Putin India Visit: రష్యా నుంచి చమురు కొనుగోలును కారణంగా చూపుతూ భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్‌లను 50 శాతానికి పెంచిన నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో (Putin India Visit) పర్యటించనున్నారు. ఈ ఏడాది చివరిలో ఆయన భారత్ సందర్శనకు రానున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను ఖరారు చేయడంపై సంబంధిత వర్గాలు దృష్టి పెట్టాయని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం ప్రకటించారు. అజిత్ ధోవల్ ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయ్‌గూతో ఆయన కీలక సంప్రదింపులు జరిపారు.
జరగబోయే భేటీపై (మోదీ-పుతిన్) భారత్ ఉత్సాహంగా, ఆనందంగా ఉందని అజిత్ ధోవల్ పేర్కొన్నారు. గతంలో భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో శిఖరాగ్ర సమావేశాలు కీలక మైలురాళ్లుగా నిలిచాయని, అందుకే, రాబోయే భేటీకి కూడా ప్రాధాన్యత నెలకొందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు రానుండడం ఇదే పర్యటన కానుండడం గమనార్హం.
గతేడాది రెండు సార్లు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత సంవత్సరం రెండుసార్లు పరస్పరం భేటీ అయ్యారు. మోదీ రష్యా పర్యటన సందర్భంగా మొదటి సమావేశం జరిగింది. భారత్-రష్యా 22వ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా మోదీ అక్కడికి వెళ్లారు. మోదీ మూడో దఫా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి విదేశీ పర్యటనగా రష్యా వెళ్లారు. ఆ పర్యటన సందర్భంగా మోదీని రష్యా అత్యున్నత పౌర సత్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెంట్ ఆండ్రూ ది అపోస్తల్’ సత్కరించింది. భారత్-రష్యా సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేసినందుకు ఈ సత్కారం చేసింది.
Read Also- Hyd Rain Updates: భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం.. ట్రాఫిక్ జామ్ ఏరియాలు ఇవే!
ఇక, రెండోసారి గతేడాది అక్టోబరులో కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా తిరిగి భేటీ అయ్యారు. తాజాగా, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అధ్యక్షుడు పుతిన్ పర్యటన అత్యంత ఆసక్తి నెలకొంది. రష్యా నుంచి భారత్ ఇంకా ముడి చమురు కొనుగోలు చేస్తోందంటూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సుంకాలను రెట్టించారు. భారతీయ దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్ విధిస్తూ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగిస్తుండడమే ఇందుకు కారణమని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా ముగించకపోతే, ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండోసారి జరిమానాలు విధించబోతున్నామని అమెరికా హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం త్వరలోనే నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. అధ్యక్షుడు పుతిన్ త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవనున్నాయని రష్యా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధం ముగింపుపై ఈ భేటీలో క్లారిటీ వస్తుందో లేదో వేచిచూడాలి.
Read Also- Bribe Case: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి.. ఎంతో తెలుసా?