Bhadradri kothagudem( Image Credit: free pic or twitter)
నార్త్ తెలంగాణ

Bhadradri kothagudem: అధిక వడ్డీలు.. పరువు పోయే స్థాయిలో బెదిరింపులు

Bhadradri kothagudem: పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైక్రో ఫైనాన్స్ (Micro Finance)సంస్థలు చాపకింద నీరులా విస్తరించి, పేద, దిగువ మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా పీడిస్తున్నాయి. సింగరేణి, నవభారత్, ఐటీసీ, భద్రాద్రి పవర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలతో పాటు అనుబంధ సంస్థలు, ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న ఈ జిల్లాలో వేలాది మంది మహిళలు పనులకు వెళ్తుంటారు. ఈ ప్రాంతంలోని పేదరికమే మైక్రో ఫైనాన్స్(Micro Finance) సంస్థలకు లాభాల మార్గంగా మారింది. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం కేంద్రాలలో ఈ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని, పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నాయి. సుమారు రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లకు పైగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పులు పంపిణీ చేసినట్లు అంచనా. ఈ సంస్థల ప్రతినిధులు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో డబ్బు వసూలు చేస్తూ, బాధితులను బెదిరిస్తూ కనిపిస్తుంటారు.

 Also Read: Bhadradri Kothagudem district: యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. వారే మెయిన్ విలన్?

సంఘాలు ఏర్పాటు చేసి అప్పులు..
సాధారణంగా మహిళా సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అయితే, మైక్రో ఫైనాన్స్ సంస్థలు పురుషులు, వారి పిల్లలను సైతం ష్యూరిటీలుగా పెట్టుకుని రూ. 50 వేల వరకు ఒక్కొక్కరికి గ్రూపులుగా అప్పులు ఇస్తున్నాయి. గ్రామాల్లో డబ్బులు అవసరమున్నవారిని గుర్తించి, ఐదుగురు, ఏడుగురు లేదా పదిమందితో ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. సంఘానికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయి. సంస్థ ప్రతినిధులు వారం, 15 రోజులు లేదా నెలవారీగా చెల్లించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

ఈ విధంగా పది వారాల పాటు రికవరీ ఏజెంట్లు ఇళ్ల వద్దకు వచ్చి డబ్బులు వసూలు చేసుకుని వెళ్తారు. గ్రూపులో ఏ ఒక్కరు వాయిదా ఆలస్యం చేసినా, మిగిలిన వారిని బాధ్యులను చేసి వారి నుంచి సొమ్ము వసూలు చేస్తారు. ఒక వారం వాయిదా ఆలస్యమైతే చక్రవడ్డీతో వసూలు చేస్తుండటం గమనార్హం. ఏ ఒక్కరు కట్టకపోయినా గంటల కొద్దీ మహిళను అక్కడే కూర్చోబెట్టి వేధిస్తారు. ఒకరు చెల్లించకపోయినా మిగిలిన వారు అందరూ కలిసి కట్టాల్సిందేననే నిబంధన అమలు చేస్తున్నారు. మహిళా సంఘాల గ్రూపులకు కూడా ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.

పేదలే టార్గెట్‌..
మైక్రో ఫైనాన్స్(Micro Finance) సంస్థలు ప్రధానంగా పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వారి నుంచి రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలను తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. బ్యాంకుల్లో రుణాలు పొందాలంటే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్, సిబిల్ స్కోర్, నెల వేతనం, సొంత ఇల్లు లేదా ష్యూరిటీ, ఐటీ రిటర్న్స్‌, లేదా గ్రూప్ సభ్యుల ష్యూరిటీ వంటి అనేక నిబంధనలు ఉంటాయి. అయితే మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఎలాంటి పూచీకత్తు లేకుండా కేవలం ధ్రువపత్రాలను తీసుకొని రుణాలు ఇస్తున్నాయి. దీంతో పేదలు వాటిని ఆశ్రయించి అధిక వడ్డీలకు బలవుతున్నారు. తీసుకున్న తర్వాత నానా అవస్థలు పడుతున్నారు.

చిరు వ్యాపారులే లక్ష్యం..
జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీ కేంద్రాలలో టీ కొట్టు దుకాణాలు, కిరాణా దుకాణాలు, కూరగాయలు, చికెన్ సెంటర్ల నిర్వాహకులే లక్ష్యంగా ఈ సంస్థలు అధిక వడ్డీలకు రుణాలు ఇస్తాయి. వాటి ప్రతినిధులు రోజువారీ, లేక వారం వారం వాయిదాల పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తారు. ఫైనాన్స్ సంస్థలు డబ్బు వసూలు కోసం నిరుద్యోగులైన యువకులను తక్కువ వేతనాలకే రికవరీ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. ఈ యువకులు అప్పు తీసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వసూలు చేసుకుని సంస్థల్లో చెల్లిస్తుంటారు. అప్పులు చెల్లించడం ఏ మాత్రం ఆలస్యమైనా ఈ రికవరీ ఏజెంట్లు చేసే అఘాయిత్యాలు అన్ని ఇన్నీకావు. అప్పు తీసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరువు తీయడం, మానసికంగా వేధించడం వంటివి చేస్తున్నారు.

కొంతమంది వీరి ఆగడాలు భరించలేక గ్రామాలు వదిలి వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు ప్రైవేటు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి అనధికారికంగా ఫైనాన్స్ సంస్థలు నడుపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా అధిక వడ్డీలకు అప్పులిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. అప్పులు తీసుకున్న వారితో ప్రామిసరీ నోట్లు, చెక్కులు రాయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆస్తుల ఒరిజినల్ పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అప్పులు చెల్లించకపోతే వడ్డీలకు వడ్డీలు వేసి వారి ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది. గతంలో ఒక సంస్థ ఇలాగే కొనసాగితే ఐకేపీ అధికారులు వారితో వాదోపవాదాలు చేసి, హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. గతంలో ఒకటి రెండు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉండగా, ఇప్పుడు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చాయి.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..
ఏజెన్సీ ప్రాంతాలలో మైక్రో ఫైనాన్స్‌లకు అనుమతులు ఉంటాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఉన్నతాధికారులు వీరికి ఎటువంటి అనుమతులున్నాయి, ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు, ఈ ఫైనాన్స్ ఆగడాలు ఎందుకు జరుగుతున్నాయి అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంస్థల ఆగడాలను అరికట్టి, పేద కుటుంబాలు వీధిన పడకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read:Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!

Just In

01

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే