Uttarakhand Tragedy: దేశంలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏడాది వయసు ఉన్న చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. డీహైడ్రేషన్ కు గురైన చిన్నారిని నాలుగు జిల్లాల్లోని ఐదు ఆస్పత్రికి వరుసగా తరలించడంతో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి తండ్రి ఆర్మీ జవాను కాగా.. ప్రస్తుతం అతడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్ సీఎం విచారణకు ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్తే..
ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న దినేష్ చంద్ర జోషి (Dinesh Chandra Joshi) కుమారుడు.. శివాంశ్ జోషి (Shivansh Joshi) జూలై 10న తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. శివాంశ్‌కు వాంతులు ఆగకపోవడం, పాలు తాగలేకపోవడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనబడటంతో తల్లి అతడిని చమోలీ జిల్లా గ్వాల్డాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది.. పిల్లల డాక్టర్, తగిన సదుపాయాలు లేవని చెప్పి.. 22 కిమీ దూరంలో ఉన్న బాగేశ్వర్ జిల్లాలోని బైజ్‌నాథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కు రిఫర్ చేశారు.
‘వైద్యులు నిర్లక్ష్యం చేశారు’
బైజ్‌నాథ్ CHCలో చికిత్స అందించినప్పటికీ బాబు పరిస్థితి విషమించడంతో 20 కిమీ దూరంలోని బాగేశ్వర్ జిల్లా ఆసుపత్రికి అక్కడి వైద్యులు మళ్లీ రిఫర్ చేశారు. జిల్లా ఆస్పత్రికి హుటాహుటీన చిన్నారిని తీసుకెళ్లగా.. అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని చిన్నారి తండ్రి జోషి ఆరోపించారు. ‘డాక్టర్ గానీ సిబ్బంది గానీ మర్యాదగా మాట్లాడలేదు. ఎమర్జెన్సీ సమయంలో కూడా నా 14 నెలల కుమారుడిని సరిగా పరీక్షించకుండా నేరుగా అల్మోరాకు రిఫర్ చేశారు’ అని జోషి తెలియజేశారు. చిన్నారి మెదడులో రక్త ప్రసరణ సమస్యలు తలెత్తడంతో పీడియాట్రిక్ ఐసీయూ సదుపాయం లేదని చెప్పి అల్మోరాలోని హయ్యర్ సెంటర్‌కి రిఫర్ చేశారని జోషి వివరించారు.
అంబులెన్స్ రాకలోనూ జాప్యం
చిన్నారి తల్లి మాట్లాడుతూ ‘సాయంత్రం 7 గంటలకు అంబులెన్స్ కోసం ఫోన్ చేశాను. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో జిల్లా మేజిస్ట్రేట్‌కి ఫోన్ చేసి సహాయం కోరాను. 2 గంటల 30 నిమిషాల తర్వాత వాహనం వచ్చింది. ఆ సమయంలో నా భర్త జమ్మూ కాశ్మీర్‌లో విధుల్లో ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను. అంబులెన్స్ రాలేదని డాక్టర్‌కి చెప్పినా సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు’ అన్నారు.
పదే పదే తిప్పడం వల్లే..
రాత్రి 9:30కి అంబులెన్స్ రావడంతో అల్మోరా మెడికల్ కాలేజ్‌కు (నాలుగో ఆసుపత్రి) చిన్నారిని తరలించారు. అక్కడ చికిత్స చేసి మళ్లీ నైనిటాల్ జిల్లా హల్ద్వానిలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. జూలై 12న హల్ద్వానిలో డాక్టర్లు చిన్నారిని వెంటిలేటర్‌పై పెట్టారు. అయితే నాలుగు రోజుల తర్వాత జూలై 16న చిన్నారిని మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఎమర్జెన్సీ సమయంలో పదే పదే ఆస్పత్రులకు తిప్పడం వల్ల తమ బిడ్డ దూరమైనట్లు కన్నతండ్రి జోషి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Lungs Harmful Habits: ఈ 6 అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీ ఊరిపితిత్తులు ఢమాలే!
రంగంలోకి సీఎం.. కీలక ఆదేశం!
‘నా ఒక సంవత్సరం వయసున్న కొడుకును కోల్పోయాను. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని ప్రార్థిస్తున్నాను. గ్వాల్డాం నుంచి బైజ్‌నాథ్, బాగేశ్వర్ తీసుకెళ్లే వరకు నా కుమారుడు బతికే ఉన్నాడు’ అని తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు. ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami).. చిన్నారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. వైద్య సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. వారిపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. దర్యాప్తు ఆధారంగా చర్యలు ఉంటాయని సీఎం వివరించారు.