Viral News: సరిగ్గా 19 ఏళ్లక్రితం 2006లో విడుదలై సెన్సెషనల్ హిట్ సాధించిన ‘10వ తరగతి’ (10th Class) మూవీ చూసినవారికి ఒక సీన్ తప్పకుండా గుర్తుండే ఉంటుంది. బైక్ మెకానిక్ షాప్‌లో హెల్పర్‌గా పనిచేసే ఓ బాలుడ్ని.. కూల్‌డ్రింక్ తీసుకురమ్మని రిపేర్ కోసం వచ్చిన ఓ వ్యక్తి పంపిస్తాడు. అయితే, తీసుకొచ్చే దారిలో బాలుడు దాని మూత ఓపెన్ చేసి కాస్త తాగుతాడు. దాంతో డ్రింక్ సీసాలో ఏర్పడిన వెలితిని నింపడానికి ఉమ్మి వేస్తాడు, అంతటితో ఆగకుండా మూత్రం కూడా పోస్తాడు. దాంతో సీసాలో ఉండాల్సిన పరిమాణం కంటే డ్రింక్ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో, తీసుకురమ్మని చెప్పిన వ్యక్తికి అనుమానం వచ్చి, బాలుడిని పిలిచి నువ్వే తాగమని చెబుతాడు. కానీ, బాలుడు తాగడు. మూవీలో ఈ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. కామెడీ కోసం ఈ సీన్ సినిమాలో పెట్టారు. అయితే, నిజజీవితంలో ఇంచుమించుగా ఇదే తరహా ఘటన ఒకటి ఒడిశాలో (Viral News) వెలుగుచూసింది.
అధికారికి మూత్రం ఇచ్చిన ప్యూన్
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ (RWSS) విభాగంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి, వాటర్ బాటిల్ తీసుకురమ్మంటూ కిందిస్థాయి ఉద్యోగికి (peon) చెప్పగా.. అతడు వెళ్లి మంచినీళ్లలో మూత్రం కలిసిన బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. సిబా నారాయణ నాయక్ అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డాడు. బాధిత వ్యక్తి సచిన్ గౌడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తనకు ఎదురైన పరిస్థితిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆర్.ఉదయగిరి పోలీసులు వెళ్లి నిందితుడు నారాయణ నాయక్‌ను అరెస్ట్ చేశారు.
ఈ ఘటన జులై 23న రాత్రి ఓవర్ టైమ్ పనిచేస్తున్న సమయంలో జరిగింది. తాగునీరు ఇవ్వాలంటూ తాను కోరానని, అయితే, రాత్రి సమయం కావడంతో తక్కువ వెలుతురు ఉందని, పనిభారం కారణంగా అలసట గురైన తాను గమనించకుండానే మూత్రంతో ఉన్న బాటిల్‌లోని నీళ్లు తాగేశానని సచిన్ గౌడ ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిలో మూత్రం ఉందన్న విషయం తర్వాత తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నారాయణ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణను జరుపుతున్నారు.
Read Also- US Tariffs: ట్రంప్ టారిఫ్‌పై విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు
ఆ బాటిల్‌లోని నీళ్లు తాగిన కొద్దిసేపటికే తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యానని, చికిత్స కోసం బెరంపూర్‌లోని ఎంకేఎంజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి తరలించాల్సి వచ్చిందని బాధిత వ్యక్తి సచిన్ గౌడ వాపోయారు. నీరు తీవ్రంగా కలుషితమైందని నిర్ధారణకు వచ్చిన వైద్యులు, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా… ఆ నీటిలో అమోనియా స్థాయి అధికంగా ఉన్నట్టు బయటపడింది. నీరు తీవ్రంగా కలుషితమైనట్టు తేలడంతో సచిన్ గౌడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు మరికొందరు ఇతర ఉద్యోగులు కూడా ఇవే తరహా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. తన సహాద్యోలు ఇద్దరు అదే నీరు తాగారని, వారు కూడా రుచి, నాణ్యతపై అనుమానం వ్యక్తం చేశారని ప్రస్తావించారు. నిందితుడు నారాయణ నాయక్ ఈ చర్యకు పాల్పడడానికి గల కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేసి.. దర్యాప్తు మొదలుపెట్టారు.
ఉన్నతాధికారులపై కేవలం చీదరింపు చర్యగా ఈ పనికి పాల్పడ్డాడా? లేక ఇంకేదైనా ద్వేషం లేదా కుట్ర ఉందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజా సేవకు సంబంధించిన కార్యాలయాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం దారుణమని అంటున్నారు.
Read also- Supreme Court: అంత సున్నితత్వం ఎందుకు?.. బీజేపీ నేతపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు