Ayurvedic Tips: వర్షాకాలంలో జీర్ణక్రియకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. జీర్ణ వ్యవస్థ మందగించడం వల్ల చాలా మందిలో బద్దకం, ఉబ్బరం, అజీర్తి, శరీరంలో అలసట, శక్తి లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వర్షాకాలంలో సరైన ఆహారం, తినే పద్ధతులు పాటించడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, వాతావరణం ఎంత మారినా ఆరోగ్య సమతుల్యం కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
ఆయుషక్తి సహ వ్యవస్థాపకురాలు డా. స్మితా నారం ప్రకారం.. ‘వర్షాకాలంలో మన అగ్ని (జీర్ణాగ్ని) సహజంగానే మందగిస్తుంది. దాంతో జీర్ణక్రియ మందగించి ఆరోగ్యంపై, రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ మందగించడంతో విషపదార్థాలు శరీరంలో పెరిగిపోతాయి. దీని వల్ల శక్తి తగ్గిపోవడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది’ అని ఆమె చెప్పారు. అయితే ఆయుర్వేదం సూచించిన 5 ముఖ్యమైన చిట్కాలను వర్షాకాలంలో అలవాటుగా చేసుకోగలిగితే జీర్ణ క్రియ సమస్యలను నివారించవచ్చని ఆమె తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. కషాయం (Kadha)
రోజును కడుపుకు మేలు చేసే డిటాక్స్ హర్బల్ టీతో ప్రారంభించడం మంచిది. జీలకర్ర, అల్లం, తులసి లేదా పుదీనాతో చేసిన వేడి కషాయం జీర్ణక్రియను బలపరుస్తుంది. ఇది శరీరంలోని విషాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2. సీసీఎఫ్ టీ (Cumin, Coriander, Fennel Tea)
జీలకర్ర, ధనియాలు, సోంపు.. ఒక్కోటి 1 టీ స్పూన్ తీసుకుని వేడి నీటిలో మరిగించి తాగాలి. ఇది శరీరంలోని వాపును తగ్గించి జీర్ణక్రియను సాంత్వనపరుస్తుంది. ఉదయం తాగితే జీర్ణాగ్ని మళ్లీ చురుకుగా మారి పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. అల్లం ముక్క కలిపితే డిటాక్స్ ప్రభావం పెరుగుతుంది.
3. తేలికపాటి ఆహారం
❄️ అల్పాహారం: ఉదయం అల్పాహారంలో భాగంగా పప్పు చిల్లా లేదా వెజిటేబుల్ సూప్ వంటివి తీసుకోవాలి.
❄️ మధ్యాహ్నం/ రాత్రి భోజనం: మాన్సూన్‌లో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం రాత్రివేళల్లోనూ తేలికైన ఆహారం తీసుకోవాలి. పప్పు ఖిచ్డీ (ముంగ్ దాల్) + నెయ్యి + ఉడికించిన కూరగాయలు (బీరకాయ, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, సొరకాయ మొదలైనవి) ఆహారంలో భాగం చేసుకోవాలి. అవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.
4. మానుకోవాల్సిన ఆహారాలు
❄️ పులియబెట్టిన ఆహారం: ఇడ్లీ, దోస, పెరుగు, టమోటా, చింతపండు వంటివి కడుపులో ఆమ్లత్వం (acidity) పెంచి ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను కలిగిస్తాయి.
❄️ చల్లని / ప్రాసెస్‌డ్ ఫుడ్స్: చల్లని పదార్థాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, వేయించిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం.. వర్షాకాలంలో అస్సలు తీసుకోవద్దు. ఇవి వాత, కఫ దోషాలను పెంచి జీర్ణక్రియను మరింత బలహీనపరుస్తాయి. చర్మానికి కూడా ఇబ్బందులు కలిగిస్తాయి.
Also Read: Ind vs Pak WCL 2025: పాక్‌తో సెమీస్ బాయ్‌కాట్.. ఫైనల్‌కు వచ్చినా ఇదే చేసేవాళ్లం.. భారత జట్టు!
5. 7 రోజుల ఇన్‌టెన్షనల్ ఈటింగ్ ప్లాన్
ఒక ఏడు రోజులపాటు ఆకలిగా ఉన్నప్పుడే తినడం, హర్బల్ టీలు తాగడం, ఉడికించిన కూరగాయలు, ముంగ్ సూప్ తీసుకోవడం చేయాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, జీర్ణ వ్యవస్థను గాడిలో పెడుతుంది. దీనిని ఉపవాసంగా భావించాల్సిన పని లేదు. దీనిని శరీరాన్ని శుద్ది చేసే విధానంగా ఆయుర్వేదం చెబుతోంది.
Also Read This: AP Google Data Center: గూగుల్ నుంచి గుడ్ న్యూస్.. ఇక ఏపీ ప్రజల పంట పండినట్లే!
గమనిక: ఈ సమాచారం మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.