Kavitha: బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ రంగల్లోనూ 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఆగస్టు 4నుంచి 7 వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత(Kavitha) మాట్లాడుతూ ఆగస్టు 4న ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష ప్రారంభిస్తానని వెల్లడించారు.
Also Read: Supreme Court: ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు
ఈ నెల 7 ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి,(Telangana Jagruti) యూపీఎఫ్ చేసిన పోరాటాలకు దిగొచ్చే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్‌లో బీసీల కోసం రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందన్నారు. కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కానీ, ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పకుండా పార్టీ పరంగా ధర్నా చేస్తామని పిలుపునివ్వడం బీసీలను వంచించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఆ గడువులోగా ఎన్నికలు ఎంత ముఖ్యమో, బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచడం కూడా అంతే ముఖ్యమన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే, రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు.
ఏం ప్రయోజనం?
తమిళనాడులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు న్యాయపోరాటం చేసి రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోనూ ఎన్నికలు నిర్వహించాల్సిన అత్యవసరం ఏమీలేదని, రిజర్వేషన్ల కల్పనే ముఖ్యమన్నారు. బీసీ సీఎం, బీసీ పీఎం అంటున్న బీజేపీ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎందుకు అడ్డుతగులుతోందని ప్రశ్నించారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి లేదని, తప్పించుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ప్రయోజనం శూన్యమన్నారు. ఆర్డినెన్స్ విషయంలో న్యాయపోరాటం ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీతో ఉన్న ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలంటే వెంటనే హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారని, ఢిల్లీలో ధర్నా అంటే అదేమైనా సత్రం భోజనమా? అని ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల్లో లబ్దికోసమే ఢిల్లీలో కాంగ్రెస్ దీక్ష అని కవిత మండిపడ్డారు.