Rahul Gandhi: బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃపరిశీలన కోసం ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్‌పై (SIR) దుమారం కొనసాగుతోంది. ఈ ప్రక్రియను విపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి లబ్ది చేకూర్చేలా భారీ స్థాయిలో జరుగుతున్న ‘ఓట్ల దొంగతనం’లో భారత ఎన్నికల సంఘం (ECI) ప్రమేయం ఉందని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై విపక్షాల స్వతంత్ర దర్యాప్తులో ఈ విషయం తేలిందని ఆయన ఆరోపించారు.
‘‘ఓట్ల దొంగతనంలో ఎన్నికల సంఘం పాలుపంచుకున్నట్టు మావద్ద సుస్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓట్ల దొంగతనం వ్యవహారంలో పై నుంచి కింద స్థాయి వరకు ఉన్న ఈసీ అధికారులు ఎవర్నీ వదిలిపెట్టబోం’’ అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు పార్లమెంట్ వెలుపల శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, ప్రత్యేకంగా ఏ అధికారి పేరునూ ఆయన ప్రస్తావించలేదు. ఎన్నికల సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు గమనించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మీరు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది దేశద్రోహమే. అలాంటి అధికారులు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం. రిటైర్ అయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టబోం’’ అని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also- Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఈసీఐపై సంచలన ఆరోపణలు
పార్లమెంట్‌లో బీహార్ సర్ (SIR) అంశంపై ఇండియా కూటమి తీవ్ర ఆందోళనలు జరుపుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘంపై (ECI) రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. విపక్షాలు ఇటీవలే స్వతంత్రంగా దర్యాప్తు జరిపాయని, ఓటర్ల జాబితా మార్చివేసి మోసానికి పాల్పడ్డట్టు పక్కా ఆధారాలు లభించాయని చెప్పారు. ‘‘మధ్యప్రదేశ్, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే మాకు అనుమానాలు మొదలయ్యాయి. కానీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కసారిగా చివరి ఓటర్ల జాబితాలో కోటి మంది కొత్త ఓటర్లు చేరడం చూశాక ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. అప్పుడే మాకు అర్థమైంది. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోదు. అందుకే, మేం స్వతంత్రంగా ఆరు నెలల పాటు దర్యాప్తు చేపట్టాం. ఆ దర్యాప్తులో అణుబాంబుతో సమానమైన సత్యం బయటపడింది. అది పేలిన తర్వాత ఎన్నికల సంఘం (అధికారులు) దాక్కోవడానికి చోటు ఉండదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also- Rahul Gandhi: Lungs Harmful Habits: ఈ 6 అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీ ఊరిపితిత్తులు ఢమాలే!
అధికారులకు తీవ్ర హెచ్చరిక
ఈసీపై సంచలన ఆరోపణలు చేసిన తర్వాత, ఎన్నికల కమిషన్ అధికారులపై రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓట్ల దొంగతనంలో భాగస్వాములైన ఈసీలోని పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు ఎవరూ తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఎన్నికల సంఘానికి సంబంధించిన ఎవరు ఈ పనిలో పాల్గొన్నా వదిలిపెట్టం. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది దేశద్రోహానికి తక్కువేం కాదు. మీరు ఎక్కడ ఉన్నా, రిటైర్ అయినా సరే మిమ్మల్ని వెతికిపట్టుకుంటాం’’ అని రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇప్పటివరకు స్పందించలేదు.