Fake Pensions: ‘ఆత్మలకు చేయూత’, ‘అనర్హులకు పెన్షన్’ అంటూ స్వేచ్ఛ ఈ పేపర్‌లో వచ్చిన సంచలన కథనాలతో సర్కార్‌లో కదలిక వచ్చింది. ఆసరా పింఛన్లు పక్కదారి పడుతున్నాయని, చనిపోయినవారి పేర్లతో పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. వాటికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఎల్లుండి నుంచి (29న) ఫేస్ రికగ్నిషన్‌తోనే పింఛన్ ఇవ్వనున్నది. అంతేగాకుండా పోస్టాఫీసుల్లోని బోర్డులపై ఫించన్ లబ్దిదారుల వివరాలను సైతం ప్రదర్శించనున్నారు. అదే విధంగా ప్రతి లబ్దిదారుడు కేవైసీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బోగస్‌కు చెక్
తెలంగాణలో బోగస్పింఛన్లకు చెక్పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇకపై పింఛన్‌దారులకు ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) తప్పనిసరి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నకిలీలను అరికట్టడంతోపాటు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మంగళవారం నుంచి పింఛన్‌దారుల ఫేస్రికగ్నిషన్నమోదు ప్రక్రియను ప్రారంభించాలని సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు డీఆర్‌డీవోలకు (జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు) ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కోసం రూపొందించిన యాప్‌లో అప్లోడ్చేసేందుకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌లు, వేలిముద్రలకు సంబంధించి పరికరాలు, ఇతర పరికరాలను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు అందించాలని డీఆర్డీఓలను ఆదేశించారు. ఒకవేళ ఈ పరికరాలు అందకపోతే పోస్ట్ మాస్టర్లు, పంచాయతీ కార్యదర్శులు తమ సొంత ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పోస్టాఫీస్‌ల్లో చేయూత లబ్ధిదారుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించింది. దీంతో నకిలీలను గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
కట్టుదిట్టమైన చర్యలు
ప్రతినెలా ప్రభుత్వం ఆసరా పింఛన్లు మంజూరు చేస్తుంది. అయితే పింఛన్‌దారులకు అందజేసే సమయంలో లబ్దిదారుల వేలిముద్రలను పోస్ట్ ఆఫీసులోగానీ, పంచాయతీ కార్యదర్శులు తీసుకుంటున్న సమయంలో వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేలిముద్రలు పడని వారికి కార్యదర్శులు, పోస్టుమాస్టర్, బిల్ కలెక్టర్లు ధ్రువీకరించిన తర్వాతే పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రత్యేక యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రతినెలా వారి ఫొటో తీసి యాప్‌లో పెట్టిన తర్వాతనే పెన్షన్‌లు జారీ చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల పింఛన్ దారులు మృతిచెందినా, వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఆసరా పింఛన్‌దారులకు ఫేస్ రికగ్నిషన్ తీసుకొచ్చింది. ఈ యాప్అందుబాటులోకి వస్తే వృద్ధులకు పింఛన్కష్టాలు తొలగనుడటంతో పాటు బోగస్పింఛన్లకు అడ్డుకట్ట పడనున్నదాని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేవైసీ తప్పనిసరి
ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్‌ను ప్రభుత్వం అందజేస్తున్నది. వారికి ప్రతి ఏటా కేవైసీ సమర్పించాలనే నిబంధనను పెట్టింది. దీంతో వారు ప్రతి సంవత్సరం కేవీసీని అందజేస్తేనే వారికి పెన్షన్ ఇస్తుంది. అదే నిబంధనలను ఆసరా పింఛన్‌దారులకు సైతం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బోగస్ ఫించన్లకు అడ్డుకట్ట వేయాలంటే ఈ నిబంధన తప్పనిసరి అని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే ప్రభుత్వ డబ్బులు సైతం పక్కదారి పట్టకుండా చెక్ పెట్టొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 42.67లక్షల మంది పింఛన్‌దారులు ఉండగా అందులో వృద్ధాప్య పింఛన్లు 15.25 లక్షలు, వితంతువులు 15.26 లక్షలు, దివ్యాంగులు 4.92 లక్షలు, గీత కార్మికులు 63 వేలు, చేనేత 36 వేలు, హెచ్ఐవీ బాధితులు 35 వేలు, డయాలసిస్ రోగులు 8 వేలపైగా, ఫైలేరియా రోగులు 18 వేలు, బీడీ కార్మికులు 4.23 లక్షలు, ఒంటరి మహిళలు 1.41 లక్షలు, బీడీ కార్మికులు 4 వేల మంది పింఛన్ పొందుతున్నారు.
Read Also- WWII: 13 ఏళ్ల వయసులోని కోరిక.. 103 ఏళ్లకు తీరబోతోంది.. తాత మీరు సూపర్!