Raksha Bandhan: అన్న చెల్లెళ్లు, అక్క తమ్ముళ్లు ప్రతీ ఏటా ఎంతో వైభవంగా రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ (Raksha Bandhan 2025) జరుపుకుంటారు. సోదరుడు-సోదరి మధ్య ఉన్న ప్రేమ, బాధ్యత, అనుబంధాన్ని సూచించే పవిత్రమైన హిందూ సంప్రదాయ పండుగగా రాఖీని కీర్తిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 8, 2025 రాఖీ పండుగ వచ్చింది. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ ప్రత్యేకత? రాఖీ కట్టకపోతే ఏం జరుగుతుంది? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? పురాణాలతో రాఖీ పండుగకు ఉన్న సంబంధాలు ఏంటీ? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
రాఖీ ఎందుకు జరుపుకుంటారు?
రాఖీ పౌర్ణమి రోజున మహిళలు.. తమ సోదరుడి మణికట్టుకు రాఖీ (పవిత్రమైన దారం) కడతారు. సోదరుడికి దీర్ఘాయుష్షు, ఆనందం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తారు. ఇందుకు బదులుగా తన సోదరిని ఎల్లప్పుడూ రక్షిస్తానని.. అన్ని వేళలా మద్దతుగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తారు. ఈ పండుగ సోదరభావాన్ని బలోపేతం చేయడమే కాక కుటుంబ విలువలను సైతం చాటి చెబుతుంది.
రాఖీ కట్టకపోతే ఏం జరుగుతుంది?
రాఖీ కట్టడం ఒక సాంప్రదాయిక ఆచారం మాత్రమే కాదు. సోదరి, సోదరుడి మధ్య ఉన్న భావోద్వేగ బంధానికి ప్రతీక. అయితే రాఖీ కట్టకపోతే కచ్చితంగా చెడు జరుగుతుందన్న అభిప్రాయం లేదు. ఎటువంటి దుష్పరిణామాలు జరగవు. ఈ సంప్రదాయం అక్క తమ్ముడు, అన్నా చెల్లెళ్ల హృదయపూర్వక భావనలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఆచారం పాటించకపోతే సోదరి సోదరుడి మధ్య భావోద్వేగ బంధం లేదా సంప్రదాయం ప్రాముఖ్యత కొంత మేర తగ్గవచ్చని కొందరు భావిస్తుంటారు. అయితే దూరాభార సమస్యలు, సోదరులతో మనస్ఫర్థలు కారణంగా రాఖీ పండుగను కొందరు జరుపుకోని వారు కూడా ఉన్నారు.
రాఖీ సంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది?
రాఖీ పండుగ (Rakhi Festival History) మన పురాణాలతో లింకప్ అయ్యి ఉంది. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైందనే దానిపై ఖచ్చితమైన తేదీ లేనప్పటికీ పురాణాల ప్రకారం కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడి (Lord Sri Krishna)కి గాయమైనప్పుడు ద్రౌపది (Droupadi) చీర నుంచి ఒక గుడ్డ ముక్కను చీల్చి కట్టిందని అంటారు. అప్పుడు కృష్ణుడు ఎల్లప్పుడూ రక్షిస్తానని హామీ ఇచ్చారట. అలాగే యముడు సైతం తన సోదరి యమునా నది చేత రాఖీ కట్టించుకున్నారని.. బదులుగా ఆమె రక్షణ ఇచ్చాడని పురాణ కథ ప్రచారంలో ఉంది.
Also Read: UK Woman: గాల్లో ఉండగా వృద్ధురాలిపై లైంగిక దాడి.. ఇలా ఉన్నారేంట్రా బాబు!
ఆధునిక కాలంలో రాఖీ
పూర్వం రాఖీ పండుగ అంటే ఒక ధారము లేదా వస్త్రాన్ని చేతికి కట్టేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. రంగు రంగుల రాఖీలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. నీలం, ఎరుపు, బంగారం, పసుపు ఇలా అనే రంగుల్లో చాలా ఆధునిక డిజైన్లతో రాఖీలు లభిస్తున్నాయి. సోదరిమణులు రాఖీ కట్టిన అనంతరం.. సోదరులు వారికి బహుమతులు లేదా నగదును కానుకగా అందజేయడం అనవాయితీగా వస్తోంది.