Shah Rukh Khan: షారుక్ ఖాన్ తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తొలిసారిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన 71వ జాతీయ సినిమా పురస్కారాల్లో (71st National Film Awards) ‘జవాన్’ (Jawan) సినిమాకు గాను ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. తన సుదీర్ఘ సినీ జీవితంలో మెుదటి సారి నేషనల్ అవార్డ్ వరించడంతో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) స్పందించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ వీడియో సందేశం పెట్టారు.
షారుక్ ఏమన్నారంటే?
షారుక్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ‘జాతీయ అవార్డుతో సత్కరించబడటం జీవితాంతం గుర్తుంచుకునే క్షణం. ఇది కేవలం అవార్డ్ మాత్రమే కాదు.. నేను చేసే పని విలువైనదని గుర్తు చేసే సూచిక. ఇలాగే ముందుకు సాగమని కష్టపడి పనిచేయమని, సృజనాత్మకంగా ఉండమని, సినిమాకు సేవ చేయమని ఈ అవార్డ్ చెబుతుంది. శబ్దాలతో నిండిన ప్రపంచంలో మన గొంతు వినిపించడం ఒక వరం. నటన కేవలం ఉద్యోగం కాదు, తెరపై నిజాన్ని చూపించే బాధ్యత అని ఈ అవార్డు నాకు గుర్తు చేస్తోంది. అందరి ప్రేమకు కృతజ్ఞుడిని’ అని అన్నారు.
జవాన్ మూవీ టీమ్‌కు..
ఉత్తమ నటుడిగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీకి షారుక్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ‘జవాన్లో అవకాశం ఇచ్చి ఈ అవార్డుకు తగినట్లుగా నన్ను నమ్మిన అట్లీ సార్, ఆయన బృందానికి ధన్యవాదాలు. అలాగే నా వెంట అలసట లేకుండా పని చేసే నా టీమ్, మేనేజ్‌మెంట్‌కు కూడా ధన్యవాదాలు. వారి పట్టుదల, ప్రేమ లేకుండా ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు’ అని షారుక్ చెప్పుకొచ్చారు.
ఈ అవార్డు మీకోసమే..
‘నా భార్య, పిల్లలు గత కొన్నేళ్లుగా నన్ను ఇంట్లోనే పిల్లాడిలా చూసుకుంటున్నారు (చేతికి గాయమైన నేపథ్యంలోనే ప్రస్తుతం షారుక్ రెస్ట్ తీసుకుంటున్నారు). సినిమాపై నాకు ఉన్న మక్కువ నన్ను దూరం చేస్తుందని వారికి తెలుసు. కానీ వారు చిరునవ్వుతో దాన్ని భరిస్తూ నాకు సమయాన్ని ఇస్తారు. అందుకు ఎంతో కృతజ్ఞతలు’ అని షారుక్ అన్నారు. తన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ త్వరలో బిగ్ స్క్రీన్ పైకి మళ్లీ వస్తానని షారుక్ అన్నారు. ‘ఈ అవార్డు మీకోసం, ప్రతి అవార్డు మీకోసమే. నేను నా చేతులను చాపి నా ప్రేమ పంచాలని అనుకుంటున్నా. ప్రస్తుతం కాస్త ఇబ్బంది ఉంది. కానీ ఆందోళన పడకండి. పాప్‌కార్న్ రెడీగా పెట్టుకోండి. త్వరలోనే థియేటర్లలో తెరపై వస్తాను’ అని ఫ్యాన్స్ ను ఉద్దేశించి చెబుతూ షారుక్ తన వీడియో సందేశాన్ని ముగించారు.
View this post on Instagram
Also Read: Minister Komatireddy: టాలీవుడ్‌కు 7 నేషనల్ అవార్డ్స్.. ప్రభుత్వ స్పందన ఇదే!
ఆ నటుడితో అవార్డ్ షేరింగ్
ఇదిలా ఉంటే షారుక్ తో పాటు 12th ఫెయిల్ చిత్ర నటుడు విక్రాంత్ మస్సే సైతం జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. షారుక్ తో కలిసి ఆయన ఈ అవార్డును పంచుకోనున్నారు. ఇదిలాఉంటే షారుక్ నటించిన జవాన్ చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో షారుక్.. ఆర్మీ అధికారి విక్రమ్ రాథోడ్, జైలర్ కుమారుడు ఆజాద్ గా ద్విపాత్రాభినయం చేశారు. కాగా ప్రస్తుతం షారుక్ కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ సమయంలో గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.