R. Krishnaiah: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ అడ్డుపడుతుందన్న కాంగ్రెస్ ఆరోపణలపై రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా స్పందించారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం చేతకాక కోర్టు, బీజేపీపై నెపం వేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీల్లో చేర్చడం సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు.
Also Read: Telangana Cabinet Meeting: బీసీ రిజర్వేషన్ల అమలుపైనా డిస్కషన్..
కాసేపట్లో బీజేపీ మహాధర్నా
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పూర్తిగా వారికే ఇవ్వాలనే డిమాండ్‌తో బీజేపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టనుంది. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేపడుతున్న ఈ ధర్నాకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాల్గొననున్నారు.