Lung Cancer: ధూమపానం చేసేవారికి మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) వస్తుందని గతంలో ఎక్కువగా భావించేవారు. కానీ, ఇటీవల స్మోకింగ్ చేయని వ్యక్తులు, మహిళలు, ధూమపానంతో ప్రత్యక్ష సంబంధం లేనివారిలో కూడా లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. స్కోకింగ్ అలవాటు లేని చాలామంది తమను తాము ‘క్యాన్సర్ రిస్క్ తక్కువ’ అని భావిస్తుంటారు. కానీ, లంగ్స్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యాక ఆశ్చర్యపోతుంటారు. ఆగస్టు 1న వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే (World Lung Cancer Day) సందర్భంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. క్యాన్సర్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ పత్రికలో ప్రచురితమైన తాజా అధ్యయనాల ప్రకారం, లంగ్ క్యాన్సర్ చాలా సంక్లిష్టమైన సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు ఏంటి?
ఉపరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశల్లో కనిపించదు. ఎందుకంటే, తొలుత కనిపించే లక్షణాలు సాధారణ శ్వాస సంబంధిత సమస్యల మాదిరిగా అనిపిస్తాయి. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడానికి కారణం ఇదేనని వైద్య నిపుణుల చెబుతున్నారు. జస్లోక్ ఆసుపత్రిలో సర్జికల్ అంకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సతీష్ ఆర్.రావు.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను సూచించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు వెల్లడించారు. నిరంతరాయంగా దగ్గు వస్తుందని చెప్పారు. ధూమపానం చేసే వారిలో ఈ లక్షణం సాధారణంగా కనిపిస్తుంది. పొడి దగ్గు, ఇరిటేషన్(చిరాకు) కలిగిస్తుంది. లంగ్ క్యాన్సర్ ఆరంభ దశల్లో ఈ లక్షణం ప్రధానంగా కనిపిస్తుంది. దగ్గినప్పుడు వచ్చే శ్లేష్మంలో రక్తం కనిపించడం లంగ్స్ క్యాన్స్‌కు తీవ్రమైన సంకేతమని, వెంటనే వైద్య సలహా తీసుకోవాలని డాక్టర్ సతీష్ రావు సూచించారు. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం కూడా ఒక లక్షణమని చెప్పారు. ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండానే బరువు తగ్గితే అది లోపల ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని, దానిని నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు. తినడంపై ఆసక్తి తగ్గిపోవడం, అలసట రావడం కూడా లక్షణాలేనని అన్నారు. ఇలాంటి లక్షణాలు స్థిరంగా కనిపిస్తున్నా లేదా ఎక్కువగా బాధపెడుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు సూచన కావచ్చని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజెనింగ్’ సూచిస్తోంది.
Read Also- Supreme Court: అంత సున్నితత్వం ఎందుకు?.. బీజేపీ నేతపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు
ధూమపానం కాకుండా క్యాన్సర్‌కు ఇతర కారణాలేంటి?
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం ఒక్కటే కారణం కాదని, అనేక ఇతర ప్రమాదకర కారణాలు కూడా ఉన్నాయని ‘జర్నల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ సెంటర్’ తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం చేయకపోయినప్పటికీ, అలాంటివారి పక్కన ఉండి పొగను పీల్చుకునేవారు (ఇండోర్, పబ్లిక్ ప్రదేశాలు) కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు లోనవుతారు. గాలిలో కాలుష్యం కూడా ఇందుకు దారితీస్తుంది. పీఎం2.5 మైక్రోపార్టికల్స్, వాహనాల పొగలు, నిర్మాణాలకు సంబంధించిన ధూళి వంటివి ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీసి క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి. ఇలాంటి కేసులు ఎక్కువగా పట్టణాల్లో నమోదవుతుంటాయి.
Read Also- Rahul Gandhi: రిటైర్ అయినా వదిలిపెట్టను.. ఈసీ అధికారులకు రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరిక
వృత్తి సంబంధిత కారణాలు అంటే, రసాయనాలు, పరిశ్రమలు, పొగలు, సూక్ష్మ ధూళి వంటి పదార్థాల మధ్య ప్రతిరోజూ ఎక్కువ సమయం గడిపే ఉద్యోగాలు చేసేవారికి కూడా లంగ్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. ఇల్లు, నివాసాల్లోని కొన్ని వినియోగ వస్తువులు కూడా ఇందుకు కారణం కావొచ్చు. కొన్ని హెయిర్ డైలు, ఏరోసాల్స్, క్లీనింగ్ ఏజెంట్లు వంటి వస్తువుల్లో ఉంటే రసాయనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారకమయ్యే ప్రమాదం ఉంటుంది. మరో కారణం ఏంటంటే, శరీరంలో రోగనిరోధక శక్తి స్తబ్తుగా ఉంటే పరిస్థితుల్లో కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అంటే, అనియంత్రిత డయాబెటిస్, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వంటి వ్యాధులు శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిసామర్థ్యాలను తగ్గించేస్తాయి.
కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ చరిత్ర ఉంటే, ఇతరుల్లో ఇంకెవరికైనా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే, లంగ్ క్యాన్సర్‌ను తేలికగా తీసుకోకుండా జీవనశైలిలో తగిన మార్పులు చేసుకొని, కాలుష్య పరిసరాలను తగ్గించుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.