M Venkaiah Naidu
జాతీయం

M Venkaiah Naidu: మన ఆర్థిక శక్తి ఏమిటో త్వరలోనే అగ్రరాజ్యాలకు తెలుస్తుంది

M Venkaiah Naidu: ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ భారత ప్రజలకు హాని తలపెడుతుంటే ఇక ఏమాత్రం చూస్తూ ఊరుకోబోమని ఆపరేషన్ సిందూర్ ద్వారా గట్టిగా తెలియజేశామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో పాలుపంచుకున్న సైనిక వీరులకు, తెర వెనక కృషి చేసిన శాస్త్రవేత్తలకు వందనం తెలియజేయడానికి ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజిలో అఖిల భారతీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జాతీయతా భావం మెండుగా ఉన్న ఉపాధ్యాయులు, మేధావులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఇతర ప్రఖ్యాత నిపుణులతో ఈ వేదిక పైనుంచి తన ఆలోచనలు పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న పాక్ మద్దతుతో ఉగ్రవాదులు చేసిన పాశవిక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పాయారని, మతం పేరు అడిగి మరీ మన ఆడబిడ్డల జీవిత భాగస్వాములను అతి దారుణంగా చంపేశారని గుర్తు చేశారు. మన ఆడబిడ్డల నుదుటి సిందూరానికి గుర్తుగా ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టి, భారత్ తన శక్తిని చాటి చెప్పిందన్నారు. ‘‘పాక్ లోని పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, సరిహద్దులు దాటకుండా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని 9 ఉగ్ర శిబిరాలపై కచ్చితమైన దాడులను నిర్వహించి వాటిని భారత సైనికులు నాశనం చేసిన తీరు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు, ఉగ్రవాద నాయకులు మరణించారు. భారత శక్తి సామర్థ్యాలేమిటో ప్రపంచానికి ఈ ఆపరేషన్ తెలియజేసింది’’ అని చెప్పారు. కేవలం 23 నిమిషాల్లోనే మన సైన్యం ఈ ఆపరేషన్ పూర్తి చేసిందన్నారు. ఇంతటి గొప్ప విజయం ప్రపంచంలో ఇంకెక్కడా లేదన్నారు. స్వదేశీ క్షిపణులు, డ్రోన్లు, శక్తిమంతమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ, శత్రుదుర్బేధ్యమైన రక్షణ వ్యవస్థ వినియోగంతో భారత్ తన స్థాయిని చాటిందన్నారు. ఈ ఆపరేషన్ త్రివిధ దళాలు — ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య అత్యద్భుతమైన సమన్వయాన్ని చాటిచెప్పిందన్నారు. బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలు శత్రువు దాడులను సమర్థంగా తిప్పికొట్టాయన్నారు. యుద్ధక్షేత్రంలో హీరోలు మన సైన్యమయితే, మంచి యుద్ధ వ్యవస్థలను అభివృద్ధి చేసి సైన్యానికి అందించడంలో మన శాస్ర్తవేత్తలు కీలక పాత్ర పోషించారని వెంకయ్యనాయుడు అభినందించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ అంతటితో ఆగలేదు. కొద్ది రోజుల క్రితం మన సైనికులు, పారామిలిటరీ బలగాలు ఆపరేషన్ మహాదేవ్ ద్వారా పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను తుదముట్టించారు’’ అని గుర్తు చేశారు.

Also Read- Nitin Gadkari: కేంద్రమంత్రి నివాసంలో బాంబు పెట్టా.. 10 నిమిషాల్లో పేలుతుందంటూ ఫోన్‌కాల్..

‘‘2025 మే 6, 7 తేదీల్లో ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇకపై ఉగ్రదాడి యుద్ధానికి సమానం అని భారత్ తెలియజెప్పింది. పాకిస్థాన్ అణ్వాయుధాల బెదిరింపులకు లొంగబోం అని మనం సమాధానం చెప్పాం’’ అని వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘భారత దేశ సుదీర్ఘ సాంస్కృతిక చరిత్రను గమనిస్తే మనమెప్పుడూ మరొకరి దేశాన్ని, భూభాగాన్ని ఆక్రమించలేదు. అయితే దీన్ని బలహీనతగా చూడరాదు. మనల్ని అస్థిరపర్చాలని చూస్తే మౌనంగా చూస్తూ ఊరుకోం. మన శక్తి సామర్థ్యాలను చాటి చెబుతాం. ఈ విషయం ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపించాం’’ అని చెప్పారు. భారత్ సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందని, ఇకపై ఉగ్రవాద చర్యలకు పాల్పడితే వారు ఎక్కడా దాక్కొన్నా శిక్ష అనుభవించాల్సేందే అన్న విషయం వారికి బోధపడిందని చెప్పారు. భారత దేశ స్వయం సమృద్ధిని ఈ ఆపరేషన్ నిరూపించిందని వెంకయ్యనాయుడు చెప్పారు. 2014లో ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో స్వదేశీ డ్రోన్లు, క్షిపణులను అభివృద్ధి చేసుకున్నామని, విదేశాలపై ఆధారపడడం తగ్గించుకున్నామని చెప్పారు. గత దశాబ్దంలో రక్షణ బడ్జెట్ మూడింతలు పెరిగిందని గుర్తుచేశారు. మన సాయుధ దళాలు లక్ష్య సిద్ధిలో చూపిన ధైర్యం, సంకల్ప బలానికి దేశం యావత్తూ ప్రణామాలు తెలియజేస్తోందని వెంకయ్యనాయుడు చెప్పారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయన్నారు. సూపర్ పవర్‌గా చెప్పుకునే కొన్ని దేశాలు భారత్‌ను ఆర్థికంగా చతికిల పడిన దేశంగా అభివర్ణిస్తున్నాయని, అటువంటి వారికి త్వరలోనే భారత్ గొప్పదనం తెలుస్తుందని వెంకయ్యనాయుడు చురకలు వేశారు. మనం త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు చెప్పారు. మనది స్వతంత్ర దేశమని, ఎవరితో వ్యాపారం చేయాలో మనకు తెలుసని, మన ప్రయోజనాలకు అనుగుణంగానే మనం వ్యాపారం చేస్తామని స్పష్టం చేశారు.

M Venkaiah Naidu

Also Read- Hero Krishnasai: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హీరో కృష్ణసాయి ఏం చేశారో చూశారా?

ఆపరేషన్ సింధూర్‌లో తాము అభివృద్ధి చేసిన క్షిపణి, డ్రోన్, ఇతర రక్షణ వ్యవస్థలు అద్భుత పనితీరు కనబర్చినందుకు చాలా సంతోషంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న శాస్ర్తవేత్తలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. భారత రక్షణ రంగ శాస్ర్తవేత్తలు, భారత రక్షణ రంగ పరిశ్రమలు, మన సైన్యం సంయుక్త విజయంగా ఆపరేషన్ సింధూర్‌ను వక్తలు అభివర్ణించారు. స్వదేశీ పరిజ్ఞానం మరింత సముపార్జించుకోబోతున్నామని చెప్పారు. ఇతర దేశాలపై ఆధార పడే పరిస్థితి ఉండబోదన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో మన స్వదేశీ యుద్ధ వ్యవస్థలు 90శాతం కచ్చితత్వంతో విజయం సాధించడం పట్ల అగ్రరాజ్యాలు ఆశ్చర్యపోయాయని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ జి. సతీష్ రెడ్డి- నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడు, యు. రాజబాబు, డైరెక్టర్ జనరల్ – మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్, డాక్టర్ జగన్నాథ్ నాయిక్, డైరెక్టర్ – సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్, అకాశ్, డాక్టర్ జి. చంద్రమౌళి- పూర్వ ప్రాజెక్ట్ డైరెక్టర్, అకాశ్, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా- జనరల్ ఆఫీసర్ కమాండింగ్ తెలంగాణ, ఆంధ్ర ఉపప్రాంతం.. వంటి ప్రముఖులెందరో పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. లెఫ్టినెంట్ జనరల్ కరణ్ వీర్ సింగ్ బ్రార్, ఆపరేషన్ సిందూర్ నేపథ్యాన్ని వీడియో రూపంలో ప్రదర్శించి వివరించారు. అంతకు ముందు ఓ సైనికుడా.. ఓ వీరుడా అంటూ ఉత్తేజిత పూరితంగా రూపొందించిన శౌర్యగీతాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. మల్లేపల్లి మోహన్ స్వరపర్చిన ఈ గీతానికి అగరం వసంత్ సాహిత్యాన్ని అందించారు. రవివర్మ ఎంతో ఉత్తేజితపూరితంగా ఈ పాటను పాడారు. కార్యక్రమానికి త్రివిధ దళాల నుంచి సైనికులు హాజరయ్యారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?