- రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది
- పార్టీని నడపలేక కేసీఆర్ చేతులెత్తేశారు
- పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది
- ఆ ఆక్రోశంతోనే కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
- సోషల్ మీడియా ద్వారా మోదీ సహా బీజేపీ నేతలపై దుష్ప్రచారం
- ఖబడ్దార్ కేటీఆర్.. ఇకపై దుష్ప్రచారం చేస్తే అంతు చూస్తాం
- కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
Bandi Sanjay: అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ కుటుంబ పార్టీని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది. ఆ పార్టీని నడపలేక కేసీఆర్ చేతులెత్తేశారని సెటైర్లు వేశారు. పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, ఆ ఆక్రోశంతోనే కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చురకలంటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీఆర్ తిడుతున్నా స్పందించడం చేతకాని కాంగ్రెస్ నేతలు అంటూ మండిపడ్డారు.
ఖబడ్దార్ కేటీఆర్
కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో రూ.23.75 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ నూతన భవనాన్ని బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా ద్వారా మోదీసహా బీజేపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఖబడ్దార్ కేటీఆర్, ఇకపై దుష్ప్రచారం చేస్తే అంతు చూస్తాం, మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు’’ అని హెచ్చరించారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది బీసీ డిక్లరేషన్ కాదని, ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్ అని అన్నారు. బీసీ ముసుగులో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఆ విష వృక్షాన్ని అడ్డుకోకుంటే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తాం. ముస్లిం రిజర్వేషన్లను బీసీ జాబితా నుండి తొలగించేదాకా ఉద్యమిస్తాం’’ అని అన్నారు.
రాహుల్ గాంధీది ఏ కులం?
మోదీ కన్వర్టెడ్ బీసీ అయితే, రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని బండి ప్రశ్నించారు. రాహుల్ తల్లి క్రిస్టియన్, తాత ముస్లిం నుండి వేరుపడ్డ పార్శీ మతస్తుడు అని గుర్తు చేశారు. అందుకే హిందుత్వాన్ని ధ్వంసం చేస్తామని విషం కక్కుతున్నారని విమర్శించారు. వైద్య, విద్య రంగాలకు మోదీ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని వివరించారు. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు నిధులు అధికంగా వైద్య రంగానికి కేటాయించారన్నారు.
Read Also- My Village Show Anil: ఓటీటీలోకి తెలంగాణ ప్రేమ కథ.. నవ్వించేది ఎప్పుడంటే?
గుడి కూల్చివేత దుర్మార్గం
బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేతపై స్పందించిన కేంద్రమంత్రి ఇది దుర్మార్గమని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత చేశారని ఆరోపించారు. తక్షణమే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో హిందువుల దమ్మేంటో చూపిస్తామన్నారు. 30 శాతం ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
సీఎం రమేశ్ చెప్పింది నిజమే..
బీజేపీలో బీఆర్ఎస్ చేరికపై సీఎం రమేశ్ చెప్పింది నిజమేనని అన్నారు. అది తప్పని నిరూపించే దమ్ము కేటీఆర్‌కు ఉందా అని సవాల్ విసిరారు. సీఎం రమేశ్‌ను రప్పించి వేదిక ఏర్పాటు చేయిస్తా డేట్, టైం ఫిక్స్ చేసి చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నా అని చెప్పారు. కుటుంబ, వారసత్వ పార్టీలకు బీజేపీ దూరమని, ఈ విషయం ప్రధాని మోదీ కూడా నిజామాబాద్ సభలోనే చెప్పారని బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also- MBBS Fees: రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్.. ఏ దేశంలో ఎంబీబీఎస్ ఫీజు తక్కువ?