Lok Sabha: ‘ఆపరేషన్ సిందూర్’ అంశంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) సోమవారం మాట్లాడారు. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య జరిగిన చర్చల్లో వాణిజ్యానికి సంబంధం అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదని సభకు తెలిపారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను ఆపేందుకు వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న ఆరోపణలను జైశంకర్ ఖండించారు.
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రోజు 2024 ఏప్రిల్ 22 నుంచి భారత్-పాక్ కాల్పుల విరమించిన రోజు జూన్ 17 వరకు ప్రధాన మంత్రి మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదని జైశంకర్ సభకు తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో అమెరికాతో జరిగిన చర్చలపై ఆయన వివరణ ఇచ్చారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేసి పాకిస్థాన్ భారీ దాడి చేయబోతోందని హెచ్చరించారని చెప్పారు. పాకిస్థాన్ కంటే బలంగా ప్రతిస్పందిస్తామంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారని జైశంకర్ వెల్లడించారు. మే 9, 10 తేదీలలో పాకిస్థాన్ పదేపదే జరిపిన దాడులను భారత్ అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టిందని జైశంకర్ లోక్‌సభకు తెలిపారు.
Read Also- US News: అమెరికాలో భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. ఏం చేశాడో తెలుసా?
అనేక దేశాలు భారత్‌ను సంప్రదించాయి
పాకిస్థాన్ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందంటూ మే 10న అనేక దేశాలు భారత్‌ను సంప్రదించాయని మంత్రి జైశంకర్ తెలిపారు. అయితే, పాక్ నుంచి వచ్చే కాల్పుల విరమణ ప్రతిపాదనలు ఆ దేశానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ద్వారా వస్తే మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామంటూ ఆయా దేశాలకు చెప్పామని జైశంకర్ వెల్లడించారు. జైశంకర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన తెలుపుతుండగా విదేశాంగ మంత్రికి మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మధ్యలో కలగజేసుకొని ప్రసంగించారు. ‘‘మన దేశ విదేశాంగ మంత్రిని నమ్మని ఈ ప్రతిపక్ష సభ్యులు, ఇతర దేశాల మాటలను మాత్రం బాగానే నమ్ముతారు. వాళ్ల నైతిక స్థితి ఇదే. భారత విదేశాంగ మంత్రిపై నమ్మకం లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. వాళ్ల పార్టీలో విదేశాలు ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకోగలను. కానీ, వాళ్లకు పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై ఈ సభపై రుద్దవద్దు. వాళ్లు విపక్ష బెంచీలలో కూర్చోవడానికి కారణం ఇదే. వచ్చే 20 ఏళ్లు కూడా అదే బెంచీలలో కూర్చుంటారు’’ అని అమిత్ షా ఎద్దేవా చేశారు.
Read Also- US News: అమెరికాలో భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. ఏం చేశాడో తెలుసా?
రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారంటే?
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంపై పాకిస్థాన్‌పై భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ సోమవారం మొదలైంది. దేశ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ఈ అంశంపై చర్చను ప్రారంభించారు. యుద్ధభూమిలో వీరత్వాన్ని ప్రదర్శించిన భారత సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఒక చారిత్రాత్మక సైనిక చర్య అని, ఉగ్రదానికి వ్యతిరేకంగా మన దేశ విధానాన్ని స్పష్టంగా, ప్రభావవంతంగా చూపించే చర్యగా ఆయన అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్‌ను అమలు పరచడానికి ముందు మన బలగాలు ప్రతి కోణాన్ని సూక్ష్మంగా పరిశీలించాయని, ఉగ్రవాదులకు ఎక్కువ నష్టం కలిగించే మార్గాన్ని సేనలు ఎంచుకున్నాయని ఆయన ప్రకటించారు.