kamalapur mro madhavi caught red handed while receiving bribe పైసలివ్వందే, ఫైలు కదలదు.. లంచం తీసుకుంటూ ఎమ్మార్వో అడ్డంగా!
kamalapur mro madhavi
క్రైమ్

MRO : పైసలివ్వందే, ఫైలు కదలదు.. లంచం తీసుకుంటూ ఎమ్మార్వో అడ్డంగా!

MRO Madhavi: పైసలివ్వందే.. ఫైలు కదలదు.. అన్న చందంగానే ఇంకా కొన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో పరిస్థితులున్నాయి. లంచం రుచి మరిగిన కొందరు అధికారులు నోటికి ఎంత వస్తే అంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పని చిన్నదైనా, పెద్దదైనా ఆమ్యామ్యాలు అందనిదే ముందుకు సాగదు. లేదంటే రేపు రాపో మాపు రాపో అనే సాకులే వినిపిస్తాయి. దొరికే వరకు మనమే రాజులం అన్నట్టుగా అవినీతి అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మారినా, ప్రజా పాలన వచ్చినా తమ తీరు మాత్రం మారదని కరాఖండిగా తమ నడవడికతో చెప్పకనే చెప్పుతున్నారు. కమలాపూర్ తహశీల్దార్ మాధవి వ్యవహారం సరిగ్గా ఇలాగే ఉన్నది. సామాన్య రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఆమె అడ్డంగా బుక్కయ్యారు. అంతేకాదు, ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియోను స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పంపడం, ఆ తర్వాత లీక్ చేయడం వ్యవహారంలో ఈమెనే కీలకంగా ఉన్నట్టు మంత్రి సీరియస్ అయ్యారు. ఎమ్మార్వో మాధవిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు కూడా.

కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ మూడెకరాలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 9న ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాడు. తన అభ్యర్థన ఆలకించకుండా కనీసం ఫైల్ కూడా చూడకుండానే తహశీల్దార్ మాధవి వారిని వెనక్కి పంపించేశారు. విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 30 వేలు డిమాండ్ చేశారు. 18న మరోసారి ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లగా ఆ పని జరగాలంటే రూ. 6000 లంచం కావాలని డిమాండ్ చేశారు. అందులో రూ. 5000 ఎమ్మార్వోకు రూ. 1000 ధరణి ఆపరేటర్‌కు అని వాటాలు కూడా వేసుకున్నారు.

లంచం ఇవ్వలేని బాధితుడు గోపాల్ వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తన నిస్సహాయతను వివరించాడు. ఆ తర్వాత ఏసీబీ సూచనల మేరకు గోపాల్ నడుచుకున్నాడు. మే 20వ తేదీన మళ్లీ గోపాల్ ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాడు. రూ. 4000 ఎమ్మార్వోకు రూ. 1000 ధరణి ఆపరేటర్ రాకేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు.

రైతుకు సన్మానం

ఎమ్మార్వో లంచం డిమాండ్ చేయగానే తెలివిగా వ్యవహరించిన రైతు గోపాల్‌ను తోటి రైతులు సన్మానిస్తున్నారు. ఎమ్మార్వో ఆఫీసులో లంచాలు మెక్కుతున్నారని, మరికొన్ని అవినీతి చేపలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇందులో తహశీల్దార్ మాధవిని ఏసీబీకి పట్టించినందుకు సంతోషంగా ఉన్నదని రైతులు అన్నారు. ధైర్యంగా ఈ పని చేసిన గోపాల్‌ను సన్మానించారు.

పొన్నం ఆడియో లీక్

ఎమ్మార్వో మాధవి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన అధికారి అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియో లీక్ కావడం అనుమానాలకు తావిచ్చింది. కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీకి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, స్థానిక అధికారి లేదా సర్పంచ్ ద్వారా లబ్దిదారులకు చెక్‌లు అందజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆమె తెలివిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాల్‌ను రికార్డ్ చేసింది. ఆ రికార్డింగ్‌ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పంపించినట్టు మంత్రి పొన్నం ఆరోపించారు. ఒక మంత్రి ఫోన్ కాల్ రికార్డు చేయడంపై మండిపడ్డారు. సీఎస్ శాంతికుమారి ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్