Fertility Centers: అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఫర్టిలిటీ సెంటర్ల దందాలకు అదుపు లేకుండా పోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌గా తనిఖీలు, రెయిడ్స్ లేకపోవడంతో ఆయా కేంద్రాల దందాలు యథేచ్చగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనూ ఇలాంటి దందాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రభుత్వానికి ప్రిలిమినరీ రిపోర్ట్ అందింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉమ్మడి ఏపీ నుంచి ఈ దందాలు కొనసాగుతున్నట్లు స్వయంగా వైద్యాధికారులే ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. సికింద్రాబాద్ ఘటన తర్వాత మేల్కొన్న అధికారులు, సోమవారం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సమక్షంలో అత్యవసర రివ్యూ నిర్వహించారు. సరోగసీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఆయా కేంద్రాల్లో వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి? పేద మహిళలను ఎలా టార్గెట్ చేస్తున్నారు? లోపాలు ఎక్కడ ఉన్నాయి? వైద్యారోగ్యశాఖ పాత్ర ఏంటి? అధికారుల నిర్లక్ష్యం ఎక్కడ ఉన్నది? అనే తదితర అంశాలపై కమిషనర్ ఆరా తీశారు. పూర్తి స్థాయిలో స్టడీ చేసిన కమిషనర్, సీరియస్‌గా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో తప్పనిసరిగా ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. సరోగసీ పేరిట పేదలను మోసం చేస్తున్న కేంద్రాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెన్యూవల్స్ కానీ కేంద్రాల్లోనే ఎక్కువ?
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సరోగసికి సర్కార్ అనుమతి తప్పనిసరి. సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకునే భార్యాభర్తలు వైద్యారోగ్యశాఖ కమిషనర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కమిటీ డాక్టర్ల రిపోర్టులతో పాటు కోర్టు అనుమతి తదితర డాక్యుమెంట్లను సంపూర్ణంగా పరిశీలిస్తుంది. ఆయా మహిళకు గర్భం దాల్చే పరిస్థితి లేదా? అనే అంశంపై స్పష్టంగా అధ్యయనం చేసిన తర్వాత కమిటీ ఆమోదం మేరకు అప్రూవల్ ఇస్తారు. కానీ, కొన్ని కేంద్రాలు ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రెన్యూవల్ కానీ, సరోగసీ కేంద్రాల్లోనే ఇలాంటి దందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఘటనలో ఇదే తేటతేల్లం అయింది. వాస్తవానికి 2022 కంటే ముందు ఏఆర్టీ సెంటర్లకు డీఎమ్‌హెచ్‌వోలే నేరుగా పర్మిషన్లు ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ విధానం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయానికి మారింది.
Read Also- Surrogacy: వెలుగు చూస్తున్న డాక్టర్ నమ్రత లీలలు.. రెండు రాష్ట్రాల్లో నెట్‌వర్క్
292 కేంద్రాల్లో సరోగసీ?
రాష్ట్ర వ్యాప్తంగా 292 కేంద్రాల్లో సరోగసీ జరుగుతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్నది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 126 కేంద్రాలు, మేడ్చల్‌లో 40, రంగారెడ్డిలో 47, వరంగల్‌లో 27, కరీంనగర్‌లో 13, ఖమ్మం 8, నిజామాబాద్ 8 కేంద్రాలు చొప్పున ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో యావరేజ్‌గా రెండు చొప్పున కేంద్రాలు ఉన్నాయి. 18 జిల్లాల్లో మాత్రమే ఈ క్లినిక్‌లో యాక్టివ్ మోడ్‌లో ఉన్నట్లు ప్రిలిమినరీ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక పిల్లలు కలుగని దంపతులు మరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లలను కనే పద్ధతినే సరోగసీ అంటారు. ఈ విధానంలో పిల్లలు కావాలనుకునే జంటలో పురుషుడి వీర్యాన్ని స్వీకరించి మరొక మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. ఆ జంట కోసం పిల్లలను తన కడుపులో పెంచి, ప్రసవించే మహిళను సరోగేట్ మదర్ అంటారు. సరోగసీ అనేది పిండాన్ని తయారు చేయడానికి వైద్య ప్రక్రియల ద్వారా పురుషుడి స్పెర్మ్‌తో స్త్రీ, గుడ్డును ఫలదీకరణం జరిగేలా అద్దె తల్లి గర్భాశయంలో నిర్వహిస్తారు. పిల్లలు కావాలని భావించే దంపతుల అతృతను ఈ కేంద్రాలు ఆసర చేసుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. వాస్తవంగా సరోగసి పిల్లలకు చట్టపరమైన హక్కులకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఉద్దేశించిన తల్లిదండ్రులు, అద్దె తల్లులు ముందస్తుగానే ఒప్పందాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు అద్దె తల్లులు, పిల్లలు కావాలనుకునే పేరెంట్స్ మధ్య వాగ్వాదాలు సంభవిస్తున్నాయి. అంతేగాక కొంత మంది మహిళలకు సరోగసీ విధానంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది. ఇలాంటి సమయంలో రూల్స్ ప్రకారం వెంటనే సరోగసీ నియంత్రణ ఆథారిటీ, బోర్డు ఇన్వాల్వ్ అయి బాధితులకు న్యాయం చేసే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థలను అన్నింటినీ దాటుతూ ఈ కేంద్రాలు లక్షల రూపాయలు వసూళ్లు చేయడం గమనార్హం.
Read Also- Shane Tamura: అమెరికాలో కాల్పులు.. కిల్లర్ మాములోడు కాదు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!