Land Dispute: మాజీ మంత్రి మల్లారెడ్డిపై సుచిత్ర దగ్గర భూమి కొనుగోలు చేసిన వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి మంత్రి అయ్యాకే తమ భూమిని అధీనంలోకి తీసుకున్నారని వివరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శ్రీనివాస్ రెడ్డి, బషీర్‌లు మాట్లాడారు. సుచిత్ర దగ్గర 4 వేల గజాల భూమి కొనుగోలు చేసిన పది మందిలో వీరిద్దరూ ఉన్నారు.
సుచిత్ర దగ్గర 2.2 ఎకరాల్లో తమకు 4 వేల గజాల భూమి ఉన్నదని, ఐదు సార్లు సర్వే జరిగినా తమకూ అనుకూలంగా వచ్చిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పది మందితో కలిసి 4 వేల గజాల భూమిని కొనుగోలు చేశామని, 2016లో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉన్నదని వివరించారు. 2016లో భూమిలో ఎలాంటి షెడ్లు లేవని, కానీ, మంత్రి అయ్యాక మల్లారెడ్డి ఆ భూమిని అధీనంలోకి తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఆ భూమి తమదేనని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ మల్లారెడ్డిది 1.29 ఎకరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. మిగితా 4 వేల గజాలు తమదని వివరించారు. తమకు మల్లారెడ్డికి ఎనిమిదేళ్ల నుంచి ఈ భూవివాదం కొనసాగుతూనే ఉన్నదని తెలిపారు. 82 సర్వే నెంబర్‌లో 17 ఎకరాల 31 గుంటల భూమి ఉన్నదని, అందులో ఓనర్ సుధామ పేరు మీద 4 ఎకరాల 24 గుంటలు ఉన్నదని వివరించారు. 1.29 మాత్రమే తనదని మల్లారెడ్డి అన్నారని, ఇప్పుడేమో మొత్తం భూమి తమదేనని అంటున్నారని తెలిపారు.
2016లో ఎకరం నాలుగు గుంటల భూమి కొన్నామని మహమ్మద్ బషీర్ అన్నారు. ఇంజెక్షన్ ఆర్డర ఉన్నప్పటికీ 2016 నుంచి ఇప్పటి వరకు మల్లారెడ్డి మనుషులు, పోలీసులు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం రెవెన్యూ అధికారులు సర్వే చేసి కేటాయించిన భూమిలో ఫెన్సింగ్ వేసుకున్నామని, పొజిషన్‌లో ఉన్నామని వివరించారు. తాము పొజిషన్‌లో ఉన్నామని చూడకుండా ఫెన్సింగ్ తొలగించి దాడి చేయడానికి వచ్చారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డిలు కలిసి సెంట్ భూమి కూడా ఇవ్వమని బెదిరిస్తున్నారని, మల్లారెడ్డి బేషరతుగతా తమ భూమి తమకు అప్పగించాలని కోరారు. సర్వే నెంబర్ 82లో తమకు కచ్చితంగా 4 వేల గజాలు రావాలని స్పష్టం చేశారు.