Divya – Darshan: దక్షిణాదికి చెందిన ప్రముఖ నటిమణుల్లో రమ్య (అసలు పేరు దివ్య స్పందన) ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో చిత్రాలు చేసిన ఆమె.. సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్, అభిమన్యు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు. అటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎంపీగాను సేవలు అందించారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఓ ఫిర్యాదు ద్వారా తాజాగా వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తనను దూషిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే?
నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన (Divya Spandana) బెంగళూరు పోలీసులు (Bengaluru Police), కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ (Karnataka State Women’s Commission) కు ఫిర్యాదు చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ (Darshan)కు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు (Supreme Court) చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆమె సోషల్ మీడియా వేదికగా ఉటంకించారు. ‘సుప్రీం కోర్టు సామాన్య ప్రజలకు ఆశాకిరణం. రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ఎక్స్ (Twitter) పోస్ట్ పెట్టారు. దీనికి సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త క్లిప్ ను జత చేశారు. అయితే ఈ పోస్ట్ కు ప్రతిస్పందనగా దర్శన్ అభిమానులు.. ఆమెపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అసభ్యకర సందేశాలు, అత్యాచారం, హత్య బెదిరింపులతో ఆమెను దూషిస్తున్నారు.
SC is a ray of hope for the common people of India- justice for the family of Renukaswamy 🤞🏽https://t.co/Qr0biXBYgY pic.twitter.com/wSSi3klhTv
— Ramya/Divya Spandana (@divyaspandana) July 24, 2025
చర్యలకు హామీ
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడి నేపథ్యంలో దివ్య స్పందన.. రాష్ట్ర మహిళా కమిషన్, బెంగళూరు పోలీసులు కమిషనర్ ను ఆశ్రయించారు. తనను బెదిరిస్తూ దూషిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నెట్టింట తనపై ఉన్న అసభ్యకర కంటెంట్ ను తొలగించాలని నటి అభ్యర్థించారు. మరోవైపు నటి ఫిర్యాదు నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్.. బెంగళూరు పోలీసులకు లేఖ రాసింది. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ హామీ ఇచ్చారు.
Also Read: RS Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాట మార్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నటి ఏమన్నారంటే?
‘నటుడు దర్శన్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం పట్ల తాము సంతోషంగా లేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన వార్తాపత్రిక నివేదికను ట్వీట్‌తో ప్రచురించాను. సుప్రీంకోర్టు భారతదేశంలోని సామాన్య ప్రజలకు ఆశాకిరణం. రేణుకస్వామికి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అని పెట్టాను అంతే’ అని దివ్య స్పందన అన్నారు. ఆ తర్వాత తనపై సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దర్శన్ మద్దతుదారులు నన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రేణుకాస్వామికి బదులుగా నిన్ను హత్య చేయాల్సిందని అన్నారు. నాకు అత్యాచార బెదిరింపులు, అసభ్యకరమైన సందేశాలు పంపారు. సమాజం ఎంతగా దిగజారిపోయిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావించి ఫిర్యాదు చేశాను’ అంటూ దివ్య స్పందన చెప్పుకొచ్చారు.