Lok Sabha Elections: దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే మనం ఎన్నికల నియమావళి అంటున్నాం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన మొదలు కౌంటింగ్ ముందు వరకు ఈ నియమావళి అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో జరిగే పనులను ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వాలకు కేవలం నామమాత్రపు అధికారాలే ఉంటాయి. ఎన్నికల నిర్వహణ సాఫీగా, పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు జరగాల్సిందే గానీ, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల అటు ప్రభుత్వాలకు, ఇటు సామాన్యులకు ఇబ్బంది ఎదురవుతోంది.
ఎన్నికల నియమావళి ప్రకారం మద్యం, నగదు పంపిణీ, ఆస్తుల విధ్వంసం, ఫేక్ న్యూస్ ప్రచారం చేయటం, ఓటర్లను భయపెట్టటం, రెచ్చగొట్టే ప్రసంగాలు, అనుచిత వ్యాఖ్యలు , నేతల అన్ పార్లమెంటరీ భాష, కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడగడం, ఆయుధాల ప్రదర్శన, భయపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం, అధికార పార్టీలో ఉన్నవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం కుదరదు. అయితే, ఈ నిషేధాలు వాస్తవంగా అమలవుతున్నాయా? అంటే లేదనే జవాబే వస్తోంది. సాక్షాత్తూ దేశ ప్రధాని మతం పేరుతో ఓటర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేసినా, ఎన్నికల సంఘం మందలిస్తూ, నోటీసులకే పరిమితం అయింది.
ప్రస్తుతం మన దేశంలో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాలుగో దశలో మే 13వ తేదీన తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యాయి. అంటే.. ఎన్నికలు జరిగి పదిరోజులు పూర్తి కాగా, మరో 10 రోజుల పాటు ఎన్నికల కోడ్ ఇక్కడ అమలులో ఉండనుంది. ఇదే సమయంలో ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో రైతన్నలకు అపారం నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నీటి పాలైంది. మరోవైపు నగరాల్లో వర్షాకాలంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాగం క్షేత్ర స్థాయిలో అనేక పెండింగ్ పనులు చేయాల్సి ఉంది. ఇక.. మరో రెండు వారాల్లో వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలలన్నీ తెరుచుకోనున్నాయి. కోడ్ కారణంగా టీచర్లు, విద్యార్థులకు సంబంధించిన ఏ రకమైన నిర్ణయాలూ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ, ఇక్కడి ముఖ్యమంత్రి పై అంశాల మీద ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే, దానివల్ల ఆంధ్రప్రదేశ్, తదితర పొరుగు రాష్ట్రాల ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తాయని ప్రశ్న తలెత్తినా.. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ఐదో విడతలోనే ఎన్నికలు పూర్తయిపోయాయి కనుక ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యే అవకాశమే లేదు.
మరోవైపు, నియమావళిలో భాగంగా ఎన్నికల వేళ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లోని సిబ్బంది తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు ఫీజు రూపంలో చెల్లించేందుకు రూ.50 వేలకు మించి నగదు తీసుకుపోతున్న వారికి ఈ తనిఖీలు తలనొప్పిగా మారుతున్నాయి. బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసినట్లుగా రసీదు వంటివి లేదని నగదును, ఏదైనా శుభకార్యాలకి బయలుదేరిన వారి వద్ద నగలను సీజ్ చేయటం జరగుతోంది. ఈ నగదును, బంగారాన్ని సీజ్ చేసి కోర్టుకు స్వాధీన పరచటంతో తిరిగి, వాటిని ఆధారాలు చూపి తీసుకోవాలసి రావటం సామాన్యులకు ఇబ్బందిగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొత్త ప్రభుత్వం ఇల్లు సర్దుకోకముందే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావటం, ఈ రెండు నెలల పాటు ఎన్నికల కోసం సమయం కేటాయించాల్సి రావటంతో నూతన ప్రభుత్వం తలపెట్టిన అనేక పనులు పెండింగ్‌లో పడిపోయాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎన్నికల కోడ్ కారణంగా నేటికీ ప్రభుత్వం అమలుచేయలేని పరిస్థితి. ఒకవైపు ఖరీఫ్ సీజన్ రావటంతో వీలున్నంత త్వరగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా.. ముందడుగు వేయలేని దుస్థితి. మరోవైపు, రైతులకు కొత్తగా రుణాలు అందించేందుకు బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చించాల్సి ఉంది. ఇన్నిపనులు పెండింగ్‌లో ఉన్నా, ప్రభుత్వం నేరుగా ఏ నిర్ణయమూ చేయలేని పరిస్థితి. చివరికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మంత్రిమండలి సమావేశం నిర్వహించుకోవటానికీ ఈ నియమావళి అడ్డంకిగా మారింది. దీంతో ప్రభుత్వం సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల విధినిర్వహణకు అడ్డంకిగా మారిన నియమావళి మీద పున:సమీక్ష చేయాలని, అదే సమయంలో కోడ్ కారణంగా ఆయా విభాగాల పనులు పెండింగ్‌లో పెట్టి ప్రజలను ఇబ్బందులు పాలు చేయకుండా, సదరు విభాగాధిపతులు తమకున్న పరిమితుల మేరకు పాలనా సంబంధిత అంశాల అమలును తమ బాధ్యతను స్వీకరించాలని మేధావులు కోరుతున్నారు.
- డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355.