Guest Lecturers: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తిస్తున్న గెస్ట్ లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 12 ఏండ్లుగా వారు విధులు కొనసాగిస్తున్నారు. తెలంగాణ(Telangana) వ్యాప్తంగా దాదాపు 1654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. అందులో 1256 స్థానాల్లో రెగ్యులర్ లెక్చరర్లను ప్రభుత్వం భర్తీ చేసింది. గతేడాది మార్చిలో వారికి అపాయింట్ మెంట్ లెటర్లు అందించింది. అయితే రెగ్యులర్ లెక్చరర్ల(Regular lecturers) నియామకంతో గెస్ట్ లెక్చరర్ల(Guest lecturers) భవిష్యత్ అంధకారంలో పడినట్లయింది. వారి స్థానంలో రెగ్యులర్ లెక్చరర్లను ప్రభుత్వం భర్తీ చేసినా 12 ఏండ్లుగా పనిచేసిన నేపథ్యంలో వారి బతుకులను రోడ్డన పడేయకూడదన్న నేపథ్యంలో గెస్ట్ లెక్చరర్లను ఆదుకుంటామని ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. అయితే ఆర్థిక శాఖ మాత్రం దీనికి పలు కొర్రీలు పెడుతుండటంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు
గెస్ట్ లెక్చరర్లుగా ప్రస్తుతం తాము కొనసాగుతున్నా.. 6 నెలల వేతనాలు పెండింగ్ లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత విద్యాసంవత్సరానికి సంబంధించి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వేతనాలు ఇప్పటికీ అందలేదని వారు చెబుతున్నారు. అలాగే 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన జూన్, జూలై వేతనాలు అందించలేదని, దీంతో తమ కుటుంబ పోషణ తీవ్ర భారంగా మారిందని దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. అప్పులు చేసి బతుకీడుస్తున్న పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. తెలంగాణ(Telangana) వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 1654 గెస్ట్ లెక్చరర్లు 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరికి పీరియడ్ విధానంలో వేతనం చెల్లిస్తారు. పీరియడ్ కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 చొప్పున చెల్లించాల్సి ఉంది. కాగా చాలీచాలనీ వేతనలాతో కాలేజీల్లో ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వర్తించినా తమను కష్టాల నుంచి ఎవరూ గట్టెక్కించడంలేదని చెబుతున్నారు.
Also Read: Warangal Traffic Police: అడ్డంగా బుక్కైన బైకర్.. ఏకంగా 120 చలాన్లు..!
గెస్ట్ లెక్చరర్లు ఉపాధి కోల్పోవడంతో
ఇదిలా ఉండగా 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto)లో జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లకు 12 నెలలకు నెలసరి వేతనం అమలు చేస్తూ నెలకు రూ.42 వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని వారు చెబుతున్నారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక మంత్రులు శ్రీధర్ బాబు(Ministers Sridhar Babu), దామోదర రాజనర్సింహ(Min Damodar Rajanarsimha) గెస్ట్ లెక్చరర్ల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రెగ్యులర్ లెక్చరర్ల రాక వల్ల ఎలాంటి అన్యాయం జరగదని, అవసరమైతే అదనంగా పోస్టులు మంజూరు చేసైనా అందరినీ సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ప్రతీ సంవత్సరం మాదిరిగానే గత విద్యాసంవత్సరం సైతం 1654 మంది గెస్ట్ లెక్చరర్లను కంటిన్యూ చేశారని, కానీ 2024-2025 విద్యా సంవత్సరంలో టీజీపీఎస్సీ(TGPSP) డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 1256 రెగ్యులర్ లెక్చరర్లను భర్తీచేసింది. వారి రాకతో గెస్ట్ లెక్చరర్లు ఉపాధి కోల్పోవడంతో వారంతా ప్రభుత్వ పెద్దలను, మంత్రులను కలిసి పలుమార్లు విజ్ఞప్తులు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వ్యవస్థతో పాటే గెస్ట్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
398 పోస్టులకు మాత్రమే అనుమతి
సీఎంవో(CMO) ద్వారా ఇంటర్ బోర్డ్ సెక్రటరీతో పలువురు మంత్రులు మాట్లాడి గెస్ట్ ఫ్యాకల్టీ డిస్టర్బ్ అవ్వకూడదని, 1654 మందిని కంటిన్యూ కోసం ప్రపోజల్స్ పంపాలని బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్యకు సూచించారని తెలిపారు. కాగా ఈ అంశంపై 1654 మందిని ఏవిధంగా సర్దుబాటు చేయాలో అధికారులతో పలుమార్లు రివ్యూ చేసి మరీ ఈ ఏడాది జూన్ 13న తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపినట్లు వారు చెబుతున్నారు.
ఫైల్‌లో 1654 పోస్టుల్లో 583 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారని, 128 క్లియర్ వేకెన్సీలున్సాయని, 140 పోస్టులు ప్రమోషన్లు, పదవీ విరమణల కారణంగా వేకెన్సీ అవ్వనున్నాయని, నూతనంగా మంజూరైన కళాశాలలో 263 పోస్టులకు, స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న కాలేజీలలో 40 మంది ఒక సెక్షన్ గా చేసి గెస్ట్ లెక్చరర్ల సేవలను వినియోగించుకోవడానికి 540 పోస్టులకు అనుమతి ఇవ్వాలని పంపారని చెబుతున్నారు. కాగా ఆ ఫైల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ(Higher Education Secretary) అప్రూవల్ చేసి ఫైనాన్స్ శాఖకు పంపించగా దాదాపు నెల రోజులకు పైగా పెండింగ్‌లో పెట్టారని, తీరా 1654 పోస్టులకు అనుమతి ఇవ్వడం కుదరదని, గతేడాది అనుమతిచ్చిన 1654 పోస్టుల్లో 1256 రెగ్యులర్ లెక్చరర్ల అపాయింట్ మెంట్ల కారణంగా మిగిలిన కేవలం 398 పోస్టులకు మాత్రమే అనుమతినిస్తామని స్పష్టంచేసినట్లు వాపోయారు. దీనిపై జీవో సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Also Read: Journalism: నిజాయితీ జర్నలిజంపై కబ్జాకోరుల కుట్రలు సాగవు
కుటుంబ పోషణ కష్టంగా ఉంది
గెస్ట్ లెక్చరర్లకు ఇవ్వాల్సిన 6 నెలల వేతనాలు త్వరగా విడుదల చేయాలి. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 4 నెలల వేతనాల బడ్జెట్ ఫైల్ డిసెంబర్ లో పంపినప్పటికీ ఇంతవరకు విడుదలవ్వలేదు. దీంతో కుటుంబాల పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వెంటనే పెండింగ్ వేతనాలకు సంబందించిన బడ్జెట్ విడుదల చేసి మాకు న్యాయం చేయాలని, జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్(Damera Prabhakar) తెలిపారు.
1654 గెస్ట్ లెక్చరర్లను కంటిన్యూ చేయాలి
గెస్ట్ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం, మంత్రులు సానుకూలంగా ఉన్నా.. అధికారులు మోకాలడ్డుతున్నారు. ఫైనాన్స్(Finance) అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రభుత్వం తరపున మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం గెస్ట్ లెక్చరర్లందరికీ న్యాయం జరగాలంటే సత్వరమే ఇంటర్ బోర్డ్ కార్యదర్శి పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలి. జీవో విడుదల చేసి గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలని ఆదుకోవాలి. లేదంటే ఆందోళనలు చేపడుతామని జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్(Darla Bhaskar) పేర్కోన్నారు.
Also Read: Minster Vivek: అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెస్తా!