Surrogacy: నమ్రత.. వృత్తిరీత్యా డాక్టర్. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఆమె డబ్బు సంపాదన కోసం అమ్మతనాన్నే అంగట్లో సరుకుగా మార్చేసింది. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు, గత్యంతరం లేని పరిస్థితుల్లో అబార్షన్లు చేయించుకోవాలనుకున్న వారినే టార్గెట్ చేసింది. డబ్బు ఆశ చూపించి వారి నుంచి పిల్లలను కొనుక్కుంది. ఆ తర్వాత సంతానం కోసం తన వద్దకు వచ్చిన వారికి సరోగసీ ద్వారానే మీ కల నెరవేరుతుందని నమ్మించి కొన్న పసికందులను వారికి అమ్మేసింది. ఒక్కో జంట నుంచి రూ.30 నుంచి 35 లక్షలు వసూలు చేసింది. దీని కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఏజెంట్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది. పలు క్లినిక్‌లతో కాంటాక్ట్స్ పెట్టుకుంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే వైద్య శాఖలోని కొందరు అధికారులు ఆమెకు సహకరించడమే! ఈ క్రమంలో డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు చేసిన అక్రమాల చిట్టాను బయటకు తీయటంతో పాటు ఆమెకు సహకరించిందెవరు? అని తెలుసుకోవటానికి పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నమ్రతతోపాటు అరెస్ట్ చేసిన మిగితా నిందితులను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్దాఖలు చేశారు.
సెంటిమెంటే అవకాశంగా..
పెళ్లయిన ప్రతీ ఒక్కరూ అమ్మ, నాన్నా అని పిలిపించుకోవాలని ఆశ పడటం సహజం. దీని కోసం గుళ్లు, గోపురాలు తిరుగుతుంటారు. అయినా, సంతానం కలగకపోతే సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదిస్తారు. యూనివర్సల్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్న డాక్టర్ నమ్రత సరిగ్గా ఇలాంటి వారినే టార్గెట్‌గా చేసుకున్నది. పిల్లల కోసం తన వద్దకు వచ్చిన వారికి చికిత్స చేస్తే సంతానం కలిగే అవకాశాలు ఉన్నా ఆ విషయాన్ని వారికి చెప్పకపోయేది. ‘ అన్ని పరీక్షల ఫలితాలు చూశాను మీకు నేరుగా బిడ్డను కనే అదృష్టం లేద’ని నమ్మించేది. సరోగసీ ద్వారా పిల్లలు పుట్టేలా చూస్తానని చెప్పేది. పరాయి వారి బిడ్డ అని అనుకోవద్దు, మీ భర్త వీర్యం నుంచే సంతానం కలిగేలా చేస్తానని ఉచ్చులోకి లాగేది. వివాహమై ఏళ్లు గడుస్తున్నా బిడ్డ పుట్టక పోవటంతో తన వద్దకు వచ్చిన రాజస్తాన్ దంపతులు గోవింద్ సింగ్, సోనియాలను ఇలాగే నమ్మించింది. సరోగసీ ద్వారా మీరు తల్లిదండ్రులయ్యే అదృష్టాన్ని కలిగిస్తానని చెప్పి వేరెవరికో పుట్టిన బిడ్డను వారికి అప్పగించింది. దీని కోసం గోవింద్ సింగ్ దంపతుల నుంచి రూ.30లక్షలు వసూలు చేసింది. అయితే, తమకు అప్పగించిన బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు జరిపించగా ఆ శిశువు తమ కుమారుడు కాదని నిర్ధారణ కావటంతో గోవింద్ సింగ్ దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో డాక్టర్ నమ్రత బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఏజెంట్లతో నెట్ వర్క్..
దర్యాప్తులో పాలు పంచుకున్న ఓ అధికారి చెప్పిన ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా 30 మందికి పైగా పని చేస్తున్నారు. వీరు చేయాల్సిందల్లా పేదరికంలో మగ్గిపోతూ పిల్లలను పోషించుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించడమే. మీకెలాగూ ఆర్థిక స్తోమత లేదు కాబట్టి పుట్టిన పిల్లలను మాకప్పగించండి.. డబ్బులిస్తామని ఆశ చూపించి దానికి వారిని ఒప్పించటం. ఇలా ఏజెంట్ల ద్వారా కొన్న పిల్లలను డాక్టర్ నమ్రత సరోగసీ ద్వారా మీకు పుట్టారంటూ సంతానం కోసం తన వద్దకు వచ్చిన వారికి ఇస్తూ వచ్చింది. ఇక, డాక్టర్ నమ్రతకు హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్టణంలోని పలు క్లినిక్‌లతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా పోలీసువర్గాల ద్వారా తెలిసింది. దాంతోపాటు గ్రామాలు, పట్టణ కేంద్రాల్లో ఆర్ఎంపీలుగా ప్రాక్టీస్ చేస్తున్న వారితో కూడా కాంటాక్ట్స్ ఉన్నట్టు సమాచారం. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనో ఇతర కారణాల వల్లనో పిల్లలు వద్దనుకునేవారిలో చాలా మంది అబార్షన్ల కోసం చిన్న చిన్న క్లినిక్‌లు, ఆర్ఎంపీల డాక్టర్లను ఆశ్రయించే విషయం తెలిసిందే. తనకున్న పరిచయాలతో డాక్టర్ నమ్రత ఇలా పిల్లలు వద్దనుకునే వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది. దీనికోసం ఆయా క్లినిక్‌ల నిర్వాహకులు, ఆర్ఎంపీ డాక్టర్లతో అబార్షన్ కోసం వచ్చిన వారికి గర్భందాల్చి 3 నెలల సమయం దాటి పోయింది. ఇప్పుడు అబార్షన్ చేస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదమని చెప్పించి భయపెట్టించేది. ఆ తర్వాత వాళ్లు పిల్లలను కనేలా చేసేది. ‘ మీరేం టెన్షన్ పడవద్దు, కాన్పు మేమే జరిపిస్తాం. పుట్టిన బిడ్డను కూడా తీసుకుంటాం. డబ్బు కూడా ఇస్తా’మని చెప్పి తన ఏజెంట్ల ద్వారా డాక్టర్ నమ్రత పిల్లల వ్యాపారాన్ని సాగించినట్టుగా సమాచారం. కొన్నిసార్లు తాను నడుపుతున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో, మరికొన్నిసార్లు తనకు సహకరిస్తూ వచ్చిన డాక్టర్ల క్లినిక్‌లలో ప్రసవాలు జరిపించిందని తెలిసింది. ఇలా గడిచిన రెండు మూడేళ్లలోనే డాక్టర్ నమ్రత దాదాపు యాభై మందికి పైగా సరోగసీ ద్వారా పుట్టారంటూ పిల్లలను ఇచ్చినట్టుగా సమాచారం.
Read Also- CM Revanth: బీసీ రిజర్వేషన్ విషయంలో తగ్గేదే లే!
లెక్కలేనంత మంది?
ఈ వ్యవహారంపై పోలీసు వర్గాలతో మాట్లాడగా పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే అన్ని వివరాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత విజయవాడ, విశాఖపట్టణంలో నడుపుతున్న బ్రాంచీల్లో వైద్య విభాగ అధికారులు తనిఖీలు చేశారన్నారు. హైదరాబాద్‌తో పాటు మిగితా రెండు చోట్ల ఉన్న బ్రాంచీల్లో ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులకు ఎంతమందికి డాక్టర్ నమ్రత సరోగసీ పేర పిల్లలను ఇచ్చిందన్న దానిపై పూర్తి వివరాలు ఇప్పటి వరకూ లభ్యం కాకపోవటం గమనార్హం. దీనిపై దర్యాప్తు వైద్య శాఖకు చెందిన ఓ డాక్టర్‌తో మాట్లాడగా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలంటే చట్టబద్దమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. దీని కోసం ప్రత్యేక కమిటీకి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారన్నారు. దీనికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు సమయం పడుతుందన్నారు. ఇలా అనుమతులు తీసుకుని సరోగసీ ద్వారా పిల్లలను అందిస్తే ఖచ్చితంగా రికార్డులు మెయిన్‌టైన్ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, నమ్రత అక్రమ దారుల్లో సరోగసీ పేర పిల్లల విక్రయాలు జరిపిన నేపథ్యంలో ఆమె ఎంతమంది పసికందులను ఇలా అంగట్లో సరుకుగా మార్చిందన్న దానికి సంబంధించి రికార్డులు దొరకటం దాదాపుగా అసాధ్యమన్నారు.
కస్టడీకి..
ఈ క్రమంలోనే కేసును దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు సంతాన సాఫల్య కేంద్రం పేరిట చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తూ వచ్చి పట్టుబడ్డ డాక్టర్ నమ్రతతోపాటు అరెస్ట్ చేసిన మిగితా ఏడుగురిని వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే ఇప్పటి వరకు ఆమె ఎంతమందికి సరోగసీ పేర పిల్లలను ఇచ్చిందన్నది స్పష్టం కాగలదని విచారణాధికారులు చెబుతున్నారు. దాంతోపాటు ఆమె ఎవరెవరి నుంచి పిల్లలను కొన్నది? ఎవరెవరికి పిల్లలను అప్పగించిందన్న వివరాలు కూడా అప్పుడే బయట పడతాయని అంటున్నారు.
Read Also- Gold Rates (29-07-2025): మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్