Shubman Gill: మాంచెస్టర్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు టీమిండియా బ్యాటర్లు పోరాడుతున్నారు. ఆటకు చివరి రోజైన ఆదివారం 55 ఓవర్లు మిగిలివున్న సమయానికి భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ స్కోరు 263/4గా ఉంది. క్రీజులో ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా (24 బ్యాటింగ్), వాషింగ్టన్ సుందర్ (33 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సాధించిన స్కోర్‌కు టీమిండియా మరో 48 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో, ఈ మ్యాచ్ ఫలితం ఉత్కంఠగా మారింది. భారత బ్యాటర్లు నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలుగుతారా? లేదా? అనేది చూడాలి.
అయితే, ఇంగ్లండ్ సాధించిన 300లకు పైగా ఆధిక్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆదివారం అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. 238 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. పలు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.
Read Also- TCS layoffs 2025: టీసీఎస్ అనూహ్య ప్రకటన.. ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్
కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లోనే 4 శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డు సాధించాడు. ఇదివరకు విరాట్ కోహ్లీ కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. గిల్ కంటే ముందు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న తొలి టెస్టు సిరీస్‌లోనే వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, డాన్ బ్రాడ్‌మన్, గ్రెగ్ ఛాపెల్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ వంటి దిగ్గజాలు మూడేసి శతకాలు సాధించారు. ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్ వీరందరినీ అధిగమించాడు. అంతేకాదు, ఇంగ్లాండ్‌పై అత్యధిక శతకాలు సాధించిన కెప్టెన్‌గా డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల సరసన గిల్ చేశాడు. వీళ్లు గిల్ మాదిరిగానే నాలుగు శతకాలు చేసిన కెప్టెన్లుగా నిలిచారు. ఈ ఘనత సాధించిన మూడవ బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.
ఒక సిరీస్‌లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్లు
1. సునీల్ గవాస్కర్ -4 (1971లో వెస్టిండీస్‌పై విదేశీ గడ్డపై)
2. సునీల్ గవాస్కర్- 4 (1978లో వెస్టిండీస్‌పై స్వదేశంలో)
3. విరాట్ కోహ్లీ- 4 (2014-15లో ఆస్ట్రేలియాపై విదేశీ గడ్డపై)
4. శుభ్‌మన్ గిల్-4 (2025లో ఇంగ్లాండ్‌పై విదేశీ గడ్డపై)
సునీల్ గవాస్కర్ రెండు సిరీస్‌లలోనూ 4 శతకాలు సాధించి ప్రత్యేక స్థానాన్ని పొందారు.
Read Also- Fake Embassy: నకిలీ ఎంబసీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
మరో రికార్డు ఇదే..
టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తొలి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ ఆటగాళ్ల జాబితాలో కూడా శుభ్‌మన్ గిల్ టాప్-2 స్థానానికి దూసుకెళ్లాడు. ఈ లిస్ట్‌లో ఆసీస్ మాజీ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ 810 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. 1936-37లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. ఇక, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో శుభ్‌మన్ ఇప్పటివరకు 722 పరుగులు సాధించి ఈ జాబితాలో టాప్-2లో నిలిచాడు. ఆసీస్ మాజీ దిగ్గజం గ్రెగ్ చాపెల్ 1975-76లో వెస్టిండీస్‌పై 702 పరుగులు సాధించారు. వెస్టిండీస్ దిగ్గజ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ 1974-75లో భారత్‌పై 636 పరుగులు సాధించారు. ఈ జాబితాలో టాప్-5లో నిలిచిన ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పీటర్ మే 1955లో దక్షిణాఫ్రికాపై 582 పరుగులు సాధించారు.