ఈ సిరీస్‌కు పేరుగా పెట్టడానికే ఘట్స్ కావాలి. అలాంటి ఘట్స్ ఉన్న దర్శకుడిగా దేవా కట్టా చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకు మెప్పించింది? అసలు ఇందులో ఉన్న విషయం ఏమిటనేది? రివ్యూలో తెలుసుకుందాం..
కథ: (Mayasabha Story)
మొత్తం 9 ఎపిసోడ్స్‌గా దాదాపు ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల నిడివితో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. రాయలసీమలోని రెండు ప్రాంతాలకు చెందిన ఇద్దరు సామాన్య వ్యక్తులు కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి), ఎంఎస్ఆర్ (చైతన్యరావు) ఎలా కలుసుకున్నారు? వారి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? వారిద్దరు తెలుగు రాజకీయాల్లోకి ఎలా ఎంటరయ్యారు? ఒక పార్టీలో ఉన్న ఇద్దరూ వేరు వేరుగా పార్టీలలోకి ఎందుకు వెళ్లారు? రాజకీయాల్లోకి రాకముందు స్నేహితులుగా ఉన్న వారిద్దరూ.. వేరు వేరు పార్టీలకు వెళ్లిపోయిన తర్వాత వారి మధ్య ఎలాంటి రాజకీయాలు నడిచాయి? రెడ్డి వర్గపు ఆధిపత్య పోరును కమ్మ వర్గానికి చెందిన సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన కృష్ణమ నాయుడు ఎలా జయించాడు? ఫ్యాక్షన్ కుటుంబం నుండి వచ్చి డాక్టరైన ఎంఎస్ఆర్.. రాజకీయ అరంగేట్రం ఎటువంటి మలుపులు తిరిగింది? స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం.. ఎలాంటి మలుపులతో రాజకీయాలవైపు నడిచింది. రాష్ట్ర రాజకీయాలను వీరిద్దరూ ఎలా ప్రభావితం చేశారు? మధ్యలో కొత్త పార్టీని స్థాపించిన అగ్ర కథానాయకుడైన రాయపాటి చక్రధర్ రావు (సాయి కుమార్) చెంతకు కృష్ణమ నాయుడు ఎలా చేరాడు? ఆయనకు అల్లుడు కావాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ వెబ్ సిరీస్.
Also Read- Kapil Sharma Cafe: మళ్లీ కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పుల మోత.. 25 రౌండ్లు కాల్పులు! వారి పనే!
నటీనటుల పనితీరు:
ఈ కథలోని ఇద్దరు నాయకులు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలుసు. అలాంటి వారి పాత్రలు చేసే సమయంలో.. నటీనటుల ఎంపికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ విషయంలో దేవా కట్టాను అభినందించాల్సిందే. ఆది పినిశెట్టి ఇందులో నాయుడుగా, చైతన్య రావు వచ్చేసి రామిరెడ్డిగా పర్ఫెక్ట్‌గా సెట్టయ్యారు. మరీ ముఖ్యంగా ఆది పినిశెట్టి పాత్రకు నత్తి కూడా ఉంది. ఆ నత్తితో అవమానాలు కూడా పడాల్సి ఉంటుంది. అలాగే రామిరెడ్డి కూడా తన ఫ్యాక్షన్ ఫ్యామిలీని వదిలి బయటకు రావాలి. అటు ఆది పినిశెట్టి, ఇటు చైతన్యరావు వారి పాత్రలకు అద్భుతంగా న్యాయం చేశారు. చెప్పుకుంటున్న ఇద్దరు దిగ్గజ నాయకులు వయసులో ఉన్నప్పుడు ఇలానే ఉండేవారేమో అని అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్‌గా పాత్రల్లో అతికిపోయారు. అగ్ర కథానాయకుడు ఆర్‌సీఆర్ పాత్రలో సాయికుమార్ అరిపించేశాడనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆ అగ్ర హీరో పాత్రలో చాలా మంది నటించారు. కానీ సాయి కుమార్ జీవించేశారు. తాన్య రవిచంద్రన్ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగానే ఉన్నా.. ఆమెకు చాలా మంచి సీన్లు పడ్డాయి. నాయుడు, రెడ్డిల తండ్రి పాత్రలను పోషించిన నటులు కూడా చక్కగా చేశారు. ముఖ్యంగా శివారెడ్డి పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. రెడ్డి వైఫ్‌గా చేసిన భావన కూడా చక్కగా ఒదిగిపోయింది. దాదాపు ఒక జనరేషన్‌కు సంబంధించిన ఈ కథలో నాజర్, శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, ప్రధానిగా చేసిన దివ్యా దత్, శత్రు, రఘుబాబు ఇలా అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పెట్టేశారు. నిజంగా ఒక తరాన్ని చూసిన ఫీలింగ్‌ని కలిగించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సిరీస్ ఇప్పటి జనరేషన్ చూస్తున్నా.. ఇంతకు ముందు జనరేషన్‌కు సంబంధించిన ప్రతి వస్తువును మిస్ కానివ్వకుండా ప్రొడక్షన్ డిజైన్ చేసిన వర్క్‌ని ముందుగా మెచ్చుకోవాలి. అప్పటి రైలు బండి, తాగే డ్రింక్, వేసుకునే దుస్తులు అన్నింటిపై మంచి శ్రద్ధ పెట్టారు. ఆఫ్ కోర్స్ అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీని వాడారనుకోండి. సినిమాటోగ్రఫీ కూడా ఆ కాలానికి తీసుకెళ్లింది. దేవా కట్టా అంటే డైలాగ్స్ తూటాల్లా పేలతాయి. ఇందులో కూడా అలాగే తూటాలు దింపారు. డైలాగ్స్ హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ పరంగా మాత్రం ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కాకపోతే ప్రతీది వివరంగా తెలియడం కోసం.. ఆ ఇద్దరి నాయకుల లైఫ్‌లో ఉన్న మెయిన్ మెయిన్ అంశాలను ఇప్పటి తరానికి తెలియజేయాలని దేవా కట్టా భావించినట్లున్నాడు. అందుకే నిడివి విషయంలో రాజీ పడినట్లుగా లేరు. పాటలు అంతగా ఎక్కవు కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సిరీస్‌పై ఇంకాస్త ఇంట్రస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఇలా సాంకేతిక నిపుణులందరూ వారి డ్యూటీకి న్యాయం చేశారు.
విశ్లేషణ: (Mayasabha Review)
ముందుగా అసలు ఈ సిరీస్‌కు ‘మయసభ’ అనే పేరు పెట్టడంలోనే దేవా కట్టా నూటికి నూరు శాతం మార్కులు కొట్టేశారని చెప్పుకోవచ్చు. మహాభారతంలో తనని కాపాడిన అర్జునుడికి మయుడు ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకున్నప్పుడు.. శ్రీకృష్ణుడి సూచన మేరకు ధర్మరాజు కోసం ఒక అద్భుతమైన సభా భవనాన్ని నిర్మించమని అర్జునుడు మయుడిని కోరతాడు. మయుడు పదునాలుగు నెలల పాటు కష్టపడి ఈ మయ సభను నిర్మిస్తాడు. ఈ సభలో అన్నీ అద్భుతాలే. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ కథలోని ఇద్దరు దిగ్గజాల జర్నీ కూడా వారికి తెలియకుండానే అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. చివరికి దుర్యోధనుడికి ఆ మయసభలో అవమానం జరగడం, ఆ అవమానంతో ఆయన పాండవులపై మరింత ధ్వేషం పెంచుకోవడం, తద్వారా కురుక్షేత్ర సంగ్రామం.. ఇది మయసభకు చరిత్రలోని కథ. ఇందులో కూడా ఇద్దరు సామాన్యమైన వ్యక్తులు కలుసుకోవడం, వారి మధ్య స్నేహం ఏర్పడటం, ఇద్దరూ కలిసి రాజకీయాలవైపు అడుగులు వేయడం, ఆ తర్వాత ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ.. ఒక్కొక్కరు రాజకీయం చేయడం, ఇద్దరి మధ్య వైరం.. ఇలా ఇద్దరి జీవితాలను తరచి చూస్తే ఒక సంగ్రామమే జరిగిందనే దానికి సూచికగా ‘మయసభ’ పేరును దేవా కట్టా పెట్టి ఉంటారు.
Also Read- Tollywood Hero: ‘జయం’ సినిమాకు రిజిక్ట్ చేశారు.. కట్ చేస్తే, ఇప్పుడు పాన్ ఇండియా ఆ హీరోకి దాసోహం!
ఆ ‘మయసభ’కు ఏమాత్రం మించకుండా నిజంగా ఈ సిరీస్‌తో ఆయన అద్భుతమే చేశాడని చెప్పాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితుల్లో పాటలో క్యాస్ట్ పదం వస్తేనే మనోభావాలు దెబ్బతింటున్నాయి. అలాంటిది సిరీస్ మొత్తం రెండు క్యాస్ట్‌ల మీద నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలను బట్టి.. ఏ దిగ్గజ నాయకుడి పాత్ర తగ్గినా, మంట పెట్టేస్తారు. అయినా సరే, దేవా కట్టా, కిరణ్ జయకుమార్ చెప్పాలనుకున్న విషయాన్ని, నేటి తరానికి ఇద్దరు స్నేహితుల మధ్య వైరానికి కారణమైన వాటిని తెలియజేసే క్రమంలో కొంతమేర సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నప్పటికీ.. సూటిగానే చెప్పారని భావించవచ్చు. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ సీన్‌ని కనెక్ట్ చేసిన విధానం, సీజన్ 2 కోసం వెయిట్ చేసేలా చేశాయి. అంతేకాదు, అసలైన డ్రామా, దర్శకులకి అసలు సిసలు పరీక్ష అంతా సీజన్ 2లోనే ఉంటుందనే హింట్ ఇచ్చిన విధానం కూడా బాగుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
9 ఎపిసోడ్స్ ఉన్నా.. ప్రతి ఎపిసోడ్‌లో ఎగ్జైట్ చేసే సన్నివేశాలు, హై ఇచ్చే సన్నివేశాలు ఉండటం.. ఈ సిరీస్‌కు హైలెట్. తెలుగు రాజకీయాలలో చరిత్రను క్రియేట్ చేసిన ఇద్దరు నాయకుల జీవితాన్ని, వారి ఫ్యాన్స్ ఎవరూ హర్ట్ కాకుండా చెప్పిన తీరుకు దర్శకులిద్దరికీ హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఇద్దరి జీవితాలు తెరిచిన పుస్తకాలే. కానీ కొన్ని పేజీల్లో మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలు కూడా ఇందులో ఉండటం గమనించవచ్చు. మరి అవి నిజంగానే జరిగాయా? లేదంటే కల్పించారా? అనేది.. ఆ నాయకుల సమకాలీకులకు, ఆ కుటుంబాలలోని వారికి మాత్రమే తెలుసు. కానీ ఈ వెబ్ సిరీస్‌ను కొత్త వ్యక్తి, ఈ ఇద్దరి గురించి తెలియని వ్యక్తి ఎవరైనా చూస్తే మాత్రం.. ఇద్దరి స్నేహానికి ఫ్యాన్ అయిపోతారు. ఆ తర్వాత వారి ఫేస్‌లో కూడా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఊహించవచ్చు. ప్రతి సన్నివేశంలోనూ దర్శకులు పడ్డ తపన, తీసుకున్న కేర్, ముఖ్యంగా దేవా కట్టా విజన్ స్పష్టంగా తెలుస్తుంది. మధ్యలో ఆ ఎమర్జెన్సీ పేరుతో వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ అనిపిస్తాయి. భాష తెలియని వారికి ఏంటీ నస అనిపిస్తుంది? కానీ, ఎప్పుడైతే అగ్ర కథానాయకుడి అవతారంలో సాయికుమార్ ఎంటరవుతాడో.. కథలో మరింత ఊపు వస్తుంది. తెలుగు రాజకీయాలకు కొంత నాటకీయతను జత చేసి దేవా కట్టా రాసుకున్న కొన్ని సన్నివేశాలు, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర, వీర తెలుగు పార్టీ ఆవిర్భావం వంటి సన్నివేశాలు లైవ్ చూస్తున్నట్టే అనిపిస్తాయి. అంతచక్కగా వాటిని పిక్చరైజ్ చేశారు. ఇక రెండో సీజన్‌పై ఆసక్తి క్రియేట్ చేసేలా.. ఇద్దరు దిగ్గజ నాయకుల సంభాషణతో.. దేవా కట్టా మార్క్ ‘యుద్ధం’ డైలాగ్‌తో ముగించిన తీరు బాగుంది. మొత్తంగా అయితే.. సీజన్ 2లో ఉండే విషయం ఈ సిరీస్‌కు చాలా ఇంపార్టెంట్. సీజన్ 1లో దేవా ఎక్కడా దొరకలేదు కానీ, సీజన్ 2 ఏమాత్రం పట్టు తప్పినా, పెద్ద యుద్ధాలే జరుగుతాయి. సీజన్ 1 పరంగా మాత్రం.. ఇప్పటి వరకు ఇలాంటి తరహా వెబ్ సిరీస్‌లు ఎన్ని వచ్చినా.. వాటన్నింటినీ మించేలా ‘మయసభ’ ఉందని చెప్పొచ్చు. వయలెన్స్ శాతం కాస్త ఎక్కువే ఉంది.