AP Google Data Center: ఏపీలోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చేందుకు కృషి చేస్తుంది. టెక్ పరిశ్రమలకు కావాల్సిన సౌఖర్యాలు, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వారి నుంచి భారీ మెుత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల నుంచి ఏకంగా 7.9 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ పెట్టుబడులను సాధించింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.15,941.33 కోట్లు కావడం విశేషం.
ఏ కంపెనీ ఎంతంటే?
టెక్ దిగ్గజం గూగుల్.. విశాఖపట్నంలో ‘1 గిగావాట్ డేటా సెంటర్’ ఏర్పాటు కోసం 6 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది. ఇందులో 2 బిలియన్ డాలర్లు పునరుత్పత్తి శక్తి అభివృద్ధికి కేటాయించనుంది. పరిమాణం, పెట్టుబడి పరంగా ఈ ప్రాజెక్ట్ ఆసియాలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఇకపోతే రాష్ట్ర మంత్రివర్గం సైఫీ కంపెనీ 550 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 1.9 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది.
జీసీసీ పాలసీ ప్రకారం సబ్సిడీలు
గూగుల్, సెఫీ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి పనులు.. రాష్ట్ర ఐటీ & గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) పాలసీ 4.0 (2024–2029) కింద జరగనున్నాయి. ఈ పాలసీలో పెట్టుబడిదారులకు రాజధాని సబ్సిడీలు, అద్దె మద్దతు, పెద్ద స్థాయి టెక్నాలజీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్యాకేజీలు వంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది.
డిజిటల్ గేట్‌వేగా విశాఖ
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఇటీవల మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 1.6 గిగావాట్ల డేటా సెంటర్ కమిట్‌మెంట్లను సాధించిందని ప్రకటించారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో 6 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయమని తెలిపారు. విశాఖపట్నం (Visakhapatnam)లో మూడు కొత్త అండర్‌సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా విశాఖపట్నం.. అమెరికా తర్వాత భారత్, ఆగ్నేయాసియాకు ప్రధాన డిజిటల్ గేట్‌వేగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
Also Read: India On US Tariff: ట్రంప్ టారిఫ్ లొల్లి.. దీటుగా బదులిస్తూ కేంద్రం సంచలన ప్రకటన!
ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు!
విశాఖలో గూగుల్ చేపట్టబోయే ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. దాని ప్రధాన ప్రత్యేకత సస్టైనబిలిటీ. దీనికి అవసరమైన విద్యుత్‌లో గణనీయమైన భాగం గ్రీన్ ఎనర్జీ (Green Energy) వనరుల నుండే రానుంది. రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాల్లో 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది తోడ్పాటు అందించనుంది. ఇక గూగుల్, సిఫీ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు.. టెక్నాలజీ, ఆపరేషన్స్, సపోర్ట్ సర్వీసెస్ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. ఈ ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ‘ఫ్యూచర్ స్కిల్స్ క్రెడిట్ స్కీమ్’ వంటి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది.