Supreme Court: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ 2018లో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ‘శివలింగంపై తేలు’ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నమోదైన పరువునష్టం కేసుపై సుప్రీంకోర్టులో (Supreme Court) ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది. ఈ కేసును త్వరగా ముగించాలంటూ సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. ఈ కేసుపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్‌కే. సింగ్ల బెంచ్ విచారణ జరిపింది. శశి థరూర్ తరఫు వాదించిన లాయర్.. విచారణ వాయిదా కోరారు. పరువునష్టం దావా వేసిన బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తరఫున వాదించిన న్యాయవాది ప్రాముఖ్యత కేసుగా పరిగణించి ప్రత్యేక రోజుల్లో (సోమవారం, శుక్రవారం) విచారణ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో, జస్టిస్ సుందరేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘‘ ఏంటీ.. ఈ కేసును ప్రత్యేక రోజుల్లో విచారించాలా?. ఈ వ్యవహారాన్ని ముగించేద్దాం. ఇలాంటి విషయాల్లో మీరు ఎందుకంత సున్నితంగా (touchy) ఉంటారు?. ఇలాంటివన్నీ హుందాగా ముగించేద్దాం. పాలకులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తులు కూడా ఇదే జాబితాలోకి వస్తారు. వీళ్లంతా బలమైన మనోధైర్యం ఉన్నవారే. కాబట్టి, ఆందోళన అవసరం లేదు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జడ్జి సూచనపై స్పందించిన సీనియర్ అడ్వొకేట్ పింకీ ఆనంద్ ..‘ఈ వ్యవహారాన్ని ఏదో ఒక న్యాయస్థానం తప్పకుండా విచారించాలని అన్నారు. సమ్మతించిన సుప్రీం కోర్టు, ఈ అంశంపై విచారణను మరో రోజుకు వాయిదా వేసింది. గతేడాది జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Read Also- Rahul Gandhi: రిటైర్ అయినా వదిలిపెట్టను.. ఈసీ అధికారులకు రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరిక
కాగా, తనపై నమోదైన పరువునష్టం కేసుపై 2023 సెప్టెంబర్ 10న శశి థరూర్ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో శశిథరూర్ పిటిషన్ వేయగా న్యాయస్థానం తిరస్కరించింది. తన పిటిషన్‌ను కొట్టివేయాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అప్పీల్ చేశారు. దీంతో, ఢిల్లీ ట్రయల్ కోర్టులో పరువు నష్టం కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఢిల్లీ పోలీసులకు, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న బీజేపీ నేత రాజీవ్ బబ్బర్‌కు నోటీసులు జారీ చేసి అభిప్రాయాలు కోరింది. అప్పటినుంచి ఈ కేసుపై విచారణ తాత్కాలిక వాయిదా కొనసాగుతుంది. ఈ కేసును కొట్టివేయాలన్న అంశంపై నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది. తాజాగా కూడా సుప్రీంకోర్టు మరో రోజుకు వాయిదా వేసింది. తదుపరి ఏ రోజున విచారణ చేయబోతున్నది చెప్పలేదు.
Read Also- Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల
కేసు నేపథ్యం ఇదే
‘‘ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఓ అనామక వ్యక్తి, ప్రధాని మోదీని శివలింగంపై కూర్చున్న తేలుగా అభివర్ణించారు’’ అంటూ 2018లో ఎంపీ శశిథరూర్ అన్నారు. అయితే, థరూర్ వ్యాఖ్యలు మతసంబంధమైన భావోద్వేగాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ బీజేపీకి చెందిన రాజీవ్ బబ్బర్ అనే నేత క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును ట్రయల్ కోర్టులో (ఢిల్లీ హైకోర్టు) దాఖలు చేశారు. స్పందించాలంటూ శశిథరూర్‌కు న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది. అయితే, 2019 ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు తనకు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజీవ్ బబ్బర్ దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదును కూడా కొట్టివేయాలని అభ్యర్థించారు. ‘‘శివలింగంపై తేలు వ్యాఖ్యలు నేను చేసినవి కావు, ఒక ఆర్ఎస్ఎస్ నేత చెప్పినవి’’ అని వాదించారు. అయితే, ఆ వ్యాఖ్యల స్వభావం, రాజకీయ భావవ్యక్తీకరణ అనే కోణాలు కేసులో కీలకాంశాలుగా మారాయి.