Woman Peddler Arrest
తెలంగాణ

Medical Students Drugs: మెడికోస్ గంజాయి మత్తులో.. కోటిన్నర టర్నోవర్ కలిగిన మహిళా పెడ్లర్ అరెస్ట్

మత్తులో చిత్తవుతున్న మెడికోలు
నిందితుని అరెస్ట్ తో బయటపడ్డ వివరాలు
9 మందిని డీ అడిక్షన్ సెంటర్ కు తరలించిన అధికారులు
మహిళా పెడ్లర్ కూడా అరెస్ట్
యేటా ఆమె టర్నోవర్ కోటిన్నరకు పైగానే

Medical Students Drugs: రేపో మాపో వైద్య విద్యను పూర్తి చేసుకుని డాక్టర్లుగా మారాల్సిన విద్యార్థినీ, విద్యార్థులు గంజాయి మత్తుకు బానిసలయ్యారు. పక్కగా సేకరించిన సమాచారంతో ఈగల్ టీం అధికారులు ఓ పెడ్లర్ ను అరెస్ట్ చేయటంతో మెడికోల మత్తు బాగోతం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలిందన్న చందాన ఈ కేసులో ఓ అంతర్ రాష్ట్ర మహిళా పెడ్లర్ కూడా పట్టుబడింది. విచారణలో గంజాయి దందాలో ఆమె టర్నోవర్ యేటా కోటిన్నర రూపాయలకు పైగానే ఉన్నట్టుగా నిర్ధారణ కావటం గమనార్హం. ఈగల్​ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా​…
కర్ణాటక రాష్ట్రం బీదర్ లోని ఇరానీ కాలనీకి చెందిన జరీనా భాను (46) గత పదిహేనేళ్లుగా గంజాయి దందా చేస్తోంది. యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా డబ్బు తీసుకుంటూ హైదరాబాద్‌లో ఇదే దందా చేస్తున్న 51మంది లోకల్ పెడ్లర్లకు గంజాయిని సరఫరా చేస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రిసాలాబజార్ కు చెందిన అరాఫత్ అహమద్ ఖాన్​ (23)కు ఆమెతో పరిచయం ఏర్పడింది. నిజానికి అహమద్ ఖాన్ మొదట్లో గంజాయిని సేవించేవాడు. ఆ తర్వాత తేలికగా డబ్బు సంపాదించటానికి దానిని అమ్మటం మొదలు పెట్టాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన డీఎస్పీ కే.నర్సింగ్ రావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్​ఐలు సుదర్శన్ యాదవ్, వెంకటరమణలతోపాటు సిబ్బందితో కలిసి అహమద్​ ఖాన్​‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 2 కిలోల గంజాయిని సీజ్ చేశారు.

Also Read- Bharadwaja Thammareddy: సాఫ్ట్‌వేర్ వాళ్లతో సినీ కార్మికులను పోల్చవద్దు..

వందమందికి పైగా కస్టమర్లు…
అహమద్​ ఖాన్​‌ను జరిపిన విచారణలో అతనికి వందమందికి పైగా కస్టమర్లు ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో ఈగల్​ టీం అధికారులు అతని మొబైల్​ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లోని డేటాను విశ్లేషించగా అహమద్​ ఖాన్​ కూడా ఆన్​ లైన్​ పేమెంట్లు తీసుకుంటూ గంజాయి సప్లయ్​ చేస్తున్నట్టుగా బయట పడింది.

32మంది మెడికోలు…
దిగ్ర్భాంతికరమైన అంశం ఏమిటంటే అహమద్ ఖాన్​ కస్టమర్ల లిస్టులో మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఘన్ పూర్​ లోని మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​‌లో ఎంబీబీఎస్​ చదువుతూ హాస్టళ్లలో ఉంటున్న 32మంది మెడికోల వివరాలు వెలుగు చూడటం. వీరిలో 24మందికి అధికారులు డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 9మందికి పాజిటివ్​ వచ్చింది. వీరిలో ఇద్దరు యువతులు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో అందరు మెడికోలకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అధ్యాపకులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో ఈగల్ టీం అధికారులు కౌన్సెలింగ్ జరిపారు. పాజిటివ్‌గా తేలిన 9మందిని డీ అడిక్షన్​ సెంటర్‌కు తరలించారు. నెల రోజులపాటు వీరిని సెంటర్ లోనే ఉంచి చికిత్స అందచేయనున్నారు.

ఆమె టర్నోవర్ యేటా కోటిన్నర పైనే…
ఇక, అహమద్​ ఖాన్​ ద్వారా తెలిసిన వివరాలతో ఈగల్​ టీం అధికారులు జరీనా భానును కూడా అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2010 నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్న జరీనా భాను టర్నోవర్ ప్రతీయేటా కోటిన్నర రూపాయలకు పైగానే ఉంటున్నట్టుగా ఈగల్​ టీం అధికారులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్ లోనే 51మంది లోకల్ పెడ్లర్లకు ఆమె గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా నిర్ధారించారు. కొన్ని నెలల వ్యవధిలోనే అహమద్ ఖాన్​ నుంచి 6లక్షలు తీసుకుని గంజాయి సప్లయ్​ చేసినట్టుగా విచారణలో వెల్లడైంది. నగదు లావాదేవీలన్నీ ఆమె యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారానే జరిపినట్టుగా స్పష్టమైంది. గతంలో పలుమార్లు అరెస్ట్ అయినా బెయిల్ పై విడుదలై బయటకు వస్తూ జరీనా భాను ఈ దందాను కొనసాగిస్తున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.

Also Read- Karavali: ‘కాంతార’ తరహాలో ‘కరవాలి’.. ‘మవీర’ ఆగమనం చూశారా?

తనిఖీలు కొనసాగుతాయి…
కాగా, వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల్లో కొందరు గంజాయికి అలవాటు పడిన ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈగల్ టీం అధికారులు దీనిపై సీరియస్‌గా దృష్టిని సారించారు. ముందు ముందు వేర్వేరు మెడికల్ కాలేజీల్లో తనిఖీలు జరుపుతామని తెలిపారు. డ్రగ్ డిటెక్షన్ కిట్లతో అక్కడికక్కడే పరీక్షలు జరుపుతామని చెప్పారు. మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్టు తెలిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయా మెడికల్​ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకులు, హాస్టళ్ల నిర్వాహకులు క్యాంపస్ లలోకి మాదక ద్రవ్యాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దీని కోసం ఆయా విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్​ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్ క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 8712671111 నెంబర్​‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.

ఆస్తులు జప్తు చేసే అవకాశం…
కాగా, గంజాయి స్మగ్లింగ్ చేయటం ద్వారా యేటా కోటిన్నర రూపాయలకు పైగా టర్నోవర్ చేస్తూ జరీనా భాను భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా ఈగల్​ టీం అధికారులు జరిపిన దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిసింది. సంబంధిత కోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించటం ద్వారా అక్రమ దందాతో ఆమె సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని అధికారులు యోచిస్తున్నట్టుగా తెలిసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు