Snacking Dangers: కొందరు నిత్యం ఏదోటి తింటూనే ఉంటారు. టీ తాగుతున్నప్పుడు బిస్కెట్స్, భోజనం తర్వాత స్వీట్స్ లేదా డెజెర్ట్స్, సినిమా చూసేటప్పుడు చిప్స్ వంటివి తింటూ.. నోరు, కడుపును బిజీగా ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల బాడీకి అధిక కేలరీలు అందడంతో పాటు.. బరువు పెరిగే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పేగుల పనితీరుపైనా దుష్ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు.
‘సీరియల్ స్నాకింగ్’ లేదా ‘గ్రేజింగ్’
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి (Kokilaben Dhirubhai Ambani Hospital) గ్యాస్ట్రోఎంటరాలజీ (Gastroenterology) విభాగాధిపతి డాక్టర్ సుభాష్ అగల్ (Dr Subhash Agal).. నిరంతరం తినేవారి సమస్యల గురించి స్పందించారు. ముఖ్యంగా పేగు ఆరోగ్యంపై వచ్చే ప్రమాదాలను వివరించారు. ఆయన ఈ అలవాటును ‘సీరియల్ స్నాకింగ్’ (Serial snacking) గా అభివర్ణించారు. ‘ఈరోజుల్లో మనం ఏదోటి తింటూనే ఉంటాం. ఆఫీసులో పనిచేస్తూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్, టీ తాగేటప్పుడు ఒక బిస్కెట్ లేదా ఫోన్ స్క్రోల్ చేస్తూ చిప్స్ తినడం వంటివి చేస్తుంటాం. ఇలా ఆకలి లేకపోయినా తినే పద్ధతిని ‘సీరియల్ స్నాకింగ్’ లేదా ‘గ్రేజింగ్’ అని పిలుస్తారు. ఇది హానికరం కాదనిపించినా పేగు ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది’ అని అన్నారు.
ఆరోగ్యం తలకిందులు
గ్యాప్ లేకుండా తినడం అనేది పేగు చేసే ముఖ్యమైన పనులను అడ్డుకుంటుందని సుభాష్ అగల్ చెప్పారు. ‘మైక్రోబయోమ్ సమతుల్యతను కాపాడటం, సహజ శుభ్రపరిచే చక్రాలు పూర్తి చేయడం, విశ్రాంతి తీసుకుని పునరుద్ధరణ పొందడం వంటి పనులను నిరంతరం స్నోకింగ్ వల్ల పేగులు సక్రమంగా చేయలేవు. రోగనిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యం వంటి ఇతర శరీర వ్యవస్థలు.. పేగు ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల నిర్లక్ష్యంగా స్నాకింగ్ చేయడం మొత్తం ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది’ అని సుభాష్ స్పష్టం చేశారు. అంతేకాదు సీరియల్ స్నోకింగ్ వల్ల పేగుపై పడే 3 ప్రధాన ప్రతికూల ప్రభావాలను సైతం ఆయన పంచుకున్నారు.
1. పేగు ‘హౌస్‌కీపింగ్ సిస్టమ్’ కు భంగం
❄️ మీ పేగు కేవలం జీర్ణాశయం మాత్రమే కాదు. దీనికి మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ (MMC) అనే శుభ్రపరిచే వ్యవస్థ ఉంటుంది.
❄️ ఈ వ్యవస్థ భోజనాల మధ్య సమయంలో పని చేస్తుంది. ఆహారపు అవశేషాలు, బాక్టీరియాను తొలగిస్తుంది.
❄️ ఆ సమయంలో మీరు ఏ చిన్న స్నాక్ తిన్నా తిన్నప్పుడల్లా MMC ఆగిపోతుంది. నిరంతరం తినడం ఈ సహజ చక్రాన్ని భంగం కలిగిస్తుంది. ఫలితంగా అజీర్ణం, బ్లోటింగ్ లేదా స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్‌గ్రోత్ (SIBO) వంటి సమస్యలు వస్తాయి.
2. మైక్రోబయోమ్ పనితీరుకు ఆటంకం
❄️ మీ పేగులో ట్రిలియన్ల సంఖ్యలో బాక్టీరియా (మైక్రోబయోమ్) నివసిస్తాయి. ఇవి వైవిధ్యం, క్రమబద్ధమైన ఆహార పద్ధతులపై ఆధారపడతాయి.
❄️ ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర అధికంగా ఉండే స్నాక్స్ తరచుగా తినడం పేగు పరిసరాలను అవి అసమతుల్యం చేస్తాయి.
❄️ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లతో కూడిన స్నాక్స్ రక్తంలో గ్లూకోజ్‌ను పదేపదే పెంచి, ఇన్ఫ్లమేషన్ కలిగించే సూక్ష్మజీవుల పెరుగుదలకు దారితీస్తాయి. వీటిని మేలుచేసే బాక్టీరియాలు అణచివేస్తాయి.
❄️ తరుచూ తినడం వల్ల ఈ బ్యాక్టీరియాల పనికి ఆటంకం ఏర్పడి.. జీర్ణక్రియలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల రోగనిరోధక బలహీనంగా మారడం, మూడ్ స్వింగ్స్ సమస్యలు తలెత్తవచ్చు.
3. పేగు విశ్రాంతిని అడ్డుకోవడం
❄️ శరీరంలోని ఇతర అవయవాలు లాగానే పేగుకు విశ్రాంతి అవసరం. లైనింగ్‌ను పునరుద్ధరించుకోవడం, ఎంజైమ్‌లను పునఃప్రాప్తం చేసుకోవడం, సక్రమమైన పనితీరును కొనసాగించుకోవడం కోసం ఈ సమయం అవసరం.
❄️ సీరియల్ స్నాకింగ్ వల్ల పేగుకు ఈ విశ్రాంతి దొరకదు. దీర్ఘకాలంలో ఇది యాసిడ్ రిఫ్లక్స్, నిదానమైన జీర్ణక్రియ, పోషక పదార్థాల తక్కువ శోషణ వంటి సమస్యలకు దారి తీస్తుంది.
❄️ మైండ్‌లెస్ స్నాకింగ్ వలన ఆకలి, తృప్తి సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. దీనివల్ల గట్-బ్రెయిన్ కనెక్షన్ దెబ్బతింటుంది.
తినే అలవాటును ఎలా నియంత్రించాలి?
సీరియల్ స్నోకింగ్ ను పూర్తిగా మానివేయడం సమస్యకు పరిష్కారం కాదని డాక్టర్ సుభాష్ అన్నారు. ‘ఏదైనా అలవాటు వల్ల వచ్చే ప్రమాదాన్ని చూసి పూర్తిగా వదిలేయడం అనేది సహజ ప్రతిస్పందన. కానీ పూర్తిగా ఆపేయడం మరింత కోరికను పెంచుతుంది’ అని ఆయన అన్నారు. స్నాకింగ్‌ను పూర్తిగా నిషేధించడం కంటే నియంత్రణలో ఉంచి.. యాదృచ్ఛికంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా తినాలని చెప్పారు. స్నాక్స్ బదులు.. పండ్లు, ఉడికించిన కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే వస్తువులు తీసుకోవాలని సూచించారు. ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్ తీసుకుంటే అది మీ పేగు ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు.
గమనిక: మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా వార్తను అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.