Nitin Gadkari: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులకు ఓ వ్యక్తి ఆదివారం ముచ్చెమటలు పట్టించాడు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) నివాసంలో బాంబు పెట్టానని, బాంబును ఇప్పుడే యాక్టివేట్ చేశానని, మరో 10 నిమిషాల్లో పేలిపోతుందంటూ ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి చెప్పాడు. మరో 10 నిమిషాల్లోనే బాంబు పేలుతుందని చెప్పడంతో పోలీసులు హడలెత్తిపోయారు. వెంటనే వార్ధా రోడ్డులో ఉన్న గడ్కరీ నివాసం వద్ద ఉండే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుండగానే, బాంబు స్క్వాడ్, పోలీసు బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. ఇళ్లంతా జల్లెడ పట్టిన బృందాలు ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. దీంతో, ఇది బూటకపు బెదిరింపు కాల్ అని తేల్చారు.
ఈ లోగా ఫోన్ చేసిన నిందిత వ్యక్తిని నాగ్‌పూర్ పోలీసులు గుర్తించారు. ఉమేష్ విష్ణు రౌత్ అనే వ్యక్తి ఈ బెదిరింపు కాల్ చేశాడని ట్రేస్ చేసి అతడు ఉంటున్న ఏరియాకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బూటకపు బెదిరింపు కాల్ అయినప్పటికీ గడ్కరీ నివాసం వద్ద భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. మహల్ ప్రాంతంలో ఉన్న గడ్కరీ నివాసానికి ఈ బెదిరింపు వచ్చిందని పోలీసులు తెలిపారు. కాల్‌ను ట్రేస్ చేశామని, 7498579746 నంబర్ నుంచి ఫోన్వ చ్చిందని, ఈ నంబర్ ఉమేష్ విష్ణు రౌత్ పేరిట రిజిస్టర్ అయి ఉందని వివరించారు. నిందితుడు మహల్‌లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న బీమా హాస్పిటల్ ప్రాంతానికి చెందినవాడని గుర్తించారు.
Read Also- Metro: ఓల్డ్ సిటీ మెట్రో పనులు ఎక్కడ వరకు వచ్చాయంటే?
నాగ్‌పూర్ డీసీపీ ఏమన్నారంటే..
బూటకపు బెదింపు ఫోన్‌కాల్ వ్యవహారంపై నాగ్‌పూర్ డీసీపీ ఎస్. రుషికేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నితిన్ గడ్కరీ నివాసంలో బాంబు పెట్టానని, అది మరికొద్దిసేపట్లోనే పేలిపోతుందని ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పాడన్నారు. వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను అలర్ట్ చేశామని, గడ్కరీ ఇంటి భద్రతా సిబ్బందికి సమాచారం అందించామని వివరించారు. పోలీసు అధికారులు కూడా అక్కడికి వెళ్లి తనిఖీ చేపట్టారని, బాంబ్ స్క్వాడ్‌తో ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశామని, అయితే అక్కడ ఎటువంటి బాంబు లేదా అనుమానాస్పద వస్తువు లభించలేదని, దీంతో, ఇది ఫేక్ కాల్ (హోక్స్ కాల్) అని అర్థమైందని రుషికేశ్ రెడ్డి వెల్లడించారు. నిందిత వ్యక్తి రౌత్ సిటీలోని మెడికల్ స్క్వేర్‌కు సమీపంలో ఉన్న ఓ మద్యం షాప్‌లో పని చేస్తున్నట్టు గుర్తించామన్నారు. బీమా దవాఖాన ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడని తెలిపారు. బెదిరింపుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని వివరించారు.
Read Also- Siraj: ఐదో టెస్టులో చారిత్రాత్మక రికార్డు సాధించిన మహ్మద్ సిరాజ్
నిందితుడిని గుర్తించి అతడిని అరెస్ట్ చేసేందుకు అర్హతా పత్రాన్ని దాఖలు చేసిన తర్వాతే అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రుషికేశ్ రెడ్డి తెలిపారు. బెదిరింపునకు పాల్పడడం వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే, నిందితుడు రౌత్‌కు ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదని, గతంలో అతడిపై ఎలాంటి కేసులు కూడా లేవని తెలిపారు. ఒక మద్యం షాప్‌లో సర్వర్‌గా పనిచేస్తున్నాడని వివరించారు.